వరంగల్

కేయూ పరిపాలనను స్పందింప చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేయూ క్యాంపస్, ఫిబ్రవరి 23: కాకతీయ విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకులు టి ఆప్టా అధ్వర్యంలో చేస్తున్న దీక్షలు 100రోజులకు చేరుకున్నారు. 100రోజుల దీక్షలో భాగంగా శుక్రవారం నిరసన శిభిరం నుండి పరిపాలన భవనం వరకు డప్పుచప్పుళ్లతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా వినూత్నమైన శిరోముండనం నిర్వహిస్తున్నప్పుడు పోలీసులు వచ్చి కుప్టా అధ్యక్ష కార్యదర్శులను తిరుపతిరాజ్, ప్రభాకర్, సదానందం,రాంమోహ్మాన్‌లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గత వంద రోజులుగా శాంతియుతంగా చేస్తున్న దీక్షలను భగ్నం చేయాలనే కుట్రలో భాగంగా విసి రిజిస్ట్రార్ పోలీసులను ఉసుగొలిపి, విశ్వవిద్యాలయాన్ని పోలీసుల క్యాంప్‌గా మార్చరని నాయకులు ఆరోపించారు. అరెస్ట్ చేసిన కుప్టా నాయకులను వెంటనే విడుదల చేయాలని పార్ట్ టైం అధ్యాపకులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అరెస్ట్‌లకు నిరసనగా నేడు కేయూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు అధ్యాపకులు ప్రకటించారు. మా న్యాయ మైన డిమాండ్స్ సాధించుకునేంత వరకు దీక్షలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, వీరస్వామి, బ్రహ్మాచారి, నవీన్‌కుమార్, కుప్టా వర్కంగ్ ప్రెసిడెంట్ కిరణ్‌గౌడ్, వినోద, జయప్రకాశ్ గౌడ్, రాజేంద్రప్రసాద్, వివిధ విభాగాల పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.

కేయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ

నక్కలగుట్ట, ఫిబ్రవరి 23: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పరస్పరం విచక్షణా రహితంగా భౌతికదాడులకు పాల్పడిన సంఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. విశ్వవిద్యాలయంలో గత కొంతకాలంగా పిహెచ్‌డి ప్రవేశాలలో అక్రమాలు జరిగాయని, మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని, సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కలిసి జాక్‌గా ఏర్పడి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఉపకులపతి ఎలాంటి అక్రమాలు జరగలేదని పత్రికాముఖంగా ప్రకటించారు.దీంతోవిద్యార్థులు ఆగ్రహం చెంది గురువారం నుండి కార్యాచరణ ప్రకటించి తమ నిరసనలను ఉదృతం చేశారు. అందులో భాగంగా శుక్రవారం కేయూ విద్యార్థి జాక్ అన్ని విభాగాలను బంద్ చేస్తూ, ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుని బంద్‌కు సహకరించాలని ఇంజనీరింగ్ విద్యార్థులను కోరారు. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థులు తాము యుజి విద్యార్థులమని, పిహెచ్‌డితో తమకు సంబంధం లేదని, తమ సమస్యలు ఉన్నపుడు ఎవరు వచ్చారని నిలదీశారు. అంతే కాకుండా ప్రతినిత్యం బంద్‌లు, నిరసనలు ఏమిటని, అన్యాయం జరగలేదని అధికారులు ప్రకటిస్తున్నారు కదా అని ఎదురుప్రశ్నించగా, వారి మద్య మాటా మాటా పెరిగి విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడులలో రాజగోపాల్, రాజు, మనోహర్, సారయ్యలు గాయపడగా, దగ్గరలోకి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది, ఇంజనీరింగ్ కళాశాలకు తాళాలు వేసి, పరిస్థితిని ఎప్పటి కప్పుడు పరిశీలిస్తున్నారు.
ఎమ్మెల్యేల రంగ ప్రవేశం
విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మద్య జరిగిన సంఘటనలు తెలుసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లు విశ్వవిద్యాలయానికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని పరామర్శించి సంఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకుంటామని, అక్రమాలపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేస్తామని తెలిపారు. విద్యార్థులు సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, శాంతియుత వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు.
ప్రిన్సిపాల్ తొలగింపు
కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విద్యార్థుల ఘర్షన నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య మల్లారెడ్డి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు గొడవ పడుతున్న సందర్భంలో ప్రిన్సిపాల్ కలిగించుకోకపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆయన కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా సరిగా స్పందించలేదనే భావతోనే ఆయనను తొలగించినట్లు తెలుస్తోంది.దీంతో శుక్రవారం సాయంత్రం ఇసిఇ విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న ఆసీం ఇక్భాల్‌ను తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా నియమించారు.

13 ఇసుక లారీల పట్టివేత
వెంకటాపురం (నూగూరు), ఫిబ్రవరి 23: మండల పరిధిలోని సూరవీడు పంచాయతీ కొండాపురం గోదావరి ఇసుక ర్యాంపులో అనుమతికి మించి అదనపు ఇసుకతో, తప్పుడు వేబ్రిడ్జి పాసింగ్ బిల్లుతో రవాణ అవుతున్న 13 ఇసుక లారీలను మండల రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. ఇదే ఇసుక ర్యాంపుకు సంబంధించి వారం రోజుల క్రితం తాడ్వాయి సమీపంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదనపు లోడ్‌తో వెళుతున్న పదకొండు లారీలను పట్టుకుని సీజ్ చేసిన విషయం పాఠకులకు తెల్సిందే. తాజాగా మరో పదమూడు లారీల్లో అదనపు ఇసుక రవాణా అవుతుందనే సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు దాడుల చేపట్టారు. మండల డిప్యూటీ తహశీల్దార్ రాము శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో లారీల స్వాధీనం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొండాపురం ఇసుక ర్యాంపు నుండి పాసింగ్ బిల్లు కంటే ఒక్కొ లారీ నుండి రెండు నుండి మూడు టన్నులకు మీదుగా ఇసుక తరలివెళుతున్నట్లు సమాచారం మేరకు నూగూరు గ్రామం వద్ద లారీలను నిలిపివేసి వేబ్రిడ్జిపై తిరిగి కాంటా వేసినట్లు తెలిపారు. ఒక్కో లారీలో రెండు నుండి మూడు టన్నుల అనుమతి లేని ఇసుక రవాణ అవుతున్నట్లు తేలడంతో పదమూడు లారీలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అంకన్నగూడెం గ్రామం వద్ద నున్న లారీ వేబ్రిడ్జిపై 32.5టన్నుల అభ్యంతరం లేని కాంటా రశీదులను రవాణా పత్రాలకు జతచేసి చెకింగ్ అధికారులకు అనుమానం రాకుండా రవాణా చేస్తున్నారని అన్నారు.
నూగూరు వద్ద కాంటా వేయించగా లారీలు పట్టుబడ్డట్లు తెలిపారు. టీఎస్‌ఎండీసీ శాఖ నుండి అదనపు సమాచారాన్ని తెప్పించుకుని నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. కాగా కొండాపురం ఇసుక ర్యాంపును అదనపు బకీట్లకు వెయ్యి రూపాయల చొప్పున రేజింగ్ కాంట్రాక్టర్లు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. అదే విధంగా 35 టన్నుల దాటిన పట్టుబడ్డ లారీలను ములుగు సబ్ కలెక్టర్‌కు నివేదిక పంపుతున్నట్లు వివరించారు. ఈదాడుల్లో గ్రామ రెవెన్యూ అధికారులు రామేందర్, లక్ష్మీ, బాలరాజు, రాములు, గ్రామ పరిపాలనాధికారులు ఇండ్ల రజిత, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రులు.. ఆలయాలు!
బచ్చన్నపేట, ఫిబ్రవరి 23: ఆసుపత్రులు ఆలయాలాంటివని, వాటిని పవిత్రంగా చూసుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ 30పడకల ఆసుపత్రిని సందర్శించారు. అసుపత్రిలోని మెటర్నిటి వార్డులను, శస్తచ్రికిత్స గదులను పరిశీలించారు. అనంతరం అసుపత్రి వైద్యాధికారి డిప్యూటి డీఎంఅండ్‌హెచ్‌వో అశోక్‌కుమార్‌తో కాసేపు మాట్లాడారు. ఆసుపత్రి ప్రసూచి వివరాలను అడిగి తెలసుకున్నారు. కేసిఆర్ కిట్లు ఎంతమందికి అందిచారో సమాచారం తీసుకున్నారు. ఆరోగ్యపరంగా ప్రభుత్వం చేపడతున్న పథకాలని ప్రత్యేకంగా పల్లెల్లోని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఆసుపత్రిలో వైద్యసేవలు సక్రమంగా అందేలా చూసుకోవాలని వైద్యాధికారికి సూచించారు. అనంతరం కొనె్నలో ఓ కుటుంబ యజమానికి మృతిచెందగా, ఆకుటుంబాన్ని ఓదార్చి తోచినమేర ఆర్థిక సహాయం అందించారు. ఆయన వెంట పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

భద్రకాళి సన్నిధిలో కలెక్టర్ దంపతులు
* నూతన వధూవరులకు ఆలయ మర్యాదలతో స్వాగతం * కలెక్టర్ దంపతులను చూడడానికి తరలి వచ్చిన జనం

వరంగల్, ఫిబ్రవరి 23: ఇటీవలే వివాహమైన జిల్లా కలెక్టర్ అమ్రపాలి-సమీర్ శర్మ దంపతులు ప్రప్రథమంగా వరంగల్ విచ్చేసిన సందర్భంగా వరంగల్ ప్రజల ఆరాధ్య దేవతయైన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్రపాలి సమీర్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు దాదాపు 40మంది అమ్మవారిని దర్శించడానికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన అమ్రపాలి సీమర్ దంపతులకు ఆలయ ఈఓ సునీత, ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు వేద స్వస్తి, పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. ముందుగా ఆదిశంకరాచార్య వల్లభ గణపతిని సేవించి అమ్మవారి ప్రధానాలయంలోకి ప్రవేశించి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీచక్రస్నానం జరిపి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పూజానంతరం మహామండపంలో అమ్రపాలి దంపతులకు అమ్మవారి శేషవస్త్రాలను బహూకరించి ప్రధానార్చకులు భద్రకాళి శేషు అధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు, వేద విద్యార్థులు, మహదాశీర్వచనం జరిపి ప్రసాదాలను అందజేశారు. ప్రధానార్చకులు సమీర్ కుటుంబ సభ్యులకు ఆలయ స్థల పురాణాన్ని వివరించారు. ఈ రోజు శుక్రవారం కావడంతో భక్తులకు ఇబ్బంది కలుగకూడదని భక్తులు తక్కువగా ఉండే సమయాన్ని తెలుసుకుని మధ్యాహ్నం 12 గంటలకు అమ్రపాలి సమీర్ దంపతులు గుడికి విచ్చేశారు. అయినా ఆలయ ప్రాంగణంలో ఉన్న దాదాపు రెండు వందల మంది భక్తులు కలెక్టర్ ఆమ్రపాలి దంపతులను తమ సెల్‌ఫోన్లలో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. తమ జిల్లా కలెక్టర్ కొత్తగా పెళ్లి చేసుకుని బంధుగణంతో గుడికి రావడం ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో నవదంపతులను మేళతాళాలతో వేద మంత్రాలతో గుడిలోకి తీసుకువెళ్లడం అంతా ఒక పండగ వాతావరణం ఏర్పడింది. భక్తులు కూడా గుడిలో ఉండి ఆ వేడుక చూడడం ద్వారా ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ప్రముఖులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ సిటీ పోలీస్ కమీషనర్ సుధీర్‌బాబు ఉన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
* ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి
మహదేవ్‌పూర్, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేఖం కాదని, అయితే కేవలం ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేఖమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం పొంగులేటి సుధాకర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కోరిక మేరకు తామంతా కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు వచ్చామని చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ సుజల స్రవంతి పేరుగా నామకరణం చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద నష్టపోయిన నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజి కింద నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ ఏనాడు అడ్డుపడలేదని, అయితే రీడిజైనింగ్ విషయానే్న ప్రశ్నించామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం చైనా తరహాలో చేపట్టడం అద్బుతమేనని అన్నారు. కాగా పోలవరంకు ఎలాంటి జాతీయ హోదాను కేంద్రం ఇచ్చిందో అదే తరహాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటి వరకు పనె్నండు మంది కూలీలు మృత్యువాతపడ్డారని, వారి మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంభాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రాజెక్టు విషయంలో భద్రతా ప్రమాణాలతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శించడం సరి కాదన్నారు. విభజన చట్టంలో ఉన్న వెనుకబడిన వర్గాల అభివృద్ది, హైకోర్టు డివిజన్ కోర్టు, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీతి అయోగ్‌కు 5వేల కోట్లు తదితర హామీల అమలులో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకుండా పోయిందన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రంతో పోరాడితే తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

నేటి నుంచి కొడవటంచ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
* 25న స్వామి కల్యాణం
రేగొండ, ఫిబ్రవరి 23: భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ సుప్రసిద్ద కొడవటంచ లక్ష్మీనర్సింహస్వామి విరాజిల్లుతున్నాడు. ఏటా పాల్గుణ మాసంలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా శనివారం ఉదయం అభిషేకం, సూర్యవాహన సేవ, సాయంత్రం పుట్ట బంగారు సేవ, శేషవాహన సేవ, అంకురారోహణ, 25 ఆదివారం రోజు ధ్వజారోహణం, అశ్వవాహన సేవ, పల్లకి సేవ, ఎదురుకోళ్లు, కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 26న నిత్య నిధి, గజవాహన సేవ, 27న సింహవాహన సేవ, గరుడోత్సవం, 28న హనుమంత వాహన సేవ, చిన్న రథ సేవ, మార్చి 1న పూర్ణాహుతి, జాతర బోనాలు, వాహనాలు, బండ్లు తిరుగుట, పెద్ద రథంపై వీధుల గుండా స్వామి వారి ఊరేగింపు, జాతర ప్రారంభం, మార్చి 2న నిత్య నిధి, జాతర సేవలు, మార్చి 3న జాతర, హంసవాహన సేవ, పుష్పయాగం, నాఖాబలితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ కొలువూరి రాజేశ్వర్‌రావు తెలిపారు.

లక్ష్యసాధనకు చిత్తశుద్ధితో కృషిచేయాలి

*క్రమశిక్షణతోనే ఉత్తమ ఫలితాలు * మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి

తొర్రూరు,్ఫబ్రవరి 23: విద్యార్థులు, నిరుద్యోగ యువతి యువకులు తముకుతాముగానే ఒక నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ఆ లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో కృషిచేయాలని క్రమశిక్షణతో కృషిచేస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా చేదించి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, విద్యార్థులకు పట్టుదల ఉంటే వారికి ఎదీ అసాధ్యం కాదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం తొర్రూరు మండలం పత్తెపురం గ్రామంలోని డిఆర్‌ఎస్ కళాశాల ఆవరణలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా నిర్వహిస్తున్న నిరుద్యోగ యువతి యువకుల శిక్షణా శిభిరానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై శిక్షణ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే యువత ఒక ప్రణాళిక ప్రకారం నిరంతరం అధ్యాయనం చేస్తే ఎప్పటికప్పుడు నూతన ఒరవడులను అలవర్చుకోవాలని ఎస్పీ సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో కృషిచేసి ఉన్నత ఫలితాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు పోలీస్‌శాఖ తరుపున చేయూతనిచ్చి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపిక పరీక్ష కోసం ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించాలనే లక్ష్యంతో మహబూబాబాద్‌తోపాటు తొర్రూరు డివిజన్ పరిధిలో గత కొన్ని నెలలుగా హైద్రాబాద్‌కు చెందిన నిపుణులైన అద్యాపకుల చేత ఉచిత శిక్షణ తరగతులు ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణ పొందిన అభ్యర్థులు రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తమకు, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఎస్పీ ఆకాంక్షించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు గాయత్రిగ్రానైట్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన స్టడీ మెటీరియల్‌ను ఎస్పీ అభ్యర్థులకు పంపిణీ చేశారు.