వరంగల్

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు సాధిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు టౌన్, ఫిబ్రవరి 15: అధికార పార్టీ ఎమ్మెల్యేను కానప్పటికీ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకోసం ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు సాధిస్తానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం ములుగులోని క్యాంపు కార్యాలయంలో ఐబీ, పీఆర్, ఆర్ అండ్‌బీ శాఖల అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో వివిధ కారణాలతో నిలిచిపోయిన పనులను సత్వరమే ప్రారంభించాలని, ఏదైనా ప్రధాన సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రవాణా వ్యవస్తను మెరుగుపర్చాలని, ఏజెన్సీ మండలాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అభ్యంతరం చెబుతుందన్నారు. ఈ ప్రభావంతో మారుమూల గ్రామాలకు అంబులెన్స్ కూడా వెళ్లకపోవడంతో రోడ్డు పక్కన ప్రసవాలు, రోగులను కావళ్లలో ఆస్పత్రులకు మోసుకుపోయే దుస్థితి ఇంకా ఇక్కడ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా శాఖల అభ్యంతరాలు లేనిచోట నిలిచిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. నియోజకవర్గ పరిదిలోని కొత్తగూడ, గంగారం మండలాలకు ములుగు మీదుగా 15 కిలో మీటర్ల ప్రయాణంతో చేరుకునే వీలున్నదని, ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. రోజూ ఏదో ఒక మండలంలో తాను పర్యటిస్తానని, ఎక్కడ సమస్య ఉన్నా సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకవస్తానని తెలిపారు. ఇదే క్రమంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం కావాలని, ఎవరికో భయపడుతూ ప్రజా సమస్యలను పక్కకుపెడితే మాత్రం ఊరుకునేదిలేదన్నారు. త్వరలో ములుగు జిల్లా కాబోతుందని, ఆ స్థాయిలో అభివృద్ధి జరిగేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఏ ఏ గ్రామాలకు రోడ్డు అవసరమో జాబితా ఇస్తానని తెలిపారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా లక్షలు ఖర్చు చేసిన చెరువుల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, కాంట్రాక్టర్లు, వత్తాసు పలికిన అధికారులే బాగుపడ్డారని అన్నారు. అయితే ఏజెన్సీ మండలాల్లో చెరువుల కంటే వాగులపై చెక్‌డ్యాం నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో గోదావరి తీరాన కరకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించినా నిధులు మంజూరుకాకపోవడంపై చర్చించారు. వారం పది రోజుల్లో ఆయా శాఖల ప్రతిపాదనలు సమర్పిస్తే నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిస్తానని సీతక్క తెలిపారు. ఈ సమావేశంలో పీ ఆర్ ఈ ఈ రాంబాబు, డీ ఈ చంద్రునాయక్, ఆర్.రవీందర్, జంగాలపల్లి సర్పంచ్ మస్రగాని అనితారాణి, ఎంపీటీసీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరాలి
* అర్హులందరికి లబ్ధిచేకూరాలి
* మహబూబాబాద్‌జిల్లా కలెక్టర్ శివలింగయ్య

మహబూబాబాద్,్ఫబ్రవరి 15: జిల్లాలోని అర్హులైన ప్రతిరైతుకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన ఉపయోగపడేలా తగు చర్యలు తీసుకోవాలని, ప్రతిరైతుకు ప్రయోజనం చేకూరాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య అన్నారు. మానుకోట కలెక్టర్‌సమావేశ మందిరంలో శుక్రవారం ఫసల్‌భీమా యోజన పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ.. ఫసల్‌బీమా యోజన గురించి రైతులకు అవగాహన కల్పించి ప్రతిరైతు బీమా చేయించేలా ప్రొత్సహించాలని తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల రికార్డులు సమిష్టిగా కృషిచేయాలని ఏయే పంట ఎప్పుడేప్పుడే ఏవిధంగా ఫసల్‌బీమాకు అర్హత పొందుతుందో కరపత్రాల ద్వారా వివరించాలన్నారు. పంటనష్టం జరిగిన 72గంటల్లోపు టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫొన్‌చేసి నష్టంగురించి పిర్యాదు నమోదు చేయించేలా రైతులకు అవగాహన కల్పించాలే చూడాలన్నారు. ప్రకృత్రి వైపరిత్యాల కారణంగా పంటనష్టం జరిగితే రైతులను ఆర్దికంగా ఆదుకోవడానిక కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి పథకం అని అన్నారు. పంట దిగుబడి విత్తన దశ నుండి పంటకోత వరకు విత్తనాలు వేయలేకపోవుట, నాట్లు వేయలేకపోవుట వంటి విపత్తులకు కుడా నష్టపరిహారం అందుతుందని కలెక్టర్ అన్నారు. ఈ పథకాన్ని రైతులకు తెలియజేప్పడం ద్వారా అధిక ప్రయోజనం చేకూర్చవచ్చని ఆదిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపివో కొంరయ్య, మానుకోట, తొర్రూరు ఆర్డివోలు కొంరయ్య, ఈశ్వరయ్య, డి ఎస్‌హెచ్‌వో సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

-------------------------
దేశ భద్రతకు ప్రమాదకరమైన సంస్థల పట్ల జాగ్రత్త
* ప్రజలు కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి
* అమర సైనికుల త్యాగాలు మరువలేనివి
* అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్

వడ్డేపల్లి, ఫిబ్రవరి 15: అంతర్గతంగా దేశ భద్రతకు ప్రమారకరంగా ఉన్న వ్యక్తులు, సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దేశ రక్షణకు అటుపోటులను ధైర్యంగా ఎదుర్కొంటూ సరిహద్దులను కాపాడుతున్న సైనికుల త్యాగాలు అమూల్యమైనవని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎదుట జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు దాడిలో అమరులైన 44మంది వీరజవానుల స్మృత్యర్థం రెండు నిమిషాల పాటు అధికారులతో కలిసి వౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ప్రజలు అందరూ కలిసి కట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎల్‌బి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్ రావు వీర జవానుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఎన్‌సిసి క్యాడెట్స్‌తో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత ప్రజలను కంటికి రెప్పలా కాపాడే 44 మంది జవాన్ల మరణం జాతికి తీరని లోటు అని అన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ భారత వీన జవాన్లను ముందునుండి ఎదుర్కొనే ధైర్యం లేక దొంగ చాటున దాడి చేశారని, భారత రక్షణ దళాల శక్తిముందు ఉగ్రవాద సంస్థలు ఎప్పటికీ విజయం సాధించలేవని తెలిపారు. అనంతరం ఎన్‌సిసి విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుండి ములుగు రోడ్డు కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సిసి ఆఫీసర్ డాక్టర్ సదానందం, ఆర్మీఅధికారి నామ్‌దేవ్ జాదవ్, అద్యాపకులు రవీందర్, రత్నాకర్, మధూకర్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు. భాజపా అర్బన్ జిల్లా అధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో వీరజవానులపై జరిగిన దాడికి నిరసనగా పాకిస్థాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ మాట్లాడుతూ అమరులైన జవానుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, పాకిస్థాన్, పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. 130 కోట్ల భారత ప్రజలు తలుచుకుంటే ప్రపంచంలోని సగం తీవ్రవాద దేశాలు కనుమరుగు అవుతాయని హెచ్చరించారు. వీరజవానులు త్యాగం వృధాకాదని, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొన్నారు.

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కోసం
భవనాల పరిశీలన
పరిశీంచిన కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డి
మహబూబాబాద్, ఫిబ్రవరి 15: త్వరలో జరుగనున్న సాధారణ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కోసం అనువైన భవనాలను కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. మహబూబాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ భవనాలను వీరు పరిశీలించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ బాలికల రెసిడెన్షియల్ భవనాలను, వ్యవసాయమార్కెట్‌యార్డును, గిరిజన భవనాన్ని, ప్రభుత్వ గిరిజన రెసిడెన్షియల్ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ.. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించిన ఎన్నికల కౌంటింగ్ మహబూబాబాద్‌లోనే జరుగుతున్నందున కౌంటింగ్‌కు సరిపడా అనువుగా ఉన్న భవనాల సాధ్యాసాద్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తుది పరిశీలన అనంతరం ఎంపిక చేసిన కౌంటింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల కమీషన్‌కు పంపుతామని కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. కలెక్టర్ వెంట ఎస్పీ కోటిరెడ్డితోపాటు, ఆర్డివో కొంరయ్య, డీఆర్‌డివో సూర్యనారాయణ, డీఎస్పీ నరేష్‌కుమార్, ఎన్నికల తహశీల్దారు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం
భూపాలపల్లి, ఫిబ్రవరి 15: సింగరేణీయుల సంక్షేమంలో భాగంగా శుక్రవారం 8 ఇంక్లైన్ 1000 క్వార్టర్స్‌లో ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బందితో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించగా అధికార ప్రతినిధి, డీజీఎం డాక్టర్ ఎం.రాజేంద్రకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రకుమార్ మాట్లాడుతూ మన ఏరియా జనరల్ మేనేజర్ కె.గురువయ్య సింగరేణి ఉద్యోగులకే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేస్తే వారికి ఎటువంటి జబ్బులు ఉన్నాయో వారికి అవగాహన కల్పించి వైద్యం నిర్వహిస్తే ఆరోగ్యం కాపాడిన వాళ్లమవుతామని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ సదావకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని కోరారు. ఈ శిబిరం వారం రోజుల పాటు కొనసాగుతుందని, ఎండీ క్వార్టర్స్ సుభాష్‌కాలనీ, టీ 2 కృష్ణకాలనీ, ఫైలట్ కాలనీలో కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం శివారావు, డాక్టర్ ప్రవణ్‌సింగ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు కొక్కుల తిరుపతి, కేఎల్‌పీ వెల్ఫేర్ ఆఫీసర్ సాదన్ తదితరులు పాల్గొన్నారు.