పశ్చిమగోదావరి

త్వరితగతిన పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, జూలై 5: మహా సంకల్ప బలంతో పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. దేవరపల్లిలో మంగళవారం సాయంత్రం పోలవరం కుడి కాలువ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. ఇప్పటి వరకూ రూ.1600 కోట్లు ఖర్చుచేసినట్టు తెలిపారు. కేంద్రం నుండి ప్రాజెక్టు పనులకు అధిక నిధులు తీసుకురావడానికి సిఎం కృషిచేస్తున్నారన్నారు. సిఎం సంకల్ప బలమే కొండంత అండగా ఉందన్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, కృష్ణా డెల్టా రైతులను ఆదుకునేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 8వేల క్యూసెక్కుల గోదావరి జలాలను కృష్ణానదికి విడుదల చేస్తున్నామన్నారు. మరో వారం రోజుల్లో ఈ నీరు కృష్ణా పరీవాహక ప్రాంత రైతులకు చేరగలదనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. కృష్ణానది నీరు కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతంలోకి వచ్చేసరికి అనేక విద్యుత్ ప్రాజెక్టులు దాటి రావలసి వస్తుందని, ఆ నీటిలో పోషక పదార్థాలు అంతగా ఉండవన్నారు. గోదావరి నీరు అనేక కొండలు, పోషక మొక్కలను దాటి రావడం వల్ల ఆ నీటిలో పోషక పదార్థాలు, ఎరువులకు సంబంధించిన మూలకాలు ఉంటాయని, ఆ నీరు కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతానికి రావడం వల్ల వ్యవసాయ పంటల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. గోదావరి వరద జలాలను మాత్రమే తాము కృష్ణా నదికి మళ్లిస్తున్నామని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. పట్టిసం ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగమేమీ ఉండదని ప్రతిపక్షాలు గొంతెత్తి రచ్చచేస్తున్నా తాము ఖాతరు చేయమన్నారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో 11 లక్షల ఎకరాల్లో సార్వా పంటకు నీరందిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ఈయన వెంట టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొయ్యలమూడి చినబాబు, స్థానిక రైతు నేతలు కొండపల్లి దొరయ్య, యాగంటి బుల్లెబ్బాయి, కాంట్రాక్టర్ పరిమి రాంబాబు తదితరులు ఉన్నారు.

పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు

గోపాలపురం, జూలై 5: పోలవరం కుడి కాలువ నీటి ముంపు కారణంగా గతేడాది పంటలను నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు ప్రస్తుతం జరుగుతున్న కాలువ పనులను మంగళవారం అడ్డుకున్నారు. గోపాలపురం శివార్లలో 19.8 కిలోమీటర్ల వద్ద పోలవరం కుడి కాలువకు అండర్ టెన్నల్ నిర్మించవలసి ఉంది. అక్కడ నిర్మాణం చేపట్టకుండానే గతేడాది నీటిని కాలువలోనికి విడిచిపెట్టడంతో కాలువకు కుడివైపున ఉన్న సుమారు 65 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. అప్పట్లో దీనిపై రైతులు ఆందోళన చేస్తే నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. ఆ ప్రదేశంలో ఇసుక బస్తాలు వేసి పంట పొలాల్లోకి నీరు వెళ్లకుండా నిలువరించారు. ప్రస్తుతం ఈ ఏడాది అదే ప్రదేశంలో అండర్ టెన్నాల్ నిర్మించకుండా చేస్తున్న మట్టి పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లిస్తేనే కానీ పనులు జరగనిచ్చేది లేదని భీష్మించారు. సంఘటనా స్థలానికి ఇరిగేషన్ ఇఇ దేవ ప్రకాష్, డిఇ శ్రీనివాసరెడ్డి, ఎఇ కోటేశ్వరరావు చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినకపోవడంతో సమస్యను ఫోను ద్వారా ఎస్‌ఇ శ్రీమన్నారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి పది రోజుల్లో నష్టపరిహారం అందజేస్తామని ఇరిగేషన్ అధికారుల ద్వారా రైతులకు తెలియజేశారు. అయినప్పటికీ రైతులు మొండి పట్టుబట్టడంతో చేసేది లేక అధికారులు వెనుతిరిగారు. కార్యక్రమంలో రైతులు కుందుల నారాయణరావు, పోతుల రత్నారెడ్డి, వింతా రమణయ్య, కర్లపూడి సత్యనారాయణ తదితర రైతులు పాల్గొన్నారు.

కాపులు, బిసిలను మోసగిస్తున్న చంద్రబాబు

వీరవాసరం, జూలై 5: కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరి పేరును పంపించాలని ప్రధాని మోదీ అవకాశం ఇస్తే చంద్రబాబునాయుడు వద్దని తిరస్కరించడం దారుణమని గౌడశెట్టిబలిజ సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరవల్లి రామకృష్ణ విమర్శించారు. మంగళవారం వీరవాసరంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. గత కొంతకాలం నుండి చంద్రబాబు రెండుకళ్లు, రెండు మతాలు, రెండు వర్గాలు, రెండు కుటుంబాల సిద్ధాంతాలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని కాపులను, బిసిలను రెండు విభిన్న ధృవాలుగా చిత్రిస్తున్నారన్నారు. కాపులకు కేటాఇస్తే బిసిలు సహించరు, బిసిలకు కేటాయిస్తే కాపులు ఒప్పుకోరనే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఏర్పడేలా చంద్రబాబు తయారుచేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్ర మంత్రి పదవిని రెండువర్గాలకు చెందిన ఎంపిలకు దక్కకుండా చేసి, అటు కాపుకులానికి, ఇటు బిసివర్గాలకు చెందిన ఎంపిలకు ఒకేసారి వెన్నుపోటు పొడిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో పదవి పొందే అర్హతలు ఉన్న కాపు, బిసి ఎంపిలందర్నీ తాకట్టుపెట్టి పదవి వద్దని, నిధులు ఇమ్మని సిఎం చంద్రబాబు కోరడం దారుణమన్నారు. టిడిపిలో కాపు, బిసి వర్గాలను తన వ్యాపార అవసరాలకు కుదువపెట్టే వస్తువు(బంగారం)లా చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో కాపు, బిసి సామాజిక వర్గాలవారు కళ్లు తెరిచి చంద్రబాబు కుట్ర రాజకీయాలకు చెక్ పెట్టడానికి సిద్ధం కావాలని వీరవల్లి పిలుపునిచ్చారు.