పశ్చిమగోదావరి

క్రీడానగరంగా భీమవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 10: విద్యాకేంద్రంగా, ఆధ్యాత్మిక నగరంగా, వాణిజ్య పట్టణంగా ప్రగతి సాధించిన భీమవరంను క్రీడానగరంగా తీర్చిదిద్దుతానని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఇప్పటికే దంతులూరి నారాయణరాజు వంటి చరిత్ర కలిగిన కళాశాల దేశ వ్యాప్తంగా పేరు గడించిందని, ఇక నుంచి మరిన్ని క్రీడాపోటీలు నిర్వహించి క్రీడల్లో కూడా రాణించాలన్నారు. భీమవరం దంతులూరి నారాయణరాజు కళాశాల క్రీడాప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో 23వ జిల్లాస్థాయి అంతర పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ నెల 12వ తేదీవరకు జరగనున్నాయి. సోమవారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. క్రీడల స్ఫూర్తిగా టార్చ్‌ని వెలిగించారు. డిఎన్నార్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) హై జంప్ చేసి క్రీడలను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 17 కళాశాలల నుంచి 550 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యు.రంగరాజు, ప్రొఫెసర్ జివి రాజు, పాలకవర్గ సభ్యులు కుమార దత్తాత్రేయవర్మ, కె.శివరామరాజు, పి.రామకృష్ణంరాజు, పిడి బివి నరసింహరాజు, డాక్టర్ రాజా వత్సవాయి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

అప్కాప్ ఛైర్మన్ చల్లారావుకు మంత్రి రవీంద్ర అభినందనలు
మొగల్తూరు, డిసెంబర్ 10: అప్కాప్ ఛైర్మన్‌గా ఎంపికైన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన మత్స్యకార సంఘ నాయకుడు అండ్రాజ్ చల్లారావు సోమవారం అమరావతిలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర అప్కాప్ ఛైర్మన్ చల్లారావును అభినందించారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసి అప్కాప్‌కు మంచి గుర్తింపు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. ఛైర్మన్ చల్లారావు వెంట రాష్ట్ర పల్లవ సేన అధ్యక్షుడు కొల్లాటి బాబూరావు తదితరులున్నారు.

బెజవాడలో బీజేపీ నేతల అరెస్టు
భీమవరం, డిసెంబర్ 10: భారతీయ జనతా యువమోర్చ విజయవాడలో బాబూ ఏదీ జాబు అనే నినాదంతో చేపట్టిన ఆందోళనకు జిల్లా నుంచి తరలివెళ్ళిన నేతలను అక్కడ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఈ కార్యక్రమాన్ని రాష్టస్థ్రాయిలో నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లా అధ్యక్షుడు ఆకుల లీలాకృష్ణ, ఉపాధ్యక్షుడు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్‌తోపాటు రాష్ట్ర కార్యదర్శి గోకవరపు శ్రీనివాస్, భారీ ఎత్తున కార్యకర్తలు తరలివెళ్లారు. ధర్నా జరుగుతున్న సమయంలో బెజవాడ పోలీసులు ఈ ధర్నాను భగ్నం చేశారు. అదే సమయంలో జిల్లాకు చెందిన యువమోర్చ నేతలను అక్కడి పోలీసులు జీపులో ఉయ్యూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని పమిడిముక్కల పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ పోలీసు స్టేషన్ విజయవాడ నుంచి సుమారు 45 కిలోమీటర్లు దూరం ఉంటుంది. పోలీసు స్టేషన్‌లో ఉంచిన భారతీయ జనతా యువమోర్చ నాయకులకు కనీసం సౌకర్యాలు కల్పించలేదు. దీంతో పోలీసులతో రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్‌నాయుడు, జిల్లా అధ్యక్షుడు ఆకుల లీలాకృష్ణ, ఉపాధ్యక్షుడు అడబాల శివ తదితరులు వాగ్వివాదానికి దిగారు. అయినా వారికి సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వంపై జిల్లా నేతలు విరుచుకుపడ్డారు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా యువమోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని ఆకుల లీలాకృష్ణ ప్రకటించారు.

ఆకివీడులో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి సేవలు ప్రారంభం
ఆకివీడు, డిసెంబర్ 10: ఆకివీడులో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి సేవలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సోమవారం ఆకివీడులో స్థలదాత పేరూరి వెంకటేశ్వర్లు, కాశీరత్నం దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వైద్యులు ఎంవి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నేత్రవైద్య కేంద్రం ఆకివీడులో ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఎల్వీ ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచితంగా సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రతాప్‌కుమార్, గొట్టుముక్కల శ్రీరామరాజు, చుండూరి వెంకట్రావు, సాగి రామరాజు, మాధవి, కిరణ్, మహేష్, ఝూన్సీ, జెఎస్‌ఆర్ తదితరులు పాల్గొన్నారు.

మరోసారి గ్రీన్‌ఫీల్డ్ హైవే సర్వే పనులకు బ్రేక్
*పుట్లగట్లగూడెంలో అడ్డుకున్న రైతులు
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 10: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకోసం సేకరించనున్న భూముల సర్వే పనులు మండలంలోని పుట్లగట్లగూడెంలో రెవెన్యూ అధికారులు సోమవారం మరోసారి చేపట్టారు. ఈసారి కూడా రైతులు అడ్డుకున్నారు. సర్వే పనులు తక్షణమే నిలిపివేయాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. సర్వేకోసం వచ్చిన అధికారులను వెనక్కి వెళ్ళిపోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శీలం కృష్ణంరాజు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన గ్రామంలో సర్వేయర్లు వచ్చి చేస్తున్న సర్వే పనులు అడ్డుకున్నామని, తహసీల్దార్ వచ్చి రైతులతో చర్చించారని, ఆయనకు వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ మరల సోమవారం రైతులకు ఎటువంటి సమాచారం లేకుండా మరల సర్వే బృందాలు వచ్చి సర్వే పనులు చేపట్టడంతో నిరసన వ్యక్తం చేశామని చెప్పారు. పుట్లగట్లగూడెంలో హైవేకోసం సేకరించే భూమి రెట్టింపు అవుతోందని, హైవేతో పాటు ఈ హైవే మొత్తానికి ఇక్కడే పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలతో అధికారులు రెట్టింపు భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ హైవే వల్ల గ్రామస్థులు చాలవరకు సాగు భూములు కోల్పోవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు భూములను బలవంతంగా లాక్కుని హైవే నిర్మాణం చేస్తే సహించేది లేదని, గ్రామస్థులంతా ఐక్యంగా అడ్డుకుంటామని కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు పారేపల్లి వీరవెంకట సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు కొండ్రెడ్డి సోమరాజు, రైతు నాయకులు అప్పన భాస్కరరావు, కనకాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

జనసేన సామాజిక న్యాయం విభాగం జిల్లా కన్వీనర్‌గా విల్సన్
నరసాపురం, డిసెంబర్ 10: జనసేన పార్టీ సామాజిక న్యాయం విభాగం జిల్లా కన్వీనర్‌గా భీమవరానికి చెందిన విల్సన్, కో-కన్వీనర్‌గా తాడేపల్లిగూడెంకు చెందిన దినేష్ యాదవ్ నియమితులయ్యారు. సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సామాజిక న్యాయం విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా కమిటీని ఎంపిక చేశారు. కమిటీ జాయింట్ కన్వీనర్లుగా పోలవరానికి చెందిన డి సృజన, ఆచంటకు చెందిన ఆలి, ఏలూరుకు చెందిన జాఫర్‌లతో పాటు మరో 14 మంది సభ్యులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త కలవకొలను నాగతులసీరావు మాట్లాడుతూ జనసేన పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు జనసేనకు మద్దతు పలుకుతున్నారన్నారు. అలాగే ఇటీవల నిర్వహించిన జనసేన తరంగం కార్యక్రమం విజయవంతం చేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనసేన తరంగం ద్వారా రాష్ట్రంలోని కోటి 25 లక్షల మంది ప్రజలను పార్టీ నాయకులు నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారని నాగతులసీరావు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్ యర్రా నవీన్, నాయకులు డాక్టర్ ఇలపకుర్తి ప్రకాష్, మైల వీర్రాజు, బర్రే జయరాజు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, చల్లా దానయ్య నాయుడు, దివి సత్యన్ తదితరులు పాల్గొన్నారు.