వరంగల్

తల్లుల జాతరకు ముస్తాబైన గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, జనవరి 22: ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు తరలి వచ్చే భక్త జనులకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఘన్‌పూర్, చిల్పూర్ మండలాల్లోని మినీ మేడారాలుగా విలసిల్లుతున్న లింగంపల్లి, శ్రీపతిపల్లి, తాటికొండ, ఫత్తేపూర్, ఇప్పగూడెం గ్రామాలు ముస్తాబయ్యాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లుల పండుగగా ఈనెల 31 నుండి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు స్వాగతం పలుకుతున్నారు. జాతరలో అత్యంత ప్రధానమైన మంచినీటి సమస్య లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ప్రతి జాతరలో లక్షల రూపాయలు వెచ్చించి భక్తులకు తాగునీటి సమస్యను లేకుండా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. అంతేకాక జాతరలో విద్యుత్, వీధిలైట్లు, భక్తులు విడిది చేసేందుకు జాతర పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములను చదును చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఐదు గ్రామాల్లో నిర్వహించే జాతరలో అతిపెద్దదైన లింగంపల్లిలో కమిటీతో పాటు వివిధ శాఖల అధికారులు రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారు. 1992లో లింగంపల్లి గ్రామంలో ఏర్పాటైన సమ్మక్క, సారలమ్మ జాతర 12సార్లు పండుగను పూర్తిచేసుకుని 13వ జాతరలో అడుగుపెట్టింది. ప్రతి జాతరకు లక్షల మంది భక్తులు హాజరుకాగా ఈసారి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు కమిటీ చైర్మన్ కొయ్యడ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని ఇప్పగూడెం- కోమటిగూడెం రెండు గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో చింతగట్టు జాతరను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుండి నేటి వరకు భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లతో జాతరను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే, తాటికొండ, పత్తేపూర్ గ్రామాల్లో 2007లో సమ్మక్క, సారలమ్మ జాతరలు ప్రారంభించారు. ప్రతిసారి జాతర అంతంత మాత్రంగానే కొనసాగినప్పటికీ.. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇరు గ్రామాల మధ్యన ఉన్న మల్లన్నగండి రిజర్వాయర్‌గా మారడంతో గోదావరి జలాలు పుష్కలంగా చేరడంతో గత జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రిజర్వాయర్ మత్తడి కింది భాగంలో ఉన్న ఇరు జాతరలకు ఈసారి రెండు లక్షల మంది భక్తులు హాజరుకాగలరని నిర్వాహకులు భావిస్తున్నారు. శ్రీపతిపల్లి - కొండాపూర్ గ్రామాల మధ్యన గుట్టల్లో వెలసిన సమ్మక్క, సారలమ్మలను పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు కొలుస్తూ వచ్చారు. 2005లో జాతరకు ఏర్పాట్లు చేయగా ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి నిర్వహించే జాతరకు అన్ని హంగులు తీర్చిదిద్దడంలో రెండు గ్రామాల ప్రజలు తలమునకలయ్యారు.

టీ మాస్ మహా ర్యాలీ

మహబూబాబాద్, జనవరి 22: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీమాస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ ప్రదర్శన జరిగింది. స్థానిక నెహ్రూ సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ తహశీల్దారు కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా అక్కడ వందలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నా కార్యక్రమంలో టీమాస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు టి.సోమయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇల్లు, ఎక్కడ కూడా ఇప్పటి వరకు జిల్లాలో ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. విభజన చట్టంలో భాగంగా బయ్యారంలో ఏర్పాటు చేస్తామన్న ఉక్కుపరిశ్రమ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పోడు రైతులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందన్నారు. మిషన్ భగీరథ పేరుతో ప్రభుత్వ ధనం వృథా చేస్తున్నారన్నారు. రాష్ట్రం వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి తన ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు తెచ్చుకున్నారని విమర్శించారు. రైతురాజ్యం అని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు బేడీలు వేయించిన ఘనత సిఎంకే దక్కుతుందన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి వివిధ సమస్యలపై జేసీ దామోదర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాలతోపాటు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాములు, సాదుల శ్రీనివాస్, సూర్నపు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు
టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం * గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరి కావు
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పెద్ది విశేష కృషి * ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్
నర్సంపేట, జనవరి 22: కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు ఎంతమాత్రం లేదని, నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ స్పష్టం చేశారు. దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి బొబ్బరోనిపల్లె, బలవంతపురం, గోపాలపురం, చంద్రయ్యపల్లి, దుగ్గొండి గ్రామాల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పెద్దితో కలిసి ఎంపీ సీతారాంనాయక్ పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి సభల్లో ఎంపీ మాట్లాడారు. ప్రాజెక్టులు కట్టకపోవడానికి కాంగ్రెస్, టీడీపీ గత పాలకులే కారణమని అన్నారు. చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు కట్టలేదో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి గవర్నర్ నరసింహన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను చూసి ప్రభుత్వానికి కితాబు ఇస్తే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు జీర్ణించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం దారుణమని అన్నారు. గవర్నర్ నరసింహన్‌ను విమర్శించడం అర్థరహితమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే 24 గంటల కరెంట్ వచ్చి తీరిందనే విషయాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో దూసుకు పోతోందని స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గాన్ని పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, మంత్రుల నియోజకవర్గాలకు దీటుగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను నర్సంపేటకు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభివృద్ధి పనులను టెండర్‌లో దక్కించుకుని పనులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకూ రోడ్లును ఎందుకు వేయలేదో? ఎమ్మెల్యే దొంతిని ప్రజలంతా నిలదీయాలన్నారు. కాగా, గోపాలపురం గ్రామ సర్పంచ్ ముప్పారపు విజేందర్, ఆరుగురు వార్డు సభ్యులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎంపీ, పెద్ది సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సుకినె రజిత రాజేశ్వర్‌రావు, ఎంపీపీ కుక్కమూడి సుశీల కమలాకర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు బైరి లలిత రమణారెడ్డి, ఆరెల్లి చందన నరేందర్, ఎంపీటీసీ జిల్లెల సాయికుమార్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ తోకల నర్సింహా రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, నాయకులు పొన్న మొగిళి, ఎన్‌ఆర్‌ఐ రాజ్‌కుమార్, గుండెకారి రంగారావు పాల్గొన్నారు.

మున్నూరు కాపు సంక్షేమానికి కృషి

* పాలకుర్తి ఎమ్మెల్లే ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి, జనవరి 22: మున్నురుకాపుల సమస్యలు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర ఫంక్షన్ హాల్‌లో మున్నురుకాపు సంఘం ప్రథమ మహాసభ మండల అధ్యక్షుడు కొండపెల్లి కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మున్నూరు కాపులు సంఘటితంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పాలకుర్తిలో కాపులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చొరవ చూపుతాతని తెలిపారు. స్థల సేకరణకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతానన్నారు. ఇళ్లు లేని కాపులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజురు చేస్తానని చేస్తానని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, కార్ఫొరేషన్ రుణాల మంజూరులో ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తానన్నారు. రెవెన్యూ కార్యాలయంలో కులం సర్టిఫికెట్‌ల విషయంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరింత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్ల మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య, రాజు, రవి, కొమురెల్లి, రాము, మురళి పాల్గొన్నారు.

కేయూ హాకీ పురుషుల జట్టు ఎంపిక
కేయూ క్యాంపస్, జనవరి 22: కర్నాటకలోని బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 22 నుండి 26 వరకు నిర్వహించనున్న ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో పాల్గొననున్న హాకీ పురుషుల జట్టును స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ గాదెపాణి ఎంపిక చేశారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజి ఆదిలాబాద్‌కు చెందిన నగేష్, పరమేశ్వర్, గజానంద్, నర్సింగారావు, వాగ్దేవి కాలేజి అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు చెందిన విద్యార్థులు శ్రీనివాస్ ప్రవీణ్, మహ్మద్ రబ్బాని, మహ్మద్ ఇజాజ్, భారతీ డిగ్రీ కాలేజి ఇస్లామియా కాలేజీకి చెందిన ఇర్ఫాన్, వివేక వర్దిని కాలేజీకి చెందిన గణేష్, సంఘమిత్ర డిగ్రీ కళాశాలకు చెందిన వంశీ, కెఎల్‌ఆర్ పీజీ డిగ్రీ కాలేజీ చెందిన నికీల్, గణపతి డిగ్రీ కాలేజీకి చెందిన రామేశ్వరం, ఎస్‌ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీకి చెందిన రాజు పాల్గొననున్నారు. ఈ జట్టుకు ఫిజికల్ డైరెక్టర్ ఎం. రవీందర్ కాకతీయ యూనివర్సిటీ కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరించనున్నారు.

పార్లమెంటరీ కార్యదర్శుల బర్తరఫ్‌కు బీజేపీ డిమాండ్

* గిరిజన జాతర మేడారానికి నిధులేవీ? * భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్న

వడ్డేపల్లి, జనవరి 22: రాష్ట్ర ప్రభుత్వం గతంలో నియమించిన పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలు చట్ట విరుద్ధం అని, వెంటనే పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టిన ఆరుగురు తెరాస ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భాజపా అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ సిఫార్సుల మేరకు రాష్టప్రతి దిల్లీ ప్రభుత్వానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారని, అదే విధంగా తెరాస ప్రభుత్వంలో కూడా పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగిన ఆరుగురు ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాలకు ఒకసారి గిరిజనులు జరుపుకొనే సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ కుంభమేళాగా పేరు పొందిందని, అలాంటి ప్రాముఖ్యత గల జాతరకు రాష్ట్ర ప్రభుతం అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకొందని, దీంతో లక్షలాదిగా తరలివచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని విమర్శించారు. మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భాజపా కార్యకర్తలు స్వచ్ఛందంగా తాగునీరు, వైద్యం, ఇతరత్రా సేవలను అందించడంలో భాగస్వాములు అవుతారని తెలిపారు. సమ్మక్క సారలమ్మ గిరిజన జాతరకు కేంద్రంలోని గిరిజన మంత్రులు, గిరిజన పార్లమెంట్ సభ్యులు హాజరు అవుతారని తెలిపారు. నాలుగు సంవత్సరాల తెరాస పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయందనీ.. సామాన్యునికి కనీసం ప్రశ్నించే హక్కుకూడా లేకుండా తీవ్ర పోలీసు నిర్బంధాలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేవరకు ప్రజాచైతన్య యాత్రలను రాష్టవ్య్రాప్తంగా ఫిబ్రవరి నెలలో చేపడుతామని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ర్రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.