విండో

మళ్లీ అవుట్ సోర్సింగ్‌పై చర్చ --- విండో

  • -వి.ఆర్.సి.మూర్తి
  • 03/02/2012

అమెరికా అధ్యక్షుడు ఒబామా తాజాగా అవుట్‌సోర్సింగ్ పేర ఉద్యోగాలు తరలించే కంపెనీలకు తాయిలాలు ఉండవని ప్రకటించడంతో కొన్ని ఐటి కంపెనీలలో, మానవనరులలో గుబులు ఏర్పడగా, మరికొన్ని కంపెనీల ప్రతినిధులు విమర్శనాస్త్రాలను సంధించారు. ఇలా విమర్శనాస్త్రాలను సంధించినవారిలో అజీం ప్రేంజీ, వినీత్ నాయర్ తదితరులు ఉన్నారు. విదేశాలలో భరత దేశానికి చెందిన ఐటి కంపెనీలు నెలకొల్పడంవల్ల ఆయా దేశాలకు కలుగుతున్న లాభాలను వెల్లడించారు. ఎన్ని మార్గాలను అనుసరించినా నిపుణుల అవసరం తప్పనిసరి, ఇందుకోసం మానవరులు కావాల్సిందే అన్నది వాస్తవం అని సిలికాన్ వ్యాలీలో నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అవసరం ఎలాఉంటుందో చెప్పనక్కర లేదు ప్రత్యక్షంగా చూస్తున్నాం అంటూ ఇటీవల అమెరికా ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఐటి సెక్యూరిటీ నిపుణుల నియామకం అంటూ ఇంటర్‌నెట్ ఐటి బ్లాగ్‌లో పోస్టింగ్‌లు కనిపించాయి.
అవుట్‌సోర్సింగ్‌కు కళ్ళెం వేసి అమెరికాలో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తానంటూ గత వారం అమెరికా అధ్యక్షుడు ఒబామా మళ్లీ ప్రకటన చేశాడు. అమెరికా ఆంక్షల నేపధ్యంలో ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ పైన భారత్ ఐటి సంస్థలు తమ పనులు వెళ్లదీస్తున్నాయి. ఇప్పటికే వివిధ వీసాల జారీలో ఏమాత్రం అనుమానం వచ్చినా తొక్కిపెట్టే ధోరణి అవలభిస్తున్న అమెరికా భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశంలేకపోలేదనకు ఒబామా తాజా ప్రకటనతో బలం ఏర్పడింది. ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా అమెరికాలో వివిధ కంపెనీలలో పనులు సవ్యంగా జరగాలంటే భారత్, చైనా దేశాల తోడ్పాటు తప్పనిసరి అయింది. మానవ వనరుల అవసరాన్ని గుర్తించిన కొన్ని కంపెనీలు ఉద్యోగాల కల్పనతోపాటు పౌరసత్వం ఇప్పించే బాధ్యతనుకూడా భుజాలపై వేసుకుని ముందుకు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తాత్కాలిక ఉద్యోగులకు జారీ చేస్తున్న హెచ్1 బి వీసాలపై మోజు తగ్గింది.
భారత ఐటి కంపెనీల ప్రతినిధులు ఈ సారి వౌనంగా ఉండకుండా ఒబామా ప్రకటనకు సరైన జవాబు చెప్పారు. అవుట్‌సోర్సింగ్‌పేర అమెరికా నుంచి ఉద్యోగాలు తీసుకుపోవడంలేదని, స్థానికంగా కంపెనీ కార్యాయాలను నిర్వహిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు బదులిచ్చారు. అమెరికాలలో ఎన్నికలు సందర్భంగా వస్తున్న కఅనవసర హడావుడి ఇది.. అని అజీం ప్రేంజీ అన్నారు. ఒక్క హెచ్‌సిఎల్ కంపెనీ అమెరికా, ఐరోపాలో సుమారు పదివేల చిలుకు ఉద్యోగాలు కల్పించామని ప్రకటిస్తే విప్రో, మహేంద్రా సత్యం తదితర కంపెనీలు పాశ్చాత్య దేశాల్లో కొత్త ఉద్యోగాలు ఎన్ని సృష్టిస్తున్నాయో లెక్కలు వేయాల్సిన అవసరాన్ని ఐటి కంపెనీల ప్రతినిధులు గుర్తు చేశారు.
ట్విట్టర్‌లో మన్మోహన్ సింగ్
ప్రజలకు సందేశాలు నేరుగా చేరాలన్నా, యువతరానికి చేరువ కావాలన్నా మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్‌లో ప్రధాన మంత్రి కార్యాలయం ప్రారంభించడం తప్పనిసరి అయింది. ప్రధాని కార్యాలయం చేపట్టే కార్యాక్రమాలను ప్రజలకు నేరుగా తెలియ జెప్పడానికి ఈ ఏర్పాట్లు చేశారు. దీనిని ప్రధాని మీడియా బృందం పర్యవేక్షిస్తుంది. ప్రజల సందేహాలు, విన్నపాలను ఈ బృందం ప్రధాని ముందుంచి వెంటనే జవాబులు ట్విట్టర్‌లలో పోస్టింగ్ చేస్తుంది. ట్విట్టర్ ఎట్‌దరేట్ పిఎంఓ ఇండియా పేరుతో (Twitter @PMOIndia Thank you for your support) ఎప్పటికప్పుడు ప్రధాని కార్యాలయ సమాచారం ప్రజలకు పోస్ట్ అవుతుంది. గణతంత్ర దినానికి రెండు రోజుల ముందు ఇది ప్రారంభం కావడం వల్ల తొలి ట్వీట్‌గా సాహస బాలుర కార్యక్రమాన్ని చేర్చారు. ప్రారంభించిన మొదటిరోజు సాయంత్రానికే 12,505 మంది అనుచరులుగా చేరడానికి ట్విటర్ పుష్పాలను పోస్ట్ చేశారు.
ఆన్‌లైన్ సర్వే పేరుతో అక్రమాలు
ఆన్‌లైన్ సర్వే పేరుతో ఇంటర్‌నెట్ వినియోగదారులకు సంబంధించి విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆరోపణలు దేశంలోని వివిధ ప్రాంతాలలో జనవరిలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. తాజాగా వినియోగదారునికి తెలిసిన మ్యాగజైన్ చిరునామా ఆధారంగా, తరచూ ఆన్‌లైన్‌లో ఖరీదు చేస్తున్న వివరాల ఆధారంగా ఇ-మెయిల్ చిరునామాకు మెయిల్ వస్తుంది. మెయిల్‌లోని లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే అత్యుత్తమమైన ఇంటర్‌నెట్ వినియోగదారుల ఎంపిక చేస్తున్నాం, సెక్యూరిటీ ఇబ్బందులకు తావులేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కనుక సందేహంచనక్కరలేదు... అంటూ వౌస్ క్లిక్ చేసిన వెంటనే ఒక్కో పేజీ ఓపెన్ అవుతుంది. మొదటి పేజీలో పేరు చిరునామాతో ప్రారంభమై రెండవ పేజీలో మొబైల్ ఫోన్‌నెంబర్, బ్యాంకు, క్రెడిట్ కార్డు నెంబర్ ఇత్యాది వివరాలన్నీ ఒకటి తరువాత మరోటి ప్రారంభమవుతాయ. ఇలా ఒక పేజీలో సమాచారం టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా సేవ్ అవుతూ మరో పేజీ ఓపెన్ అవుతుంది. వెంటనే సమాచారం నమోదు చేయకుండా కొందరు వినియోగదారులు మూసివేసే అవకాశం లేకుండా కొన్ని ఉచిత సౌకర్యాలు ప్రత్యేకంగా మీకు ఇదిగో.. అంటూ మరికొన్ని సూచనలు కనిపిస్తుంటాయి. వీటిని మీరు అందుకోవాలంటే మరిన్ని వివరాలు విధిగా నమోదు చేయాల్సి వస్తుంది. ఇలా చివరకు బ్యాంకు ఎకౌంట్‌లు, క్రెడిట్‌కార్డుల వివరాలు, పుట్టిన తేదీ వివరాలు.. ఇవన్నీ తప్పనిసరిగా నమోదు చేయాల్సి వస్తుంది. ఇలా నమోదు చేసిన తరువాత ఎప్పుడో ఒకప్పుడు బ్యాంకు, లేదా క్రెడిట్ కార్డు ఎకౌంట్‌లోని నగదు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు మన దేశంలో ప్రారంభమయ్యాయి. ఇలా సర్వేరూపంలో సేకరించిన డాటా మొత్తం హాకర్ల చేతికి వెళుతోందన్న అనుమానం బలపడుతోంది. ఒక ప్రముఖ పత్రిక పేరుతో ఆన్‌లైన్ సర్వేపై అనుకోని అనుమానం తలెత్తడంతో వివరాలకు వినియోగదారులు నేరుగా సదరు కార్యాలయాన్ని సంప్రదించడంతో వాస్తవాలు బయటపడ్డాయి. వెంటనే హెచ్చరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో సైబర్ పోలీసులు వ్యక్తిగత వివరాలు ఇంటర్‌నెట్‌లో ఇవ్వవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading