సబ్ ఫీచర్

స్ర్తీ లంటే ఇంకా చిన్నచూపేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో వేదకాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అందుకే మన పెద్దలు ‘‘స్ర్తిలు ఎక్కడ పూజించబడతారో- అక్కడ దేవతలు ఉంటారు’’ అని చెప్పారు. అనంతరం మారిన పరిస్థితులలో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం ఏర్పడింది. మధ్యయుగం నాటికి మహిళలను వంటింటి కుందేళ్ళుగా, కేవలం సంతానాభివృద్ధికి, తమకు శారీరక సుఖాల్ని అందచేసే ఆటబొమ్మలుగా మార్చివేశారు. మహిళలపై అడుగడుగునా ఆంక్షలు విధించారు. మహిళలనుంచి ఎటువంటి తిరుగుబాటు రాకుండా ‘పతివ్రత’అనే భూషణం (కిరీటం)ను వారి నెత్తినపెట్టారు. నిరక్షరాస్యత కారణంగా మహిళలు పతివ్రత అనేది తమకు ఒక భూషణంగా భావించారే తప్ప, ఆ పేరుతో తమ హక్కుల్ని కాలరాసి, తమను కట్టుకబానిసలుగా మార్చుతున్నారనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. హిందూ మతానికి సంబంధించిన పురాణ ఇతిహాసాలలో పతివ్రతలుగా కీర్తించబడిన వారందరూ తమ జీవితంలో అష్టకష్టాలు పడినవారే. భర్త చాటున ఉంటూ, భర్త పెట్టే చిత్రహింసలను వౌనంగా భరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని మహిళలలో కలిగించడంలో సఫలీకృతులయ్యారు. మధ్యయుగంనాటికి దేశంలో మత ఛాందసవాదం బాగా పెరిగిపోయింది. దీంతో సమాజంలో పురుషాధిక్యత పెరిగింది. సతీసహగమనం, బహుభార్యత్వం వంటి అవలక్షణాలు రాజ్యమేలడం ప్రారంభించాయి. మహిళలకు విద్య అనేది పూర్తిగా అందుబాటులో లేకుండా పోయింది.
నిరక్షరాస్యత వలన మహిళలు పురుషుల చేతిలో కీలుబొమ్మలుగా మారారు. చివరకు మహాత్మాజ్యోతిరావుపూలే, రాజారామమోహన్‌రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి ఎందరో మహనీయుల అవిరళ కృషివలన మహిళలకు కొంచెం విద్యాగంధం అందుబాటులోకి వచ్చింది. మహిళలు విద్యావంతులవడం ప్రారంభంఅయిన తరువాత, సమాజంలో పరిస్థితులు కొంతవరకు మారాయి. గతంలో ‘ఉద్యోగం పురుష లక్షణం’ అని ఘనంగా చెప్పుకొనేవారు. దీనినిబట్టి సమాజంలో పురుషాధిక్యత ఎంత ఉందో ఇట్టే అవగతం అవుతుంది. విద్యావంతులు కావడం ద్వారా మహిళలు చైతన్యవంతులయ్యారు. ‘ఆకాశంలో సగం మేము- అవకాశాలలో సగంకావాలి’ అంటూ ఉద్యమించడం ప్రారంభించారు.
అన్నిరంగాలలో మహిళలు ఉన్నతస్థితికి ఎదుగుతున్నారు. ఈ తరుణంలో చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ‘పురుషుల ఉద్యోగాలకు మహిళల అడ్డంకి’ అనే భావనతో ఒక పాఠ్యాంశాన్ని పదవ తరగతి విద్యార్థులకు ఎంపికచేశారు. మహిళలు అన్నిరంగాలలోకి చొచ్చుకొని వస్తూ, అన్నిరకాల ఉద్యోగాలు చేయడంవలన, పురుషులలో నిరుద్యోగం పెరిగిందన్నది ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం. సమాజంలో ఉన్న లైంగిక వివక్షతకు వ్యతిరేకంగా మహిళలు ఒకవైపు ఉద్యమిస్తుంటే, మరోవైపు మహిళల వివక్ష చూపుతూ పాఠ్యాంశాలను రూపొందించడంపట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘పెరుగుతున్న నిరుద్యోగం’ శీర్షికన ఈ పాఠ్యాంశం ఉంది. ఈ పాఠ్యాంశంలో పురుషులలో నిరుద్యోగం పెరగడానికి మహిళలతోపాటు నెమ్మదించిన పారిశ్రామీకరణ, లోపభూయిష్టమైన విద్యావ్యవస్థ, జనాభా పెరుగుదల, నిరక్షరాస్యత, నైపుణ్యం కొరవడిన కార్మికులు తదితరాలను కారణాలుగా పేర్కొన్నారు. ఇటువంటి పాఠ్యాంశాల వలన విద్యార్థులలో చిరుప్రాయం నుంచే మహిళలంటే చిన్నచూపు ఏర్పడుతుంది. తమ ఉపాధిని లాక్కొంటున్నారని మహిళలపై వారికి ద్వేషం పెరుగుతుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారికతకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెబుతుంటే, మరోవైపు మహిళలను కించపరచే విధంగా పాఠ్యాంశాలు రూపొందించడంలోనే సమాజంలోని పురుషాధిక్యతకు నిదర్శనం.

- పి.మస్తాన్‌రావు