రాష్ట్ర వార్తలు

ఐఏఎస్‌ల భేటీ ఆంతర్యమేమి?

  • 05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఐఎఎస్‌లు ముఖ్యమంత్రితో జరిపిన భేటీలో ఏం జరిగిందో బహిరంగ పరచాలని టిడిపి డిమాండ్ చేసింది. శనివారం టిడిఎల్‌పి కార్యాలయంలో మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఎమ్మార్‌తో పాటు పలు కుంభకోణాల్లో వరుసగా ఐఎఎస్ అధికారులను సిబిఐ విచారిస్తుండడంతో సంఘం తరఫున ఐఎఎస్‌లు ముఖ్యమంత్రితో జరిపిన సమావేశంలో ఏం చర్చించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కిరణ్‌కుమార్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారం కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టే ఆయన్ని కలిశారని అన్నారు. తమపై మంత్రులు, కొందరు నాయకులు ఒత్తిడి తీసుకువచ్చి నిర్ణయాలు తీసుకునేట్టు చేశారని ఐఎఎస్‌లు చెప్పినట్టు తెలుస్తోందని అన్నారు. ఏ విషయంలో ఎవరు ఒత్తిడి తీసుకు వచ్చారో ఐఎఎస్‌లు స్పష్టం చేయాలని ఈ మొత్తం వ్యవహారంపై శే్వతపత్రం విడుదల చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. ఇది వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరుగా చిత్రీకరించి, వ్యవహారాన్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నించవద్దని టిడిపి నాయకులు ఐఎఎస్‌లకు సూచించారు. మంత్రులు ఒత్తిడి తీసుకు వస్తే తప్పు చేశామంటున్న వారు, ఎవరు ఒత్తిడి తీసుకు వచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి తాము ఏం చెప్పారో ఐఎఎస్‌లు కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ మినహా మొత్తం మంత్రివర్గం, అధికారులు అంతా అప్పటి వారే ఉన్నారని, ఎవరేం చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. సిబిఐ తన విచారణను రాజకీయాలకు అతీతంగా సాగించాలని కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున, వారికి ఇబ్బంది కలగకుండా విచారణ సాగించాలనే ధోరణి సిబిఐకి తగదని అన్నారు. రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది లేదని, చివరకు ఐఎఎస్‌లు సైతం భయాందోళనలతో ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధిస్తారా? ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? ఏం చేస్తారో వెల్లడించాలని కోరారు. రాజకీయ నాయకత్వం, ఐఎఎస్‌ల మధ్య పోరు, లేదా ఐఎఎస్‌లు, ఐపిఎస్‌ల మధ్య పోరుగా మార్చి నిందితులను రక్షించే ప్రయత్నం చేయవద్దని అధికారులకు టిడిపి నాయకులు సూచించారు. ఒత్తిడి తీసుకు వస్తే తప్పు చేశామని చెప్పి అధికారులు తప్పించుకోలేరని అన్నారు.
మంత్రులు, అధికారులు ఎవరి పరిధిలు వారికి ఉంటాయని, ఒత్తిడి తెచ్చారని, పరిధి దాటి పని చేయడాన్ని సమర్థించుకోలేరని టిడిపి నాయకులు తెలిపారు. వాస్తవంగా ఏం జరిగిందో అధికారులు ప్రజలకు చెప్పాలని టిడిపి నాయకులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading