ఫోకస్

చట్ట సభల్లో నాణ్యమైన చర్చ జరగాలి. మన రాష్ట్ర అసెంబ్లీ అనే కాదు లోక్‌సభ, రాజ్యసభల్లో సైతం ఇటీవల కాలంలో రోజుల తరబడి వివాదాలే తప్ప చర్చలు సాగడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో చట్టసభలు జరుగుతున్న తీరు బాధ కలిగిస్తోంది. చట్ట సభల్లో ప్రమాణాలతో కూడిన చర్చలు జరగాలంటే సభ్యులందరి సహకారం అవసరం. అధికార పక్షం, ప్రతిపక్షంతో పాటు అన్ని పక్షాలు పరస్పరం చర్చించుకుని చట్టసభలను హుందాగా నిర్వహించుకోవడానికి ముందుకు రావాలి. చర్చల ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుంది. శాసన సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు కొత్తగా నిబంధనల అవసరమేమీ లేదు. ఇప్పటికే బోలెడు నిబంధనలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు కావలసింది సభ సజావుగా సాగాలి, ఆరోగ్యకరమైన చర్చ సాగాలి, ప్రజలకు మేలు జరగాలి అనే ఆలోచన మాత్రమే. ఒక అంశాన్ని హైలెట్ చేయడానికి ప్రతిపక్షం పట్టుపడుతుంది దీనిలో తప్పు లేదు. సమస్య ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అందరి దృష్టి ఆ సమస్యపై నిలపడానికి చట్టసభల్లో అలా చేయడంలో తప్పు లేదు. అదే సమయంలో అధికారపక్షం ఆ సమస్య ప్రాధాన్యతను గుర్తించి చర్చకు ముందుకు రావాలి. ఇది అధికారపక్షం, ప్రతిపక్షం పరస్పర సహకారంతో సాధ్యం అవుతుంది. అధికార పక్షం, ప్రతిపక్షం భీష్మించుకుని కూర్చున్నప్పుడు సభలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు. ఒక అంశంపై ఎక్కువ రోజులు సభలో ప్రతిష్టంభన ఏర్పడేట్టు చేయడం కూడా మంచిది కాదు. దానివల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమావేశాల ప్రసంగాల్లో సభ్యులు అన్ని అంశాలపై మాట్లాడవచ్చు కానీ దీనివల్ల ఒక అంశం ఫోకస్ కావాలని కోరుకున్నప్పుడు అది సాధ్యం కాదు. గవర్నర్ ప్రసంగంపైన, బడ్జెట్‌పైన జరిగే చర్చ ఏదో ఒక అంశానికి పరిమితం అయి ఉండదు కాబట్టి దానికి పెద్దగా ప్రాధాన్యత లభించదు. ఇప్పుడు రాష్ట్రంలో మద్యం సిండికేట్ సీరియస్ సమస్య. ఈ అంశాన్ని గవర్నర్ ప్రసంగంపై మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రస్తావించవచ్చు. కానీ దానికి పెద్దగా ప్రాధాన్యత లభించదు. అలా కాకుండా ప్రత్యేకంగా చర్చకు డిమాండ్ చేయడం సహజమే. తొలుత సభ్యులు క్వాలిటీ డిబేట్ కోసం ఆయా అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. చర్చకు అవకాశం ఉండాలి. కొంతకాలంగా ఎక్కువ రోజులు చట్టసభల్లో వివాదాలే తప్ప చర్చలు సాగడం లేదు. దీనివల్ల చట్టసభలపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి ఏర్పడుంది. అలా కాకుండా చర్చకు అవకాశం ఉండాలి. చర్చలో అధికారపక్షం, ప్రతిపక్షం సమర్థవంతంగా తమ వాదనలు వినిపించవచ్చు. ఎవరి వాదనల్లో వాస్తవం ఉందో ప్రజలు తేల్చుకుంటారు. మంచి చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి మంచిది, ప్రజలకు మేలు జరుగుతుంది. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా పని చేయాల్సింది ప్రజల కోసమే కదా? ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారం కోసం సభలో అర్థవంతమైన చర్చ జరపాలి. చర్చకు అవసరమైన వాతావరణం సభలో ఉండాలి. అన్ని పార్టీల సభ్యులు, అధికారపక్షం, ప్రతిపక్షం సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే చట్టసభల పట్ల ప్రజలకు చిన్నచూపు ఏర్పడుతుంది. చట్టసభల్లో చర్చ తమ కోసమే అనే భావన ప్రజల్లో ఏర్పడే విధంగా చర్చలు సాగాలి.
Add new comment