వరంగల్

బిల్ట్ కార్మికుల 24 గంటల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, మే 10: రెండేళ్ళుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్న బిల్ట్ కార్మికులు యాజమాన్యం మొండి వైఖరి, పట్టించుకోని కార్మిక శాఖ అధికారుల తీరు, ప్రభుత్వ ఉదాసీనతను నిరసిస్తూ బుధవారం 6 గంటలకు బిల్ట్ టైం ఆఫీస్ వద్ద 24 గంటల ధర్నా కార్యక్రమం చేపట్టారు. బుధవారం ఉదయం 6 గంటలకు బిల్ట్ టైం ఆఫీస్ వద్దకు చేరుకున్న బిల్ట్ కార్మికులు, కార్మిక నాయకులు టైం ఆఫీస్ సమీపంలో మండుటెండను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా రోడ్డుపై బైటాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. యాజమాన్యం మొండి వైఖరి వీడనాడాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని, కర్మాగారంలో పునరుత్పత్తి చర్యలు ప్రారంభించాలని నినాదాలిచ్చారు. బిల్ట్ కార్మిక సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదంటూ కార్మిక శాఖ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ 2014 ఏప్రిల్ 5వ తేది సి షిఫ్టు నుండి కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేసిన యాజమాన్యం గత రెండేళ్ళుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. యాజమాన్యం కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడమే కాక దీర్ఘకాలిక ఒప్పందంలో కుదుర్చుకున్న అనేక ఒప్పందాలను, కార్మిక సంక్షేమ పథకాలను విస్మరించడం, కార్మిక చట్టాలకు తూట్లు పొడవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
కార్మిక శాఖ తీరుపై విమర్శలు
బిల్ట్ యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తున్నా, కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నా కార్మిక శాఖ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. కార్మిక సంక్షేమ కార్యక్రమాలను, కార్మిక చట్టాలను యాజమాన్యం సక్రమంగా అమలు చేస్తుందా లేదా అని క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన కార్మిక శాఖ అధికారులు కర్మాగారంలోకి వచ్చి కార్మికులను కలిసి వారి సమస్యలను వినకుండా కేవలం అతిధి గృహాలకు చేరుకుని అక్కడ సకల మర్యాదలు పొంది వెళ్ళిపోతున్నారని దాంతో యాజమాన్యం కార్మిక చట్టాలను తన చుట్టాలుగా మార్చుకుంటుందని ఆరోపించారు. అర్ధ సంవత్సరంగా యాజమాన్యం కార్మికుల భవిష్య నిధి జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా కార్మిక శాఖ అధికారులు యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటేనే కార్మిక శాఖ అధికారులు ఎవరికి వత్తాసు పలుకుతున్నారో అర్ధమవుతుందని విమర్శించారు. యాజమాన్యం రెండేళ్ళుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా అనారోగ్యం సోకితే చికిత్స చేయించుకునే స్థోమత కూడా ఉండడంలేదని, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేకపోవడంతో ఇప్పటికే కొంతమంది కార్మికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.బిల్ట్ కార్మికుల విషయంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందించడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కర్మాగార మనుగడ కోసం రాయితీలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ రాయితీలను అందిపుచ్చుకుని కర్మాగారాన్ని నడిపించేలా యాజమాన్యంపై వత్తిడి తేవడంలో విఫలమయిందని కార్మికులు విమర్శిస్తున్నారు. కార్మికులకు తక్షణం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం యాజమాన్యంకు ఆదేశాలివ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం బిల్ట్ ఉన్నత స్థాయి యాజమాన్యంతో చర్చించి కర్మాగారంను నడిపించేలా చర్యలు తీసుకోవాలని, మిల్లును యాజమాన్యం నడిపించే స్థితిలో లేకుంటే ప్రభుత్వం కర్మాగారంను స్వాధీనం చేసుకుని కర్మాగారంను నడిపించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు వడ్డెబోయిన శ్రీనివాసులు, వడ్లూరి రాంచందర్, చాతరాజు చొక్కారావు, పాకనాటి వెంకటరెడ్డి, పుసులూరి గణపతి, ఎస్కే.ఖుర్బాన్ ఆలీ, డివిపి రాజు, వింజమూరి రవి, వివిఎస్‌ఆర్ శర్మ, వంగేటి వెంకట రెడ్డి, మేడా లక్ష్మీనారాయణ, పప్పు వెంకట రెడ్డి, కొడాలి మల్లేశ్వరరావు, మునిగాల వెంకటేశ్వర్లు, పులిగిల్ల శ్రీను, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.