వరంగల్

మానుకోట సీటు ఎవరికో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 23: జిల్లాకేంద్రంగా మారిన మానుకోట శాసనసభా నియోజకవర్గ టిక్కెట్‌కు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. ఆశావాహుల తాకిడి అధికంగా పెరుగుతోంది. తెలంగాణ రాష్టస్రమితి తరుపున గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన భానోత్ శంకర్‌నాయక్ ఈ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. అనేక వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా గులాబి జెండాను రేపరేపలాడిస్తూ శంకర్‌నాయక్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయినా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి మార్పు జరుగుతుందనే ఆశతో అనేకమంది ఇప్పటి నుండే తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేయిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సాధించుకున్న శంకర్‌నాయక్ వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని గిట్టి నమ్మకంతో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో సిట్టింగ్‌లందరికి సీటు గ్యారంటీ అని ప్రకటించారని, సీఎం సర్వేలోనూ మంచి మార్కులు సాధిస్తున్న తనను కాదని వేరొక్కరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే ఆలోచన అధినాయకత్వానికి ఎందుకు వస్తుందనే ధీమాతో సిట్టింగ్ శాసనసభ్యుడు శంకర్‌నాయక్ తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నారు.
సీఎం.. అప్పుడే మాటిచ్చారు..
కాంగ్రెస్‌లోంచి తెరాసలోకి చేరిన సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు డోర్నకల్, తన కూతురు మాజీ ఎమ్మెల్యే కవితకు మహబూబాబాద్ టికెట్‌లు ఇస్తానని మాటిచ్చారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవల బహిరంగంగానే ప్రకటించారు. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి, రెండు టికెట్‌ల హామీతోనే తాము తెరాసలోకి వచ్చామని సీనియర్ నాయకుడు రెడ్యానాయక్ ధీమాతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే శంకర్‌నాయక్‌పై గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీచేసి ఓటమి పాలైన మాలోతు కవిత తెరాసలో చురుకుగా పనిచేస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు కూడా స్వీకరించారు. తన అనుచరులతో కలసి మానుకోట నియోజకవర్గంలో విరివిగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో కలసి ఉండే దిశగా అడుగులు వేస్తున్నారు. మానుకోటలో నూతనంగా కవిత గృహనిర్మాణం చేయడం, ఇటీవల అదే ఇంట్లో తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం, జనసమీకరణ చేయడం వంటి అంశాలు పరిశీలిస్తే ఎమ్మెల్యే టికెట్‌పై కవిత గట్టి ఆశతోనే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఎర్రబెల్లి ఆశీస్సులతో అవకాశం..
తెలంగాణ తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టి తెరాసలోకి వచ్చిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆశీస్సులతో తనకు మానుకోట అసెంబ్లీ టికెట్ వస్తుందనే నమ్మకంతో మోహన్‌లాల్ ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యునిగా మోహన్‌లాల్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. దయాకర్‌రావుతో కలసి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కూడా ఈ మద్య మహబూబాబాద్ నియోజకవర్గంలో శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ తానుసైతం పోటీలో ఉన్నాననే సందేశాన్ని పంపుతున్నారు. టీడీపీలో రాష్టస్థ్రాయి నేతగా చక్రం తిప్పిన ఎర్రబెల్లి కచ్చితంగా తనకు టికెట్ సాధించిపెడతారనే నమ్మకం మోహన్‌లాల్‌లో కనిపిస్తుంది.
చాపకింద నీరులా ఏఎస్పీ నాగరాజు..
మహబూబాబాద్ డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో సంపూర్ణ గుడుంబా నిషేధ సాధనతో ఈ ప్రాంతంలో మంచి గుర్తింపును సాధించుకున్న నాగరాజు ప్రస్తుతం మెదక్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడంతో ఆయన ఎక్కడా రాజకీయపరమైన కోణంలో పెదవి విప్పకున్నా నియోజకవర్గంలో కొందరు నాయకులు నాగరాజు పక్షాన ముమ్మరంగా పనిచేస్తున్నారు. నాగరాజు తనకున్న పరిచయాలతో చాపకింద నీరులా మానుకోట అసెంబ్లీ టికెట్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. నాగరాజు యువసేన పేరుతో మహబూబాబాద్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు గత కొద్దిరోజుల క్రితం నాగరాజు కురవి దేవాలయానికి వచ్చినప్పుడు వందలాది బైక్‌లతో యువకులు ఎదురేగి స్వాగతం పలుకడం వంటి అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. వీరికి తోడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా చురుకైన పాత్ర పోషించిన బానోత్ రవికుమార్ సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశావాహుల జాబితాలో తన పేరు చేర్చుకున్నారు. యువతను, విద్యార్థి నాయకులను కలుపుకోని నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. డిసెంబర్‌లో కచ్చితంగా ఎన్నికలు రావోచ్చంటూ బలమైన వాదనలు వినిపిస్తున్న ఈ సమయంలో ఏడాదికి ముందే మానుకోట కారులో జోరు పెరిగింది. ఇప్పటికే ఎవరికి అనుకూలమైన ఆశావాహుల పక్షాన ఈ ప్రాంత నాయకులు చేరిపోవడం ప్రారంభమైంది. ఒకరి వెంట తిరుగున్న నాయకులు, కార్యకర్తలు మరో నాయకుని అనుచరులతో మాటలు నిలిపివేసే దాకా పరిస్థితి చేరుకుంది. వీలైనంత త్వరగా ఎదో ఒక స్పష్టత రాకుంటే గులాబి గూటిలో గ్రూపులు మరింత బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలం గడిచే కొద్ది ఈ ఆశావాహుల పోరు మానుకోట రాజకీయాలను మరితం వేడెక్కించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.