వరంగల్

‘పాఖాల’తో పంటలు సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లె ప్రగతిలో పెద్ది హామీ * అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ హాళ్లకు నిధులు
* పంచాయతీల ఏర్పాటుతోనే తండాల అభివృద్ధి * మహిళలకు కుటీర పరిశ్రమలు

ఖానాపురం, జనవరి 3: దేవాదుల నుండి గోదావరి జలాలను పాఖాల చెరువులోకి మళ్లించి ఖానాపురం మండలంలోని ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని నాజీతండా, వేపచెట్టు తండా, రేవతండా, భద్రుత్రండా, కోడ్తి మాటుతండా, మంగళవారిపేట, బుధరావుపేట, మనుబోతుల గడ్డ గ్రామాల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో పెద్ది మాట్లాడారు. గోదావరి జలాలను పాఖాల చెరువులోకి మళ్లించే క్రమంలో ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు వందల పైచీలుకు కోట్ల రూపాయలను మంజూరు చేయించానని, త్వరలోనే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వంద లీటర్ల సురక్షిత మంచినీటిని రాబోయే ఐదు నెలల కాలంలో అందించనున్నట్లు చెప్పారు. ఓ వైపు సాగు, మరో వైపు తాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. పల్లె ప్రగతి సందర్భంగా గుర్తించిన పనులకు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు తగిన నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొడ్డి మాటుతండాను నూతన పంచాయతీగా ఏర్పాటు చేస్తామని, ఇదే సమయంలో బీటీ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. వంద రకాల కుటీర పరిశ్రమలను నియోజకవర్గానికి తీసుకవచ్చామని, మహిళలు కుటీర పరిశ్రమలవైపు దృష్టి సారించి, ఆర్ధిక స్వావలంభన సాధించాలని కోరారు. మంగళవారిపేట గ్రామం ఏజెన్సీలో ఉందని, ఈ క్రమంలో ఇక్కడ పంట భూములను సాగు చేసుకుంటున్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అన్నారు. ఏజెన్సీలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు వచ్చే అవకాశం లేదని, ఇదే సమయంలో వక్ఫ్‌భూములు సైతం ఉన్నాయని, ఈసమస్యను రాబోయే మూడేళ్ల కాలంలో పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు కుంచారపు వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
తరలివచ్చిన గులాబీ దండు
ఖానాపురం మండలంలోని మంగళవారిపేట, బుధరావుపేట, మనుబోతుల గడ్డ గ్రామాలతో పాటు శివారు తండాలలో బుధవారం పెద్ది సుదర్శన్‌రెడ్డి చేపట్టిన పల్లె ప్రగతికి గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మంగళవారం రాత్రే మంగళవారిపేట శివారు నాజీతండాలో పెద్ది బస చేశారు. బుధవారం ఉదయమే కాలినడకన తండాలో ఇంటి ఇంటికి, వీధి వీధికి పెద్ది పర్యటించి సంక్షేమ పథకాల లబ్ది గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో స్థానిక సమస్యలను అడిగారు. ఆయా గ్రామాలు, తండాలలో గులాబీ శ్రేణులతో పాటు గ్రామస్థులు బతుకమ్మలు, బోనాలతో పెద్దికి ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలతో భారీ ర్యాలీలు చేపట్టారు. తొలుత ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్ జెండాలను పెద్ది ఆవిష్కరించారు. పెద్దికి కుల, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. బుధరావుపేటలో గొల్ల కురుమలు గొర్రె పిల్లను బహూకరించారు.

ప్రజా సేవలో తరిస్తా

* స్పీకర్ సిరికొండ

రేగొండ, జనవరి 3: పల్లెల ప్రగతికి తాను కట్టుబడి ఉంటానని తన శేష జీవితాన్ని ప్రజలకే అంకితం చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బుధవారం చిట్యాల మండలంలో స్పీకర్ పర్యాటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నైన్‌పాక గ్రామంలో నాపాక దేవాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శంచారు. తిరుమలపూర్ గ్రామంలో ఇటివలే ఏర్పాటు చేసిన ఐమాక్స్ బల్బులను స్పీకర్ ప్రారంభించారు. ఈసందర్భంగా స్పీకర్ మట్లాడుతూ గత 70 సంవత్సరాల కాలంలో ఎ నాయకుడు చేయాని అభివృద్ధిని మూడున్నర సంవత్సరాల్లో చేశానని చెప్పారు. గత పాలకులు వారి పాలనలో గ్రామాలను అభివృద్ధికి అమడ దూరంలో నిలిపారని స్పీకర్ విమర్శించారు. మొగుళ్లపల్లినుండి చిట్యాల మీదుగా జడల్‌పేట వరక రూపాయలు 25 కోట్లతో డబుల్‌రోడ్డు నిర్మాణం పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు స్పీకర్ తెలిపారు. నిరుపేదలకు వేయి డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇచ్చిన తర్వతనే తాను ఇళ్లు గతంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమాన్ని చేపట్టానని స్పష్టం చేశారు. అనంతరం చల్లాగరిగ గ్రామంలోని యాదవ సంఘం కమ్యూనిటీ హాల్లో స్పీకర్ పల్లె నిద్ర గావించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచ్ పూల్లూరి రమాదేవి, టి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రాజయ్య, రవీందర్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
104 వైద్యసేవలను
సద్వినియోగం చేసుకోవాలి
* త్వరలో హెల్త్ వెల్‌నెస్ క్లినిక్‌లు ప్రారంభం
సంగెం, జనవరి 3: ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 104 వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపవైద్యాధికారిణి డాక్టర్ అనురాధ అన్నారు. కొంతకాలంగా నిలిచిపోయిన 104 వైద్యసేవలను ప్రభుత్వం పునరుద్ధరించడంతో బుధవారం సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో 104 వైద్యసేవలను అమె తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఈ వైద్యసేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వారి గ్రామాలలోనే ఉచిత వైద్యసేవలు అందించి మందులు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని తొమ్మిది గ్రామాలలో హెల్త్ సబ్ సెంటర్లలో హెల్త్ వెల్‌నెస్ క్లీనిక్‌లను త్వరలో ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుధీర్, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
మేడారానికి బస్సు సర్వీసులు నడపాలి
నర్సంపేట, జనవరి 3: ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు గత పదిహేను రోజుల నుండి భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారని, అయితే మేడారంకు బస్సు సర్వీసులు నడపకపోవడంతో భక్త జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి తౌటిరెడ్డి క్రిష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. మేడారంకు నర్సంపేట బస్టాండ్ నుండే కాకుండా ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులను తక్షణమే నడపాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రోజు లక్ష పైచీలుకు భక్తులు ఇప్పటికే మేడారంలోని వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో ప్రైవేట్ వాహనాల యజమానులు అధిక చార్జీలను వసూలు చేస్తున్నారని, ఇదే సమయంలో భక్తులకు భద్రత లేకుండా పోయిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మేడారం జాతరకు వెంటనే ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి ప్రత్యేక బస్సులను నడపాలని కోరారు.
హరితహారం, పారిశుద్ధ్యం తీరుపై
ఢిల్లీ ప్రత్యేక బృందం పరిశీలన
పరకాల, జనవరి 3: పరకాల పట్టణంలో హరితహారం అమలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఓడిఎఫ్‌గా పరకాలను ప్రకటించుకున్న నేపథ్యంలో బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం పరకాలకు వచ్చారు. ప్రత్యేక బృందంలోని ఓఎస్‌డి అవదేవ్‌యాదవ్ ఆధ్వర్యంలో అధికారులు మాదారం కాలనీలోని మరుగుదొడ్ల నిర్మాణాలను, పారిశుద్ధ్య అమలును పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాల, సివిల్ కోర్టులో నాటిన మొక్కలను పరిశీలించారు. దిల్లీ నుంచి వచ్చిన బృందంలో ఎంకె జోషి, సుధీర్‌కుమార్‌లు ఉన్నారు. వారి వెంట పరకాల నగర పంచాయతీ కమిషనర్ జోనా, చైర్మన్ మార్త రాజభద్రయ్య, మెప్మా డిఎంసి రేణుక, ఏడిఎంసి వషీదా, గంజి వెంకట్‌రెడ్డి, ఆర్‌పిలు రమ, ప్రేమలత, శానిటరీ జవాన్లు రాజు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆధార్ లొల్లి..!
ఎరువుల కోసం అన్నదాతల తిప్పలు

కేసముద్రం, జనవరి 3: ఎరువుల అమ్మకాలకు ఆధార్‌కార్డు లింక్ నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. జనవరి 1 నుంచి ఆధార్ కార్డు ఆధారంగా రైతులకు ఎరువులు విక్రయించాలని ప్రభుత్వం ఎరువుల డీలర్లకు పీఓఎస్ మిషన్లను అందించింది. అయితే ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించకపోవడంతో రైతులు ఆధార్‌కార్డు లేకుండా ఎరువుల కోసం వచ్చి డీలర్లతో గొడవకు దిగుతున్నారు. రబీ వరిసాగుకు ముమ్మరంగా నాట్లు వేస్తున్న సమయంలో ఎరువుల కోసం రైతులు నేరుగా డీలర్ల వద్దకు వస్తున్నారు. బుధవారం మండలంలోని పలువురు ఎరువుల డీలర్ల వద్దకు రైతులు ఆధార్‌కార్డు లేకుండా ఎరువుల కోసం వచ్చారు. తమకు ఎవరు చెప్పలేదని, తమకు ఆధార్‌కార్డు తేవాలన్న విషయం తెలియదని, డబ్బులిస్తున్నాం.. ఎరువులివ్వండని డీలర్ల వద్ద గోడువెళ్లబోసుకున్నారు. అయితే, తాము ఆధార్‌కార్డు లేనిదే ఎరువులు విక్రయించలేమని కొందరు రైతులను తిరిగి వెనక్కి పంపగా, మరికొందరు ఇతర రైతుల ఆధార్‌కార్డును నమోదు చేసి, వారి వేలి ముద్రలతో ఇతర రైతులకు ఎరువులు ఇవ్వాల్సి వచ్చింది. గ్రామస్థాయిలో.. ఆవాస ప్రాంతాల వారీగా ఆధార్‌లింక్ వ్యవహారంపై ప్రచారం చేస్తే బాగుంటుందనే ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై విస్త్రుత స్థాయిలో ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది.
టాంటాం వేయిస్తాం
కాగా ఎరువుల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఎరువులు ఖరీదు చేయడానికి తప్పకుండా ఆధార్‌కార్డు వెంట తీసుకురావాల్సి ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్ తెలిపారు. ఇప్పటికే పత్రికల ద్వారా, టీవీల ద్వారా ప్రచారం చేయించామని, అలాగే గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో టాంటాం వేయించి విస్త్రుతంగా ప్రచారం చేయించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

సర్వేక్షణ్ యాప్‌తో సమస్యల పరిష్కారం

గుర్తించడంలో యువత ముందుండాలి * కలెక్టర్ అమ్రపాలి పిలుపు
వరంగల్ (కల్చరల్), జనవరి 3: నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలలో భాగస్వాములై వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని, సమస్యలు ఉన్న చోట స్మార్ట్ ఫోన్‌లలో స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సమస్యలను ఫొటోల రూపంలో కార్పొరేషన్ వారికి అందజేసి సమస్యలను పరిష్కరించుకోవడంలో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. బుధవారం వరంగల్ మహానగర సంస్థ ఆరోగ్య విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిట్ నుండి పబ్లిక్ గార్డెన్స్ వరకు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 5కే రన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని 4041 పట్టనాలలో పారిశుద్ధ్య, ప్రజల భాగస్వామ్యం అను అంశంపై స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలను నిర్వహిస్తున్నారని అన్నారు. వరంగల్ మహానగరంలో కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పారిశుద్ధ్య కార్యక్రమాలలో ప్రజలు పూర్తి అవగాహన కల్పించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు యాప్‌ను డౌన్‌లో చేసుకుని సమస్యలను కార్పొరేషన్ దృష్టికి తీసుకొస్తే 24గంటలలోగా సమస్యలను పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. ఈ యాప్ డౌన్‌లోడ్ ద్వారా పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకోవటంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వరంగల్ కార్పొరేషన్‌ను దేశంలోనే అత్యుత్తమ ర్యాంకును కైవసం చేసుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా 1969 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా నగర స్వచ్ఛతను తెలియజేయవచ్చునని చెప్పారు. నగరంలోని 432 పాఠశాలలకుగాను 250 పాఠశాలల్లో విద్యార్థులచే స్వచ్ఛత కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, రాబోయే రెండు రోజులలో స్వచ్ఛత కమిటీలను ఏర్పాటు చేస్తామని, శుభ్రతపై పారిశుద్ధ్యం వంటి వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ స్వచ్ఛ సర్వేక్షన్‌లో వరంగల్ మహానగరాన్ని దేశంలోనే అత్యుత్తమ పారిశుద్ధ్య,ప్రజాభాగస్వామ్యంతో మహానగరంగా తీర్చిదిద్దుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. నిట్ నుండి పబ్లిక్ గార్డెన్స్ వరకు జరిగిన 5కే రన్‌లో పాల్గొన్న వారికి నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ఉత్తమ, దితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అదనపు కమీషనర్ నాగేశ్వరరావు, మున్సిపల్ ఆరోగ్య అధికారురి రాజారెడ్డి, లక్ష్మారెడ్డి, లింగమూర్తి, డిఎస్ జగన్, మహానగర సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది, వివిధ విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అనుకున్నదే జరిగింది!
దూకుడు వైఖరి కారణంగానే కలెక్టర్ల ఆకస్మిక బదిలీలు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 3: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పాటుతో 15నెలల కిందట కలెక్టర్లుగా బాధ్యతల చేపట్టిన ముగ్గురు కలెక్టర్ల బదిలీ అందరూ ఊహించిందే. బదిలీ అయిన ముగ్గురిలో జనగామ కలెక్టర్ దేవసేనకు మళ్లీ జగిత్యాల కలెక్టర్‌గా పోస్టింగ్ లభించగా, మిగతా ఇద్దరికీ రాజధానిలో అంతగా ప్రాధాన్యత లేని పోస్టింగులు ఇచ్చారు. వాస్తవానికి జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ కలెక్టర్ల బదిలీ నవంబర్, డిసెంబర్ నెలలోనే జరుగుతాయని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఓడిఎఫ్, భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతోపాటు మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతర కారణంగా కలెక్టర్ల బదిలీలు ఫిబ్రవరి నెలలో ఉండవచ్చని బావించారు. కానీ అకస్మాత్తుగా ఇతర జిల్లాల కలెక్టర్లతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో జనగామ కలెక్టర్‌గా దేవసేన, మహబూబాబాద్ కలెక్టర్‌గా ప్రీతీమీనా, భూపాలపల్లి కలెక్టర్‌గా మురళి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తమదైన శైలిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కానీ వీరి ముక్కుసూటి వైఖరి, వ్యాఖ్యలు ప్రజాప్రతినిధులకు మింగుడుపడని విధంగా మారింది. జనగామ కలెక్టర్ దేవసేన పాలనావ్యవహారాల్లో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలను వేగవంతం చేసేందుకు మొదటినుంచి ప్రయత్నించారు. మహిళల రక్షణ కోసం కార్యక్రమాలు చేపట్టడం, మిషన్ భగీరథ, ఓడిఎఫ్ కార్యక్రమాలతో రాష్టస్థ్రాయిలో మంచిగుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ప్రభుత్వ స్థలం విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలెక్టర్ దేవసేనకు అభిప్రాయబేధాలు ఏర్పడటం రాష్టస్థ్రాయిలో చర్చనీయాంశంగా మారింది. బతుకమ్మకుంట విషయంలో కలెక్టర్ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే, కలెక్టర్ దేవసేన బహిరంగ విమర్శలు చేసుకోవటంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. బతుకమ్మకుంట విషయంలో ఎమ్మెల్యే చర్యలను అన్ని వర్గాలు తప్పుపడుతున్నా, నియమ, నిబంధనలకు విరుద్ధంగా కలెక్టర్ దేవసేన బహిరంగ విమర్శలు చేయటాన్ని ప్రభుత్వ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఈ పరిస్థితులో దేవసేన బదిలీ తప్పదనే అభిప్రాయం అధికార, ఉద్యోగవర్గాల్లో వ్యక్తమయింది. ఇకపోతే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి జిల్లాలోని మూరుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రయత్నించారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవటంతోపాటు తన కూతురు ప్రసవాన్ని ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించటం ద్వారా అందరి మన్ననలు పొందారు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని వర్గాల మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయటంతో వివాదస్పదంగా మారింది. ఇటీవల ఓడిఎఫ్ పనుల విషయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఉద్ధేశించి పరుషంగా మాట్లాడటంతో ఎంపీడీఓలు ఆందోళనకు దిగటం కూడా పరిస్థితి ఆయనకు వ్యతిరేకంగా మారింది. నాలుగు నెలల కిందటే భూపాలపల్లి కలెక్టర్‌ను బదిలీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆ తరవాత పరిస్థితి సద్దుమణిగింది. మేడారం జాతర తరువాత ఆయనకు బదిలీ తప్పదని అధికారవర్గాలలో ప్రచారం ఉండగా ఊహించని విధంగా జాతరకు నాలుగువారాల ముందే బదిలీ జరగటం అధికార వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. కలెక్టర్ మురళి బదిలీ కారణంగా మేడారం జాతర పనుల పర్యవేక్షణ, జాతర నిర్వహణ ఎలా ఉంటుందోనని అటు అధికార వర్గాలు, ఇటు రాజకీయపక్షాలు ఎదురు చూస్తున్నాయి. కాగా మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా బదిలీ కూడా అందరూ ఊహించిందే. పాలనావ్యవహారాల్లో కలెక్టర్ ప్రీతిమీనా ముక్కుసూటిగా, చురుకుగా వ్యవహరిస్తున్నా జిల్లాలోని చాలామంది ప్రజాప్రతినిధులకు ఆమె వ్యవహారశైలి మింగుడుపడని విధంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమకు కనీస సమాచారం ఉండటం లేదని జిల్లా పరిధిలోని కొందరు ప్రజాప్రతినిధులు బహిరంగ వ్యాఖ్యలు చేసారు. దీనికితోడు నాలుగు నెలల కిందట మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలెక్టర్‌తో వ్యవహరించిన తీరు అప్పట్లో రాష్టస్థ్రాయిలో వివాదస్పదమయింది. పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కలెక్టర్లు చురుకుగా వ్యవహరిస్తున్నా, ప్రజాప్రతినిధులను, అధికారులను సమన్వయం చేసుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్నతాధికార వర్గాలు వివిధ సందర్భాలలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ నెలాఖరునాటికి రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమం, ఓడిఎఫ్ కార్యక్రమం ఒక కొలిక్కి వస్తుండటం, మేడారం జాతర ఫిబ్రవరి మూడుతో ముగియనుండటంతో జాతర అనంతరం కలెక్టర్ల బదిలీలు ఖచ్చితంగా జరుగుతాయని అందరూ ఊహిస్తూ వచ్చారు. కానీ రాష్ట్రప్రభుత్వం మంగళవారం భారీఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేసిన సందర్భంలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. మేడారం జాతర జరిగే భూపాలపల్లి జిల్లాకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కర్ణన్‌కు ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించగా, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు ఖమ్మం, యదాధ్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు లోకేష్‌కుమార్, అనితా రామచంద్రన్‌ను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. మరికొద్ది రోజుల్లో మరికొందరు ఐఏఎస్‌ల బదిలీలు కూడా జరుగుతాయనే ప్రచారం జరుగుతుండటంతో అప్పుడు జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు రెగ్యులర్ కలెక్టర్లను నియమించే అవకాశం ఉంది.

గురుకుల వ్యవస్థను
బలోపేతం చేస్తాం
* విద్యతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు
* బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం
* ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
పర్వతగిరి, జనవరి 3: ప్రభుత్వ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని కస్తూర్బా గురుకుల విద్యాలయంలో ఆరోగ్య పరిశుభ్రత కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గత ప్రభుత్వాల పాలనవల్ల విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు. దానిని సరి చేయడానికి ఈ మూడు సంవత్సరాల సమయంలో పలు చర్యలు చేపట్టి విద్యావ్యవస్థలో పలు మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవకముందు 296 గురుకుల పాఠశాలలు ఉండగా, తమ ప్రభుత్వ హయాంలో కొత్తగా 544 గురుకుల పాఠశాలలు నెలకొల్పామని చెప్పారు. సమైఖ్య రాష్ట్రంలో 194 మోడల్‌స్కూళ్లు ఉండగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 475 మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసి ఎనిమిదిలక్షల మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తోందని పేర్కోన్నారు. గతంలో హాస్టల్ విద్యార్ధులకు కొలతల ప్రకారం భోజనం అందించేవారని, కానీ ఇప్పుడు విద్యార్ధులకు కడుపునిండా సన్నబియ్యంతో భోజనం పెడుతున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు దక్కుతుందని తెలిపారు. హాస్టళ్లలో ఉండి చదుకువునే విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని, ముఖ్యంగా బాలికలకు హిమోగ్లోబిన్ తగ్గి అనేక సమస్యలకు గురవుతున్నారని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 15కోట్ల రూపాయల వ్యయంతో ఆరోగ్య పరిశుభ్రత కిట్లు అందచేస్తున్నామని తెలిపారు. తాను కుడా పేదకుటుంబం నుండి వచ్చి పర్వతగిరిలో విద్యాభ్యాసం పూర్తిచేసి ఈ స్థాయికి ఎదిగానని ఉపముఖ్యమంత్రి కడియం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మానవవనరుల అభివృద్ధితోనే మెరుగుపడుతుందని, దానికోసం విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టినట్లు తెలిపారు. తన పర్యటన సందర్భంగా స్కూల్ పరిసరాలను, ఆర్‌ఓ ప్లాంట్‌ను, కిచెన్‌షెడ్‌ను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి సమావేశంలో సోలార్ ఫినిషింగ్, గ్రౌండ్ లెవలింగ్ పనులను తక్షణం పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. పర్వతగిరి మోడల్ స్కూల్‌లో ఆర్వో ప్లాంట్, వేడినీళ్ల సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే ఆరూరు రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల కారణంగా అభివృద్ధికి దూరంగా ఉన్న తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా సమగ్ర అభివృద్ధికి నోచుకుంటోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరిత, వరంగల్ రూరల్ ఆర్డీఓ మహేందర్‌జీ, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జడ్పీటీసి శైలజ, ఎంపీపీ రంగు రజిత, సర్పంచ్ గోనె విజయలక్ష్మీ, ఎంఇఓ ఆజాంమోహినొద్దీన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ యుగేంధర్‌రావు, ఎంపీటీసీలు వేలాద్రి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర సాధనలో మహిళలే కీలకం
* మహిళల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం
* స్పీకర్ మధుసూదనాచారి స్పష్టీకరణ
రేగొండ, జనవరి 3: ప్రత్యేక తెలంగాణ రాష్టస్రాధనలో మహిళలదే ముఖ్యభూమికని రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మహిళా స్ర్తిశక్తి భవనాలను స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎంతో ఆదర్శంగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరవనితలు పుట్టిన దేశం భారతదేశమని, అటువంటి మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పెద్దపీట వేసి వారి అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. మహిళల అభివృద్ధికి ఐకేపీ ద్వారా వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఆడబిడ్డ పుడితే తల్లిదండ్రులకు భారం అవకూడదని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలతో ఆడపడచులను ప్రభుత్వం అదుకుంటోందని పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని వ్యవసాయ రంగంలో ముందుచుతామని హామీ ఇచ్చారు. 24గంటలు నాణ్యమైన కరెంట్, డిబిఎం-38 కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు రెండు పంటలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార భవనానికి ప్రహరీగోడ నిర్మించేందుకు 20లక్షల నిధులు మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. భూపాలపల్లి జిల్లాను ధాన్యాగారంగా తీర్చిదిద్ది అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నానని, ఈ అభివృద్ధిని చూసి ప్రజలు సంబురపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ గోపు భిక్షపతి, ఎంపీపీ ఈర్ల సదానందం, సర్పంచ్ మోడం అదిలక్ష్మి, ఎంపీటీసీ శంకర్, తహశీల్దార్ మల్లయ్య, ఎంపీడీఓ రమేష్, ఎపీఎం డాక్టర్ ఝాన్సీ, ఎపీవో అలీం, మహిళ సమైఖ్య మండల అధ్యక్షురాలు రాధిక తదితరులు పాల్గొన్నారు.
నిట్‌లో ఈ, ఐసీటీ అకాడమీ
* 25 కోట్లతో ఏర్పాటు
నక్కలగుట్ట, జనవరి 3: కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సహకారంతో వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థలో ఈ, ఐసీటీ అకాడమీ ఏర్పాటు చేశారు. బుధవారం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిట్‌లో ఈ అండ్ ఐసీటీ అకాడమీని 25 కోట్లతో ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలోని తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, గోవా, పుదుచ్చేరి రాష్ట్రాలతోపాటు, కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ అండ్ నికోబార్‌లలో ఈ అకాడమీలు ఉన్నాయని, అన్నింటిలో కన్నా వరంగల్ నిట్ అకాడమీ ఇంజనీరింగ్ అద్యాకులకు శిక్షణలు ఇవ్వడంలో ముందజలో ఉందని తెలిపారు. గత రెండు రెండున్నర సంవత్సరాల కాలంలో 170 మంది ఇంజనీరింగ్ అద్యాపకులకు ఎఫ్‌డిపి కింద శిక్షణ తరుగతులను నిర్వహించిందని అన్నారు. నిట్‌లో ప్రారంభించిన ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్‌లను కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించామని, ఇందులో ఏకకాలంలో 250 మంది అద్యాపకులకు శిక్షణ ఇవ్వడానికి సదుపాయాలు ఉన్నాయని వివరించారు. ఈ అకాడమీ నిట్‌కు ఒక కీర్తికీరీటం లాంటిదని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్, అద్యాపకులు ఈ అకాడమీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దొంతి.. అవినీతిపరుడు

దోపిడీదారులు టీఆర్‌ఎస్ నేతలు * టీడీపీ నేత రేవూరి విసుర్లు

నర్సంపేట, జనవరి 3: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అవినీతిపరుడనీ, టీఆర్‌ఎస్ నాయకులు దోపిడీదారులని అంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలక్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేటలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం నల్లబెల్లి, ఖానాపురం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, టీడీపీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈసందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యుడు దొంతి మాధవరెడ్డి అవినీతి, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసింది తెలుగుదేశం పార్టీయేనని, తొమ్మిదిన్నర టీడీపీ పాలనలో తాను ఎమ్మెల్యేగా పనిచేశానని, నాటి అభివృద్ది పనులకు కనీసం మరమ్మతు పనులు కూడా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడం ప్రజలను మభ్యపెట్టే వాగ్ధానాలను చేయడం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులకు అలవాటేనని, శాసనసభ్యుడిగా దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టులు చేస్తూ అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దోచుకతింటుంటే ఆయనతో కుమ్మక్కై టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి బిల్లులు ఇప్పిస్తూ పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు.