పశ్చిమగోదావరి

నిబద్ధత, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 11: జిల్లాలో సాధారణ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతిఒక్కరూ నిబద్ధత, నిష్పక్షపాతంగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక రామచంద్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల విధులను నిర్వర్తిస్తున్న ఆర్వోలు, ఏఇఈఆర్వో, నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులు, పోలీస్ తదితర 1500 మంది ఎన్నికల సిబ్బందికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి, మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత ఉంచాలన్నారు. ఇందుకు సంబంధిత అంశాలను క్షుణ్ణంగా చదివి అర్ధం చేసుకోవాలన్నారు. ఒకవేళ ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఎన్నికల నియమావళిలో పేర్కొన్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో కచ్ఛితంగా అమలు చేసి తీరాలన్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించడంతోపాటు వాటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. జిల్లాలో సాధారణ ఎన్నికల నిమిత్తం 20 నుండి 25 వేల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. జిల్లాలో 30 లక్షల 57 వేల 922 మంది ఓటర్లు తమ ఓటుహక్కును ఏప్రిల్ 11న జరిగే సాధారణ ఎన్నికల్లో వినియోగించుకుంటారని, వారి అభీష్టం మేరకు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత మనపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిని నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎంతో సహనం అవసరమన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సమయంలో నిర్లక్ష్యానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కాకుండా చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అత్యవసరమైతే అక్కడకు చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా గుర్తించాలన్నారు. స్థానిక బూత్‌లెవెల్ అధికారులు స్థానిక ప్రాంతంపై అవగాహన కలిగి ఉంటారని, వారి సేవలు పూర్తిగా వినియోగించుకుంటే పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుకోవచ్చన్నారు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు రూ.70 లక్షలు, ఎమ్మెల్యేకు పోటీచేసే అభ్యర్థులు రూ.28 లక్షలు వరకు ప్రచార తదితర ఖర్చును పరిమితం చేసుకోవల్సి ఉందన్నారు. ఈ దృష్ట్యా వారి ప్రచార కార్యక్రమాల ఖర్చు, పత్రికలకు ప్రకటన రూపంలో చేసే ఖర్చు తదితర వివరాలను ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు. అనుమతిలేని ఫ్లెక్సీలు, గోడ రాతలను పూర్తిగా తొలగించాలని, ఎక్కడైనా ప్రైవేటు భవనాలపై అటువంటివి రాసి ఉంటే సంబంధిత యజమాని సమ్మతి ఉన్నదీ లేనిదీ పరిశీలించాలన్నారు. ఈ విడత ఎన్నికల సమయంలో కేంద్ర సాధారణ, వ్యయ పరిశీలకులు పెద్ద సంఖ్యలో రానున్నారని, వారు క్షేత్రస్థాయిలో చేసే తనిఖీల సమయంలో వెలిబుచ్చే సందేహాలను, వివరాలను స్పష్టంగా సంబంధిత అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ రోజున అవసరమయ్యే స్టేషనరీ తదితర సామాగ్రిని నిబంధనల మేరకు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌నుండి వచ్చే ప్రతి ఉత్తర్వును క్షుణ్ణంగా అర్ధం చేసుకుని వాటిని అమలు చేయాలన్నారు. పత్రికల్లో వచ్చే ఎన్నికల ప్రకటనలు, పెయిడ్ న్యూస్, సోషల్ మీడియాపై కూడా గట్టి నిఘా ఉంటుందని, ఇందుకు సంబంధించి ఎంసిఎంసి కమిటీ తన విధులను నిర్వర్తిస్తుందన్నారు. ఎన్నికల నిర్వహణలో నియమావళికి ఎక్కడైనా ఉల్లంఘటన జరిగిన, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభ కార్యక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు సి విజిల్ యాప్‌ను ఎన్నికల సంఘం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను నిర్దేశించిన సమయంలో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్, ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతల పరిరక్షణ అక్రమ నగదు, మద్యం ప్రభావాన్ని నివారించేందు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 3411 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 1057 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. ఆర్మ్‌డ్ పోలీస్ విధులు నిర్వర్తిస్తుందన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిబంధనలకు మించి నగదు, బంగారం, గిఫ్ట్ వస్తువులు తరలించడానికి వీలు లేదన్నారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉండాలని, లేనిపక్షంలో తనిఖీల సమయంలో ఆధారాలు లేకపోతే సీజ్ చేయడం జరుగుతుందన్నారు. లక్ష రూపాయల వరకు నగదు, 50 వేలకు మించి బంగారం తీసుకువెళ్లే సమయంలో పూర్తి ఆధారాలుండాలన్నారు. తనిఖీల సమయంలో రూ.10 లక్షలకు పైగా ఉంటే ఆదాయపు పన్ను వారికి అప్పగించడం జరుగుతుందని, అంతలోపు పట్టుబడితే జిల్లా ఎన్నికల అధికారి వారికి అప్పగించడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు సభల నిర్వహణకు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. మైక్, ఇతర లౌడ్ స్పీకర్లను ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల లోపు మాత్రమే అనుమతితో వినియోగించాలని, ఎట్టి పరిస్థిల్లో ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థల ప్రాంతాల్లో వినియోగించరాదన్నారు. జిల్లాలో ప్రైవేటు బ్యాంకు వాహనాలను కూడా తనిఖీ చేయడం జరుగుతుందని, వాటిలో నగదు సరఫరాకు సంబంధించి సరైన ఆధారాలు చూపించకపోతే ఎన్నికల నిబంధనల మేరకు కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఒక్క పోలింగ్ కేంద్రంలో కూడా రీపోలింగ్‌కు అవకాశంలేని రీతిలో ఎన్నికల సిబ్బంది ఒకేతాటిపై పనిచేయాలన్నారు. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగాని ఎన్నికల సమయంలో రాజకీయ పక్షాలకు, అభ్యర్థులకు సహకరించకూడదన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజన తమ పరిధిలోని గ్రామాలను సంబంధిత పోలీస్ సిబ్బంది పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్వో ఎన్ సత్యనారాయణ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, అదనపు ఎస్పీ ఈశ్వరరావు, ఐటిడిఎ ఎపిఓ హరీంద్రప్రసాద్, జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, డీఎస్పీలు, ఇతర నోడల్ అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.