వరంగల్

అవినీతికి ‘కాళేశ్వరం’ వరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, మే 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మాణం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై మావోయిస్టులు గరం గరమయ్యారు. అవినీతి దందాకు కాళేశ్వరం ప్రాజెక్టు వరంగా మారిందని మావోయిస్టు ఏటూరునాగారం - మహాదేవపూర్ ఏరియా కమిటీ ఆరోపించింది. ఈమేరకు వాట్సప్‌లో మావోయిస్టుల లెటర్ ప్యాడ్‌తో వెలువడిన రెండు పేజీల లేఖలు వైరల్‌గా మారాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో రెవెన్యూ అధికారుల అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని మావోయిస్టు ఏటూరునాగారం-మహాదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములను లంచాలు తీసుకొని తప్పుడు సర్వే నెంబర్లు రాస్తూ తప్పుడు పట్టాలు సృష్టించి లక్షలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ అండతో పోలీసుల ప్రోద్బలంతో భూకబ్జాలకు పాల్పడుతున్న వారి వద్ద నుంచి లంచాలు పొందుతున్నారని అన్నారు. దాని మూలంగా నిజమైన రైతుల భూములు ఆర్థిక సహయాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. భూపాలపల్లి ఆర్డీఓ వీరబ్రహ్మచారీ, తహాశీల్ధారు సాంబమూర్తిలు గ్రామ రెవెన్యూ అధికారుల సహాయంతో అవినీతి దందాకు పాల్పడుతున్నారని మావోయిస్టు కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. మేడిగడ్డ, కనె్నపల్లి, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టు బ్యారేజీలతో భూములు కోల్పోయిన రైతులకు సరైన నష్ట పరిహారం చెల్లించలేదని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూములు కోల్పోయిన రైతులను అధికారులు లంచాల పేరిట వేధింపులకు గురిచేస్తున్నారని, దాంతో వారికి న్యాయమైన మద్దతు నష్ట పరిహారం అందడం లేదని ఆయన విమర్శించారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అండతో టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయకుండా, మరో ప్రక్క గోదావరి నదీలోని భూములను సైతం దొంగ పట్టాలు సృష్టించి కబ్జా పేరుతో లక్షలాది రూపాయలను కాజేస్తున్నారని ,రెవెన్యూ అధికారులు, టీఆర్‌ఎస్ నేతలు లంచాలు అక్రమ దందాలు మానుకోవాలని మావోయిస్టు నేత సుధాకర్ హెచ్చరించారు. ఇప్పటివరకూ కబ్జాలకు పాల్పడి ప్రాజెక్టుల కింద పెట్టిన భూములను నిజమైన రైతులకే అప్పగించాలని పేర్కొన్నారు. తప్పుడు పద్దతులు మానుకోవాలంటే టీఆర్‌ఎస్ నేతలకు, అధికారులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని, పల్లెనిద్ర పేరుతో వస్తున్న ఎమ్మెల్యేలను, టీఆర్‌ఎస్ నేతలను తన్ని తరిమేయండి అని పేర్కొన్నారు. లంచగొండి అధికారులకు, భూకబ్జాదారులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మావోయిస్టు ఏటూరునాగారం-మహాదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పిలుపునిచ్చారు.

జూన్ 10న గర్జన సభ
* జనసమీకరణ కోసమే దళిత, గిరిజన గర్జన సభ వాయిదా
* చట్టాలను మార్చే అధికారం చట్టసభలకు ఉంది: మంద కృష్ణమాదిగ, దయాకర్
జనగామ టౌన్, మే 21: భారీగా జనాన్ని సమీకరించేందుకే 27న జరగాల్సిన దళిత, గిరిజన గర్జన సభను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దెంకి దయాకర్, ఎల్‌హెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యలు ప్రకటించారు. జనగామ విజయ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి దళిత, గిరిజనులను లక్షలాదిగా తరలించాలనే ఉద్దేశ్యంతోనే గర్జనను వాయిదా వేసుకున్నాం తప్పా మరోటి కాదని అన్నారు. ఇప్పటికే గర్జనకు తరలిరావడానికి దళిత, గిరిజనులు సిద్దమవుతున్నారన్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రజలను తరలించడానికి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నిర్విర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం న్యాయ స్థానాల ద్వారా నాటకం ఆడిస్తుందని విమర్శించారు. ఈ చట్టం అమలులో ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల్లో దళిత, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఏమాత్రం సవరించినా దేశంలోని దళిత, గిరిజనులకు ఏమాత్రం రక్షణ ఉండదని అన్నారు. ఇప్పటికే అట్రాసిటి చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేసి దోషులను కఠినంగా శిక్షించాలని దళిత, గిరిజన సంఘాలు అనేక ఉద్యమాలు చేస్తున్న నేపధ్యంలో న్యాయస్థానం ఆ చట్టాన్ని నిర్విర్యం చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. న్యాయ శాఖకు చట్టాలను పరిశీలించి, వాటి అమలు తీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రమే రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. అలాంటిది చట్టాన్ని సవరించే ప్రయత్నం చేయడం సరైన పద్దతి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్ట సభల్లో రూపుదిద్దుకున్న చట్టాలను అమలుచేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాఖపై ఉండగా, ఆ చట్టాల అమలులో తేడా ఉన్నప్పుడు జోక్యం చేసుకునే అధికారం న్యాయ స్థానాలకు ఉందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలో ఏ ఒక్క అక్షరాన్ని తొలగించినా సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను మానుకొని రాజ్యాంగ 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఏపీ అధ్యక్షులు బ్రహ్మయ్య, బుడిగ జంగాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ వారణాసి స్వా మి, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకుడు నిర్మాళ రాములు, ఎమ్మా ర్పీఎస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కొయ్యడ మల్లేశం, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకుడు చెప్పాల ప్రసాద్, దళిత, గిరిజన సంఘాల నాయకుడు కన్నారపు పరశురాములు, ఆజ్మీర స్వామినాయక్, నర్సయ్య, యాదగిరి, రవిలు పాల్గొన్నారు.

మరణంలోనూ వీడని రక్తసం‘బంధం’
* తండ్రి, తనయుల మృతదేహాలు లభ్యం * జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు
నర్మెట, మే 21: మండలంలోని హన్మంతాపూర్ బంధువుల ఇంటికి పండగకి వచ్చి సరదాగా బొమ్మకూర్ రిజర్వాయర్‌లో స్నానానికి వెళ్లి ఆదివారం గల్లంతైన తండ్రి, కొడుకుల మృతదేహాలను సహాయక బృందాలు సోమవారం మధ్యాహ్నం వెలికితీశారు. ఆదివారం సాయంత్రం వరకు రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహాలు లభ్యంకాకపోవడంతో తిరిగి సోమవారం ఉదయం గాలింపు చర్యలు ముమ్మరం చేయగా మధ్యాహ్నానికి ఆ మృతదేహాలు లభ్యమయ్యాయి. జనగామకు చెందిన మత్స్యకారులు శీలం నర్సింహులు, జీ. అంజనేయులు, ఈ. సత్యం, జీ. రాజు, పీ. లక్ష్మణ్, ఈ. రమేశ్‌లు సుమారు మూడు గంటల పాటు నీటిలో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. వారిని అధికారులతో పాటు గ్రామస్థులు అభినందించారు.
జనసంద్రమైన రిజర్వాయర్ ప్రాంతం: కొడుకును రక్షించబోయి తండ్రి గల్లంతైన ప్రమాద సంఘటన తెలియడంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు బొమ్మకూర్ రిజర్వాయర్ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. సహాయక బృందాలకు మొదట కొరటూరి వెంకటయ్య(45) మృతదేహం లభించిన అనంతరం మరోగంటకి అజయ్(15) మృతదేహాన్ని వెలికితీయడంతో కుటుంబ సభ్యుల, బంధువులు, పొరుగు గ్రామాల మహిళల రోధనలతో ఆ ప్రాంతం అంతా విషాదకరంగా చోటుచేసుకుంది. భర్త, కుమారుడి మృతదేహాలను చూసిన కృష్ణవేణి తట్టుకొలేక రోదించినతీరు మహిళలను కంటతడి పెట్టించింది. తండ్రి వెంకటయ్య ఆలేరులో సివిల్ కాంట్రాక్టర్. స్వంత మిల్లర్లు కలిగివుండడంతో ఆలేరు పరిసన ప్రాంతాల్లో సీసీరోడ్ల నిర్మాణాలు చేస్తూ 50మందికి పైగా జీవనోపాధి కల్పించాడు. దీంతో అతని ద్వార లబ్దిపొందిన వ్యక్తులు సంఘటన స్థలానికి చేరుకొని కంటతడి పెట్టారు. కాగా.. జనగామ డీసీపీ మల్లారెడ్డితో పాటు ఎస్సై వడిచర్ల గోవర్ధన్, ఏఎస్సై కాశిరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరకుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. తహశీల్దార్ శ్రీపతి వెంకటేశ్ అధికారులు సహాయ సహాకారాలు అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అంతా సిద్ధం..
* నేటి నుండి జరుగునున్న అభ్యర్థుల ఎంపిక * మధ్య దళారులను నమ్మద్దు

వరంగల్, మే 21: వరంగల్ నగరంలో నిర్వహించే ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈనెల 22 నుండి 31 వరకు ఈఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుంది. మంగళవారం నుండి హన్మకొండలోని జెఎన్‌ఎస్ స్టేడియంలో జరిగే ఆర్మీరిక్రూట్ మెంటు ఏర్పాట్లను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. రిక్రూట్‌మెంట్ సందర్భంగా అధికారులు తీసుకోవల్సిన తగు సూచనలు జారీ చేశారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని వరంగల్ కేంద్రం లో నిర్వహించేందుకు హైదరాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారులు గత నెల 5వ తేది నుండి ఈ నెల 5వ తేది వరకు ఆన్‌లైన్ ద్వారా అభ్యర్ధుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని అన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ నెల 22 నుండి 30వ తేది వరకు ప్రతి రోజు సుమారు నాలుగువేల మంది అభ్యర్ధులను ఎంపిక నిమిత్తం పిలవడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువత మధ్యవర్తులను ఆశ్రయించడం కాని, డబ్బులు పెడితే ఉద్యోగం వస్తుందని మభ్యపెట్టే వారిని నమ్మవద్దని, కేవలం అర్హత, ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపితే కలెక్టర్ కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీ సందర్భంగా కావల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట పోలీస్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ కమీషనర్ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రవౌళి ఆశయ సాధనకు పాటుపడాలి
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
నర్సంపేట, మే 21: అమరజీవి పంజాల చంద్రవౌళి ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలంతా పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని మాధన్నపేట్ రోడ్ సీపీఐ కాలనీ వద్ద పంజాల చంద్రవౌళి స్మారక స్థూపాన్ని చాడ వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మేరు భవన్‌లో జరిగిన సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేద గీత పనివారి కుటుంబంలో జన్మించిన పంజాల చంద్రవౌళి ఎర్రజెండా పార్టీ సీపీఐలో చేరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతం కృషి చేశారని కొనియాడా రు. హమాలీ, రిక్షా, పండ్ల తదితర యూనియన్స్ స్థాపించి వారి హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్వహించారని చెప్పారు. సీపీఐ మండల కార్యదర్శిగా ఇండ్ల స్థలాల కోసం, పక్కా గృహాల నిర్మాణం కోసం, సమానత్వం సాధించేందుకు అలుపెరగని పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. నేటి పాలకులు ఎన్నికల ముందు వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు అయినా ఏ ఒక్క హమీని అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధరల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఎన్నికల జిమ్మిక్కుగా రైతు బంధు పథకం ప్రారంభించారని అన్నారు. పోడు సాగుదారులకు, కౌలు రైతులను గుర్తించకుండా వందలాది ఎకరాలున్న భూస్వాములకు వందల కోట్ల రూపాయలు పంచుతున్నారని మండిపడ్డారు. ప్రజాసమస్యలు పరిష్కరించని పాలకులకు త్వరలోనే ప్రజలచేత గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. ఈసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు, నగర కార్యదర్శి బాషుమియా, నాయకులు బండారి చిరంజీవి, అక్కపల్లి రమేష్, ఇల్లందుల సాంబయ్య, సుంకరనేని బాలనర్సయ్య, ఎలమకంటి శ్రీనివాస్, గుంపెల్లి మునీశ్వర్, ఆరెల్లి రవి, గాజ యాకయ్య, చెన్నకేశవులు, శంకరయ్య, దుప్పటి సాంబ య్య, ఇల్లందుల రాములు, గట్టు యాకయ్య, వీరునాయక్, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.