పశ్చిమగోదావరి

ఎట్టకేలకు గుడాల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 28 : ఎంతోమందికి మనోవేదనను, అంతకుమించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన గుడాల సాయి శ్రీనివాస్ ఎట్టకేలకు పోలీసుల చేత చిక్కాడు. ఇంతకాలంగా పోలీసు విభాగానికి తలనొప్పిగా మారి వారి సామర్ధ్యంపై ప్రశ్నార్ధకాలు లేవనెత్తే స్థాయికి చేరిపోయిన ఈ వ్యవహారం ఎట్టకేలకు శనివారం పరిష్కారమైందనే చెప్పాలి. మొత్తం మీద ఈ కేసులో అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని నవంబర్ మొదటి వారంలోనే అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు సాయి శ్రీనివాస్‌ను శనివారం అరెస్టు చేశారు. ఏది ఏమైనా ఈ పరిణామంతో ప్రధానంగా పోలీసు విభాగం ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. అయితే ఇదంతా దొంగా పోలీసు ఆటలా సాగినట్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ప్రదేశాలను మారుస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినట్లే తెలుస్తోంది. అయినప్పటికీ ఏకంగా తొమ్మిది బృందాల ఆధ్వర్యంలో సాయి శ్రీనివాస్ లక్ష్యంగా చేసిన గాలింపు చర్యలు చివరకు ఫలితాన్ని ఇచ్చాయి. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్ ఈ వివరాలను తెలిపారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే... గత నెల 20వ తేదీన కృపామణి భర్త వెల్దుర్తి నాగ పవన్‌కుమార్ తణుకు పోలీస్‌స్టేషన్‌లో తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత రోజు కృపామణి మృతదేహం పాలకోడేరు పోలీసు స్టేషన్ పరిధిలోని శృంగవృక్షం గ్రామ సమీపంలో కాలువలో కనిపించింది. అనంతర విచారణలో కృపామణి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. అదే నెల 25న ఆమె భర్త పవన్‌కుమార్ తణుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కృపామణి రాసిన సూసైడ్ నోట్‌ను, వీడియో సెల్ఫీని అందజేశారు. దీనిలో కృపామణి తల్లి రావూరి లక్ష్మి, తండ్రి రావూరి రామలింగేశ్వరరావు, తమ్ముడు రాజ్‌కుమార్‌లు ఆమెను వ్యభిచారం చేయాలని బలవంతపెట్టినట్లు గుడాల సాయి శ్రీనివాస్ వద్దకు పంపినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. సాయి శ్రీనివాస్ పెట్టిన ఇబ్బందులను కూడా తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొంది. ఈ సమాచారం వెలుగు చూడటంతో కృపామణి ఆత్మహత్య ఉదంతం రాష్టస్థ్రాయిలోనే సంచలనానికి కారణమైంది. ఆమె తల్లిదండ్రుల తీరు పట్ల, గుడాల సాయి శ్రీనివాస్ చీకటి వ్యవహారాల పైనా అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రజా సంఘాలు ఉద్యమించాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కూడా వెనువెంటనే స్పందించి బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసు బృందాలు రంగంలోకి దిగి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా విశాఖపట్నంలో గుడాల సాయి శ్రీనివాస్‌కు చెందిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత జంగారెడ్డిగూడెం డి ఎస్‌పి జె వెంకట్రావును ఈ కేసుకు ప్రత్యేకాధికారిగా నియమించారు. ఈ కేసులో సాక్ష్యాల సేకరణ, ఇతర అంశాలను వెంకట్రావు ఆధ్వర్యంలో జరగగా కొవ్వూరు డి ఎస్‌పి ఎన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గాలింపు బృందాలు విస్తృతంగా నిందితుల కోసం గాలించాయి. జంగారెడ్డిగూడెం డి ఎస్‌పి ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం కాగా సెల్ నెంబర్లు, బ్యాంకు అకౌంట్లను పరిశీలించి నిందితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో కృపామణి తల్లి, తండ్రి, తమ్ముడు, మరో మహిళను ఈ నెల 4వ తేదీన అరెస్టు చేయగలిగారు. ఆ తరువాత గుడాల సాయి శ్రీనివాస్ కోసం దాదాపు తొమ్మిది పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, పూణె వంటి ప్రాంతాల్లో గాలింపు చర్యలను చేపట్టారు. ఈ నేపధ్యంలో శనివారం సాయి శ్రీనివాస్ పెరవలి వంతెన వద్ద ఉండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాగా ఇతనిపై పెరవలి పోలీసు స్టేషన్‌లో ఇప్పటికే మూడు కేసులు విచారణలో వున్నాయని ఎస్‌పి తెలిపారు. అంతేకాకుండా అతనిపై రౌడీ షీట్ కూడా కొనసాగుతోందని, ఇదే కాకుండా పలు నేరాల్లో కూడా ఇతనికి సంబంధం వున్నట్లు కనిపిస్తోందన్నారు. కృపామణితోనే కాకుండా మరో ముగ్గురు మహిళలను కూడా బెదిరించి లొంగదీసుకున్నట్లు తెలుస్తోందని, ఈ విషయంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఇక సాయి శ్రీనివాస్‌కు పాస్‌పోర్టు వుందని, అయితే దాని కాలపరిమితి ముగియడంతో అతను ఏలూరు చిరునామా నుంచి దరఖాస్తు చేసుకున్నారని, అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఈ విషయంలోనూ చట్టపరంగా విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు నకిలీ డాక్టరేట్లను కొంతమంది ప్రముఖులకు అందించారన్న ఆరోపణలు కూడా వున్నాయని, ఈవిషయంలోనూ పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో సమర్ధంగా వ్యవహరించిన జంగారెడ్డిగూడెం, కొవ్వూరు డి ఎస్‌పిలు జె వెంకట్రావు, ఎన్ వెంకటేశ్వరరావులను, తణుకు సి ఐ ఆర్ అంకబాబు, సర్కిల్ సిబ్బందిలను ఎస్‌పి అభినందించారు. సమావేశంలో జంగారెడ్డిగూడెం డి ఎస్‌పి జె వెంకట్రావు, ఏలూరు డి ఎస్‌పి కెజివి సరిత తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టుల కదలికపై నిఘా
డిఐజి హరికుమార్
దేవరపల్లి, నవంబర్ 28: మావోయిస్టుల కదలికపై గట్టి నిఘా వేసినట్టు ఏలూరు డిఐజి పి హరికుమార్ తెలిపారు. దేవరపల్లి పోలీసు స్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో బుట్టాయగూడెం, విలీన మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు మండలాల్లో మావోయిస్టుల కదలికపై నిఘా వేసినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరులో మావోయిస్టుల కదలికపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసినట్టు ఆయన చెప్పారు. ముఖ్యంగా చత్తీస్‌గడ్, ఒరిస్సా బోర్డర్‌లో పటిష్ఠంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తమ రేంజ్ పరిధిలో గల నాలుగు జిల్లాల్లో 80 ఎస్సై పోస్టులు, 800 కానిస్టేబుల్స్ ఖాళీలను భర్తీచేయవలసి ఉందని, ప్రభుత్వం నుండి అనుమతి రాగానే భర్తీచేస్తామన్నారు. దేవరపల్లి, కొవ్వూరు స్టేట్ హైవేలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, గుండుగొలను వద్ద ఎక్కువ సామర్థ్యం కలిగిన వాహనాలను రావులపాలెం వైపు మళ్లించేందుకు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కొవ్వూరు వద్ద నిర్మించిన కొత్త వంతెన నుండి 24 గంటలూ సుమారు 38వేల వాహనాలు వెళుతున్నట్టు టోల్‌గేట్ రికార్డుల ద్వారా తెలుస్తోందన్నారు. గుండుగొలను, కొవ్వూరు మధ్యగల రహదారిని నాలుగులైన్లుగా విస్తరింపజేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. నకిలీ కరన్సీ మార్పిడిపై నిఘా ఉంచినట్టు డిఐజి తెలిపారు. ఈ విషయంపై ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలను రహస్యంగా ఉంచుతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. కొవ్వూరు సిఐ ఎం సుబ్బారావు, ఎస్సై సిహెచ్ ఆంజనేయులు, కొవ్వూరు రూరల్ ఎస్సై సోంసుందరంలకు పరిపాలనాంశాలపై పలు సూచనలు చేశారు. స్టేషన్ రికార్డులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఫార్మశీతోనే మానవ మనుగడ
* నవీన ఆవిష్కరణలు జరగాల్సిందే* విష్ణులో ప్రారంభమైన ఇండో జర్మన్ అంతర్జాతీయ సదస్సు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 28: ఫార్మశీ రంగంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మెటిక్స్, మ్యాగ్నటిక్ నానోపార్టికల్స్ గ్రూఫ్ రీసెర్చ్ అసోసియేట్, అకడమిక్ స్ట్ఫా డాక్టర్ విడ్నర్ ఆండ్రియాస్ పేర్కొన్నారు. ప్రపంచం యావత్తూ ఈ రంగంలో నవీన ఆవిష్కరణల కోసం ఎదురు చూస్తోందన్నారు. శనివారం స్థానిక విష్ణు ఫార్మశీ కళాశాలలో కరెంట్ సినారియో అండ్ ఫ్యూచర్ ఫైండింగ్స్ ఇన్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ అనే అంశంపై ఇండో-జర్మన్ దేశాలు సంయుక్తంగా అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు భారతదేశంతోపాటు ఇతర దేశాలకు చెందిన ఫార్మశీ రంగ నిపుణులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విడ్నర్ ఆండ్రియాస్ మాట్లాడుతూ ఫార్మశీ రంగం కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. ప్రస్తుతం ప్రోటీన్ కరోనా అరౌండ్ మ్యాగ్నటిక్ నానోపార్టికల్స్ తయారీ గురించి విశే్లషించారు. ఇటువంటి పార్టికల్స్ వల్ల ఎంతో ఉపయోగం ఉందన్నారు. ఫార్మశీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఆది నుండే అన్నింటిపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. సమయాన్ని వృథా చేయకుండా పరిశోధనలపై దృష్టిసారిస్తే ప్రపంచ మానవాళికి మేలుచేసిన వారమవుతామన్నారు. పరిశోధనలో విజయం సాధించడానికి ఎన్నో ఏళ్ల సమయం పడుతుందని, అందుకోసం ఫార్మశీ విద్యను చదువుతున్న విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ ఎంవి నాగభూషణం మాట్లాడుతూ ఫార్మశీ రంగానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, జీయోగ్రాఫికల్ ఐడిఫికేషన్ తదితర అంశాల గురించి వివరించారు. ఫార్మశీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సురేష్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రసాద్, ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బసవరాజు, అడ్మిన్ కె ప్రసాద్‌రాజు తదితరులు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన ఫార్మశీ నిపుణులకు మెమోంటోలను అందజేశారు.
ఇంత కాలయాపనా!
సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనపై అధికారులను ప్రశ్నించిన కలెక్టర్ భాస్కర్
ఏలూరు, నవంబర్ 28 : జిల్లాలో ఏడేళ్ల నుంచి సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనకే కాలయాపన చేస్తుంటే ఎప్పటికి పూర్తవుతాయని, ఇలా అయితే రైతులు ఎప్పటికి సమృద్ధిగా సేద్యపునీరు ఇవ్వగలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిని అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని, అలా కాకుండా ప్రతీ విషయానికి కాలయాపన చేస్తూ పోతే మరో దశాబ్ధి అయినా సేద్యపునీరు ప్రాజెక్టులు పూర్తి కావని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలు త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సేకరించిన భూములకు చెల్లింపులు చేసి ఆ భూములను సంబంధిత ఏజెన్సీలకు అప్పగించాలని ఆదేశించారు. భూమి లెవెలింగ్, నిర్వాసితులకు పునరావాసానికి సంబంధించి ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, భూమికి భూమి ఇచ్చే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని ముంపు గ్రామాలకు సంబంధించి భూమి వివరాలు, ఎంత మేర భూమి సేకరించాల్సి వుంది, ఏ ప్రాంతంలో సేకరించాలి తదితర వివరాలను అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ డి సుదర్శనం, జంగారెడ్డిగూడెం ఆర్‌డివో లవన్న, వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి, ఉద్యానవన శాఖ డిడిలు విజయలక్ష్మి, దుర్గేష్, భూగర్భజల శాఖ డిడి రంగారావు, ట్రాన్స్‌కో ఎస్ ఇ సిహెచ్ సూర్యనారాయణరెడ్డి, డి ఎఫ్‌వో పి ఎస్ శాస్ర్తీ, సర్వే శాఖ ఎడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు
ఏలూరు ఎంపి మాగంటి బాబు
ఏలూరు, నవంబర్ 28: పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారం కోసం తగుచర్యలు తీసుకున్నామని, రైతుకు గిట్టుబాటు ధర లభించేలా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలతో చర్చిస్తామని ఏలూరు ఎంపి మాగంటి బాబు తెలిపారు. స్ధానిక ఎంపి క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం పోలవరం ప్రాంత రైతుల సమస్యలను ఎంపి అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలులో వివక్షత చూపుతున్నారని, పామాయిల్ చెట్టుకు పరిహారం కింద పెదవేగి మండలంలో 6400 రూపాయల ధర నిర్ణయించగా పోలవరం, బుట్టాయిగూడెం, కుకునూరు మండలాల్లో పొలాలు కోల్పోయిన రైతులకు చెట్టుకు కేవలం 3200 రూపాయల ధర మాత్రమే ఇస్తున్నారని, దీన్ని సవరించాలని రైతులు కోరారు. ఈవిషయమై త్వరలో పోలవరం ఎమ్మెల్యేతో కలిసి సిఎం చంద్రబాబును కలిసి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉద్యానపంటల అభివృద్ధికి ప్రత్యేకశ్రద్ద తీసుకుంటున్నామని, అయితే ఒకేరకమైన పంట వేసి గిట్టుబాటు ధర లేక రైతులు బాధపడే బదులు వివిధ పంటలపై దృష్టి కేంద్రీకరించాలని ఎంపి సూచించారు. కార్యక్రమంలో రైతునాయకులు పరిమి రాంబాబు, జడ్పీటీసీలు ఘంటా సుధీర్, పెదబాబు, ఎఎంసి మాజీ ఛైర్మన్ జె ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీల దాడుల్లో బాధితులకు సత్వర న్యాయం
జెసి
కోటేశ్వరరావు
ఏలూరు, నవంబర్ 28 : జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టిలపై జరిగే దాడుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా విజిలెన్స్, మోనటరింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులకు పాల్పడే వారిపై సత్వరం కేసులు నమోదు చేయడంతోపాటు బాధితులకు ప్రభుత్వపరంగా అందాల్సిన న్యాయం, పరిహారం, పునరావాస కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేయాలన్నారు. బాధితులు కోర్టుకు వచ్చే సమయంలో రవాణా ఖర్చులు కూడా అక్కడికక్కడే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 168 కేసులు నమోదు కాగా గతంలో పెండింగ్‌లో వున్న కేసులతో సహా 378 కేసుల్లో 252 కేసులు విచారణ చేయడం జరిగిందన్నారు. మరో 82 కేసులు వాస్తవం కాదని నిర్ధారించారన్నారు. 44 కేసులకు సంబంధించి చార్జిషీటు దాఖలు చేశారని, 291 కేసులు విచారణ దశలో వున్నాయని తెలిపారు. శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు మాట్లాడుతూ నిరాశ, నిస్పృహలతో వున్న పేద వారిని ఆదుకునే సామాజిక బాధ్యత ప్రతీ ఒక్కరిపై వుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన బాలబాలికలను విధిగా చదివించాలన్నారు. జిల్లాలో కోడిపందాలు, మద్యం జోలికి ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన వారు దృష్టి పెట్టకుండా ఉండేందుకు కృషి చేయాలన్నారు. కమిటీ సభ్యులు నంబూరి బోసు మాట్లాడుతూ పోలీసు కేసు నమోదు కోసం ఫిర్యాదు చేసే సమయంలోనే సాధ్యమైనంత వరకు ఫిర్యాదుదారుని కుల ధృవీకరణ పత్రం అందజేస్తే కేసు సత్వర విచారణకు వీలుంటుందన్నారు. విద్యాహక్కు చట్ట ప్రకారం కార్పొరేట్ పాఠశాలలో 25 శాతం ఎస్‌సి, ఎస్‌టిలకు ఉచితంగా ప్రవేశం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు నేతల రమేష్‌బాబు మాట్లాడుతూ నగర పాలక పరిధిలోని ఎస్‌సిలకు నిబంధనల ప్రకారం కేటాయించిన షాపుల వేలంలో గుడ్‌విల్ ఇవ్వాలని లేవనెత్తిన అంశంపై జెసి స్పందిస్తూ ఈ విషయంపై అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి తక్షణమే పంపాలని అధికారులను ఆదేశించారు. కమిటీ సభ్యులు పొలిమేర హరికృష్ణ మాట్లాడుతూ జిల్లాలో క్రైం రేటు తగ్గినప్పటికీ అత్యాచారాలు, హత్యలు నియంత్రించే విషయంలో మరింత నిఘా పెంచాలని కోరారు. కమిటీ సభ్యులు బురదగుంట క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టిలకు సంబంధించి అడ్వకేట్స్ ప్యానల్, నాన్ అడ్వైజరీ అఫీషియల్ కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ఎస్‌పి భాస్కర్‌భూషణ్, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మీదేవి, ఐటిడి ఎ పివో సూర్యనారాయణ, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఝాన్సీరాణి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు, జంగారెడ్డిగూడెం ఆర్‌డివో లవన్న, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి శేషయ్య, డి ఎస్‌పిలు తదితరులు పాల్గొన్నారు.
వెయిట్‌లిఫ్టింగ్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
ఏలూరు, నవంబర్ 28: జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెయిట్‌లిఫ్టింగ్‌లో క్రీడాకారులు అందించిన ఘనత పశ్చిమగోదావరి జిల్లాకు దక్కుతుందని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తెలిపారు. స్థానిక ఇండోర్‌స్టేడియం వెయిట్‌లిఫ్టింగ్ హాలులో రెండ్రోజులపాటు నిర్వహించే బడేటి శ్రీహరిరావు, జయరాఘవమ్మ మెమోరియల్ అంతర్‌జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయిట్‌లిఫ్టింగ్‌లో జిల్లా ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. ఎంతోమందికి శిక్షణను ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు ప్రోత్సాహం అందించడంలో బడేటి కుటుంబం కృషి అభినందనీయమన్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌ను మరింత ప్రోత్సహించి క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు తన సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) మాట్లాడుతూ ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియాన్ని రూ.7 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ప్రముఖ వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి వంటి వారు ఏలూరులో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి ఎదగడం జిల్లాకు గర్వకారణమన్నారు. గత 30 సంవత్సరాల నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో ఎంతో మందికి శిక్షణ అందించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఏలూరునకు దక్కుతుందన్నారు. ప్రముఖ నేత్ర వైద్యులు నాదెళ్ల విష్ణువర్ధనరావు మాట్లాడుతూ వెయిట్‌లిఫ్టింగ్‌కు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తే ఈ క్రీడాంశాన్ని అందరికీ తెలిసేలా చేయవచ్చునన్నారు. తద్వారా వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులను ప్రోత్సహించవచ్చునన్నారు. రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె సూర్యనారాయణ మాట్లాడుతూ బడేటి శ్రీహరిరావు, జయ రాఘవమ్మ మెమోరియల్ రెండవ అంతర్‌జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ పోటీలను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నామని, ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 270 మంది వెయిట్ లిఫ్టర్లు పాల్గొంటున్నారన్నారు. 2017 కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు విశాఖపట్నంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు. తొలుత బడేటి శ్రీహరిరావు, జయరాఘవమ్మ చిత్రపటాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెయిట్‌లిఫ్టింగ్ పోటీలను ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య, కార్పొరేటర్లు కిరణ్‌కుమార్, పి పార్ధసారధి, డి ఎస్‌డివో వి శ్రీనివాసరావు, వెయిట్ లిఫ్టింగ్ సీనియర్ కోచ్ అమర్‌నాధ్, వెయిట్‌లిఫ్టింగ్ పితామహులు ఆర్ సూర్యనారాయణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దేవినేనిని క లిసిన ఎమ్మెల్యే బండారు
నరసాపురం, నవంబర్ 28: నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలో ఇరిగేషన్ కెనాల్స్, డ్రైయిన్ అభివృద్ధికి రూ.87.17 కోట్ల అంచనాలతో సిద్ధం చేసిన ప్రతిపాదనలను మంత్రికి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గం శివారు ప్రాంతం కావడం వల్ల కాలువల ద్వారా నీరు ప్రవహించడానికి అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయని, వాటి అభివృద్ధికి ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. ముఖ్యంగా నల్లిక్రేకు, కోనయ్య కోడు డ్రైయిన్, కాళీపట్నం కెనాల్, నరసాపురం కెనాల్ పటిష్టతకు అవసరమయ్యే కల్వర్టులు, రైటినింగ్ వాల్స్ నిర్మాణానికి సంబంధించి రూ.87.17 కోట్ల ప్రతిపాదనలు అందించారు. వీటిని మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే మాధవనాయుడు విలేఖర్లకు తెలిపారు.
ఘనంగా లక్ష తమలపాకుల పూజ
జంగారెడ్డిగూడెం, నవంబర్ 28: కార్తీకమాసం మూడో శనివారం స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకం, లక్ష తమలపాకుల పూజ ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. నాగవల్లీ దళాలతో అష్టోత్తర పూజలు, దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, అనంతరం లక్ష తమలపాకుల పూజ ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు, ఋత్విగ్గణ విధ్వన్మండలి ఖండవల్లి సూర్యనారాయణాచార్యులు శిష్య బృందం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెంకు చెందిన బోయినపల్లి రమేష్, శిరీష దంపతులు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పూజా కార్యక్రమాలను, భక్తుల ఏర్పాట్లను దేవస్థానం ఇవో పెనె్మత్స విశ్వనాధరాజు (శివ) పర్యవేక్షించారు. శనివారం ఆలయానికి రూ.2,77,856 ఆదాయం లభించినట్టు ఇఒ తెలిపారు.
అన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం
పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వామిశెట్టి కృష్ణారావు, దుర్గమ్మ దంపతులు, వారి కుమారులు వామిశెట్టి హరిబాబు, నాగేంద్ర కుమార్, పూర్ణచంద్రశేఖర్ శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళాన్ని శనివారం దేవస్థానం ఇఒ విశ్వనాధరాజుకు అందజేశారు.
కిటకిటలాడిన శ్రీవారి ఆలయం
ద్వారకాతిరుమల, నవంబర్ 28: చిన వెంకన్న ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. కార్తీకమాసం కావడంతో పాటు స్వామివారికి ఇష్టమైన రోజు కావడం వల్ల భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి యాత్రికులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. స్వామివారి వద్ద దీపారాధనలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. శనివారం తెల్లవారుజామున శ్రీవారిని, అమ్మవార్లను పలువురు భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ కేశఖండన శాల, టిక్కెట్టు, ప్రసాదాల కౌంటర్ల వద్ద యాత్రికులు బారులు తీరారు. సుమారు 15 వేల మందికి పైబడి భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ ఇఒ వేండ్ర త్రినాధరావు తెలిపారు.
విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి:ఎమ్మెల్యే వేటుకూరి
ఉండి, నవంబర్ 28: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అన్నారు. శనివారం ఉండి లయన్స్ కల్యాణ మండపంలో సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలో మనబడి-మన బాధ్యత అనే అంశంపై జరిగిన సదస్సుకు ప్రాజెక్టు అధికారి వి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివరామారాజు మాట్లాడుతూ పాఠశాలలో అవసరాలు తీర్చేందుకు తన వంతు సహాకారం అందిస్తామన్నారు. పిఒ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో కరెంటు బిల్లులు, చిన్న అవసరాల కోసం వారంలో నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎ మానిటరింగ్ అధికారి కృష్ణారావు, మండల పరిషత్ అధ్యక్షురాలు డలియా లక్ష్మి, జడ్పీటీసీ కరిమెరక వెంకట సత్యతులసి, వైస్ ఎంపిపి మంతెన కృష్ణకుమారి, సర్పంచ్ ముదునూరి విజయ, ఎంపిటిసిలు కాగిత సత్యనారాయణ, ఎఎంసి ఛైర్మన్ కె గోపాలకృష్ణంరాజు, మండల విద్యాశాఖాధికారి ఎం సూర్యనారాణణమూర్తి తదితరులు పాల్గొన్నారు.