వరంగల్

టమాట ఢమాల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఫిబ్రవరి 16: టమాట ధర పాతాళానికి పడిపోయింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సంతలో టమాటాలు రూపాయికి కిలో చొప్పున విక్రయించినా కొనేందుకు ముందుకు రాకపోవడంతో చివరకు ఉచితంగా పంచిపెట్టారు. వారంతపు సంతలో వివిధ ప్రాంతాల నుండి కూరగాయల వ్యాపారులతో పాటు పలువురు రైతులు కూడా టమాటాలు విక్రయానికి తీసుకొస్తారు. అటు వ్యాపారులు.. ఇటు రైతులు తెచ్చిన టామాటాలతో సంత నిండిపోయింది. దీనితో డిమాండ్ పడిపోయింది. ఉదయం పూట రెండు రూపాయలకు కిలో చొప్పున, తరువాత కిలోకు రూపాయి చొప్పున విక్రయించినా టమాటాలు ఒడవకపోవడంతో చివరకు వాటిని తిరిగి తీసుకెళ్లడానికి రవాణా చార్జీలు భారంగా మారడంతో నెక్కొండకు చెందిన సపావట్ యాకూబ్ అనే కూరగాయల వ్యాపారి ప్రజలకు ఉచితంగా దాదాపు 60 కిలోల టమాటాలను పంచిపెట్టారు. మరికొందరు వ్యాపారులు అమ్మకుండా మిగిలిపోయిన టమాటాలను సంతలోనే వదిలేసి వెళ్లిపోవడంతో కొందరు వాటిని ఇంటికి తీసుకెళ్లారు. కాగా, మండలంలోని వివిధ గ్రామాల్లో టమాటా పంట సాగు చేసిన రైతులు కూడా టమాటాకు ఆశించిన ధర లేక పోవడంతో ఏరకుండా చేనులోనే వదిలేస్తున్నారు. తిమ్మంపేటకు చెందిన మాలోత్ మోతీలాల్ అనే రైతు 20 వేల పెట్టుబడితో ఎకరం భూమిలో టమాటా పంట సాగు చేయగా దిగుబడి ఆశించినంతగా వచ్చినా కొనేవారు లేక టమాటాలను ఏరకుండా వదిలేశాడు. టమాటాలు అమ్మితే ఏరడానికి వచ్చే కూలీలకు చెల్లించే డబ్బులు కూడా రావడం లేదని వాపోయాడు. దీంతో దాదాపు 30 కిలోలు తూగే ట్రే టమాటాలు విక్రయిస్తే పట్టుమని ముప్పై రూపాయలు రావడం లేదని, దీనికి రవాణా చార్టీలు తోడవ్వడంతో టమాటాలు ఏరడం లేదని చెప్పాడు. కూరగాయల సాగుతో తాము లాభపడవచ్చని భావిస్తే ధర తగ్గి టమాట పంట తమను నిలువునా ముంచిందని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు.

నర్సంపేట మార్కెట్‌కు మొక్కజొన్న వెల్లువ
* పడిపోతున్న ధరతో రైతుల ఆందోళన
నర్సంపేట, ఫిబ్రవరి 16: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు గత కొద్ది రోజులుగా వెల్లువలా మొక్కజొన్న వస్తోంది. నర్సంపేట డివిజన్‌లోని నర్సంపేట, కొత్తగూడ, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల్లో రబీలో మొక్కజొన్న పంటను రైతులు విపరీతంగా సాగు చేశారు. ఈ క్రమంలో నిత్యం వందలాది క్వింటాళ్ల మొక్కజొన్నలను రైతులు ట్రాక్టర్ల ద్వారా మార్కెట్‌కు తీసుకవచ్చి ఆరబోసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది మొక్కజొన్న ధర గణనీయంగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది మొక్కజొన్నకు క్వింటాల్‌కు 14వందల పైచిలుకు ధర పలికితే ఈ ఏడాది 12వందల ధర మాత్రమే లభిస్తుండడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పొరుగునే ఉన్న మహరాష్ట్ర నుండి పెద్ద ఎత్తున మొక్కజొన్న తెలంగాణకు దిగుమతి అవుతోందని, ఈక్రమంలోనే మొక్కజొన్న ధర పడిపోయిందని ఖరీదు దారులు చెబుతున్నారు. అయితే ధర పడిపోతే మార్కెఫెడ్ రంగ ప్రవేశం చేయాల్సి ఉండగా ఇంత వరకు నర్సంపేట మార్కెట్ వైపు మార్కెఫెడ్ అధికారులు కనె్నత్తి కూడా చూడటం లేదు. మార్కెఫెడ్ అధికారులు రంగ ప్రవేశం చేసి రైతుల మొక్కజొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మృతుల కుటుంబాలకు ఇనగాల పరామర్శ
* రజాక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి * పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల డిమాండ్
పరకాల, ఫిబ్రవరి 16: పరకాల మల్లారెడ్డిపల్లి కాలనీలో ఉంటున్న ఎండీ రజాక్ మనస్తాపంతో మృతి చెందగా శుక్రవారం పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి రజాక్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మృతుని కుటుంబానికి ఇనగాల ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ రజాక్ గతంలో వీఆర్‌ఏగా పని చేశారని చెప్పారు. అయితే రజాక్‌ను తొలగించడంతో మనస్తాపంతో మృతి చెందినట్లు కుటుంబీకులు ఇనగాలకు చెప్పారు. చనిపోయిన రజాక్ కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పరకాల పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బండి సారంగపాణి చిన్నాన్న బండి సమ్మయ్య ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందగా పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట డాక్టర్ వివేక్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మార్క రఘుపతిగౌడ్, మాదాసి రాంమూర్తి, సాంబశివుడు, వరంగల్ పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యడ శ్రీనివాస్, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా కో ఆర్డినేటర్ మార్క అభినవ్‌గౌడ్, దామ అనిల్, మచ్చ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం చేతుల్లో రైతుల దగా..
*రైతు జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మోర్తాల చందర్‌రావు
పరకాల, ఫిబ్రవరి 16: రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని రైతు జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మోర్తాల చందర్‌రావు అన్నారు. శుక్రవారం పరకాల మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పరకాల ప్రాంత కన్వీనర్ కొలుగూరి రాజేశ్వర్‌రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మోర్తాల చందర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం బడ్జెట్‌లో 2.38 శాతం వ్యవసాయానికి కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో 2.35 శాతం కేటాయించి రైతు బడ్జెట్‌గా పేర్కొనడం చోద్యంగా ఉందన్నారు. ఇలాంటి అబద్ధపు ప్రచారంతో రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పారు. స్వామినాధన్ కమిషన్ సూచనల ప్రకారం వంద రూపాయల పెట్టుబడిపై 150 రూపాయలు రైతులకు వచ్చే విధంగా మద్దతు ధరలు చెల్లిస్తామని పార్లమెంటు సాక్షిగా నిస్సిగ్గుగా చెప్పడాన్ని రైతు జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ పాలన రావాలి
* నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
గూడూరు, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చేవరకు ప్రతి ఒక్కరు పోరాడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గూడురు మండలంలోని చంద్రుగూడెం, మట్టెవాడ, మచ్చర్ల, గాజులగట్టు,్భపతిపేట గ్రామాలకు చెందిన సుమారు 200మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్షుడు కత్తిస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ఎస్సీ,ఎస్టీలకు మూడెకరాల భూమి ఇలా అనేక హామిలిచ్చి అధికారంలోకి రాగానే తుంగలో తొక్కారని విమర్శించారు. హరితహారం పేరుతో గిరిజనుల భూములు లాక్కొంటున్నారని ఆరోపించారు.
రిజర్వేషన్‌ల పేరుతో లంబాడి, ఆదివాసీల మద్య చిచ్చుపెట్టారని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని అన్నారు. గూడూరు నుండి పొన్నం వెంకన్న, బీరం శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో 40కుటుంబాలు, ఏపూరు నుండి ఊరబోయిన వెంకన్న, లింగయ్య ఆధ్వర్యంలో 80కుంటుంబాలు, భూపతి పేట నుండి వెంకన్న, విజయ్‌ల ఆధ్వర్యంలో 20కుటుంబాలు, మట్టెవాడ నుండి మాజీ ఎంపిటిసి ఈసం శ్రీనివాస్, మచ్చర్ల నుండి కొమ్ము నర్సయ్య, ఆవుల రాములు ఆధ్వర్యంలో 30కుటుంబాలు, చంద్రుగూడెం నుండి కనె్నబోయిన వెంకన్న ఆధ్వర్యంలో 20కుటుంబాలు లైన్ తండా నుండి 40కుటుంబాలు, గాజులు గట్టు నుండి ఐదు కుటుంబాలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. 2005లో కాంగ్రెస్‌పార్టీతో పొత్తుపెట్టుకున్న అడవి హక్కుల చట్టం వస్తుంటే చప్పట్లు కొట్టిన కేసీఆర్ హరితహారం పేరుతో నిరుపేదల భూములు లాక్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేయాలని ఆమె నాయకులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమ పథకాలను గాలికొదిలేశారని విమర్శించారు. తెరాసది ప్రచార ఆర్భాటమే తప్పా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు నునావత్ రమేష్, ఎంపిపి చెల్పురి వెంకన్న, సిహెచ్ వెంకన్న, యాకుబ్, పాషా, రాధా, మోతీలాల్, సుచిత్ర, మధు, ప్రేమలత, సంపత్, శివ, స్వామి, రమణారెడ్డి, అమరెందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సదానందం, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

హరిహర మహాదేవ
*పాలకుర్తి సోమేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు దాటిన భక్తులు * ఘనంగా మహాన్నపూజ
పాలకుర్తి, ఫిబ్రవరి 16: మహిమాన్వితమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సతీ సమేతులైన పార్వతీ శంకరులు, లక్ష్మీనరసింహులను స్మరించుకొంటూ.. శుక్రవారం అగ్నిగుండాలపై నడిచారు. తెల్లవారు జామునే్న అర్చకులు స్వాముల ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. శివునికి ప్రీతికరమైన వీరముష్ఠి డప్పు వాయిద్యాల నడుమ, భక్తుల శరణు గోషాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. తొలుత దేవదేవుళ్ళను అగ్నిగుండాలు దాటించారు. వారి వెనకాలే భక్తులు అగ్నిగుండాలపై నడిచారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అగ్నిగుండాలు దాటిన వారికి.. చేసిన దోషాలు తొలగిపోయి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అందున హరిహరులు నడిచే అగ్నిగుండాలపై వారి వెనకాల నడిస్తే వారికి ఎదురుండదని భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకోవడంతో సందడినెలకొంది.
పెద్దల నుండి పిల్లల వరకూ అగ్నిగుండాలపై నడిచి హరిహరులను ప్రసన్నం చేసుకొన్నారు.
శివునికి మహాఅన్నపూజ
క్షీరగిరి క్షేత్రంపై కోలువైన సోమేశ్వరుడికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం స్వయంభువుగా వెలిసిన శివలింగానికి పెరుగుఅన్నంతో అలంకరించి మహాఅన్నపూజ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా జరిపారు. మహాఅన్నపూజలో శివుడు భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకొని పూనితులైనారు.
పూర్ణాహుతి, పండిత సన్మానం
హోమ మండపంలో అర్చకులు దేవుళ్ళకు గత వారం రోజులుగా నిర్వహిస్తున్న రుద్రహోమంలో చివరి రోజు పూర్ణహుతిని హోమగుండంలో వేదమంత్రల నడుమ శాస్త్రోత్తముగా వేశారు. మహాశివారాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో అర్చకులు, ప్రజాప్రతినిథులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు సన్మానం చేశారు.