విపులాచ పృధ్వీ

ఇవాళా రేపూ, రోడ్ల కూడలిలో సిగ్నల్ దగ్గర కారాగినా, స్కూటర్ ఆగినా, బస్సాగినా చేయి చాచి దీనంగా చూసేవాళ్ళు, ‘ఎందుకివ్వవు’ అన్నట్టు చూసేవాళ్ళూ, అంగవైకల్యాన్ని దాచుకోకుండా చూపించుకుంటూ చేయి చాచేవాళ్ళు, చిన్నపిల్లలు, బాలింతలం అంటూ పసిపాపను చూపుతూ అడుక్కునేవాళ్ళు, నిండు నెలలు పురుటికి ఆసుపత్రికి పోవాలంటూ వాపోయేవారు.. ఇలా రకరకాల యాచకులను మనం చూస్తుంటాం. దీనికితోడు కుష్ఠువ్యాధిని జుగుప్సాకరంగా చూపుతూ ఆ చేతుల్ని మన ముఖాలలోకి పెట్టిమరీ బెరుకు కలిగిస్తూ వుంటారు. ఈ కుష్ఠువారిలో చాలామంది మాడిన అరటిపండు గుజ్జును ఉపయోగించి అలా మనని మభ్యపెడుతూ వుంటారట.
నేను ఢిల్లీవెళ్ళిన కొత్తలో సాయంత్రం ఆఫీసునుంచి వ్యాయామంగా వుంటుందని రెండున్నర కిలోమీటర్లు నడిచి వచ్చేదానిని. నన్ను చూడగానే ఎక్కడో దక్షిణాది నుంచి వచ్చిన ‘బకరా’ అనుకొని ఒక యాచకురాలు నిండు గర్భిణి నన్నలా పక్కకి చేయి పట్టుకు లాగి, ‘ఏ క్షణమైనా పురుడు రావొచ్చు. ఏం చేయను’ అని దీనంగా అడిగింది రాజస్తానీ హిందీలో. ‘‘అయ్యో వెంటనే వెళ్ళు ఆసుపత్రికి’’ అన్నాను. ఆ మాత్రం హిందీ నాకూ వచ్చు. ‘‘అది నాకూ తెలుసు. ఆసుపత్రికెలా వెళ్ళను. డబ్బులేకుండా’’ ఆటో ఖర్చుకు డబ్బివ్వమంది. ఈ తతంగం నా వెనకగా వస్తున్న ఒకాయన చూసి నా దగ్గరకు వచ్చి పదండి. ఇలాంటి గర్భిణులు ఇక్కడికి రాజస్తాన్ నుంచి దిగుమతి అవుతూ వుంటారు. ఇలా గుంభనంగా పక్కకి పిలిచి అడుగుతూ వుంటారు అని చెప్పాడు. ‘‘మీరు లేచిన వేళ బావుంది. మీ మెడలోని మంగళ సూత్రం తెంపుకు పోలేదు. మీ దక్షిణాది స్ర్తిల మెడల్లో మంగళసూత్రాలు, గొలుసులు వుంటాయని పక్కకి పిలిచి మరీ యాచక నాటకం ఆడుతారు’’ అని చెప్పుకొచ్చాడు.
ఘరానా యాచక బృందాలుంటాయి. ప్రతినెలా బడుతులులాంటి ముగ్గురు నలుగురు కలిసి వచ్చి సాయిబాబా పేరుతో బీదలకు అన్నదానం చేస్తున్నాం’’ అంటూ పదో పరకో పుచ్చుకోరు. కనీసం వందైనా ఇవ్వాలి. వాళ్ళు సరిగ్గా మగవాళ్ళు ఆఫీసులకు పోయిన తర్వాత అరగంటలో వచ్చి గృహిణులను వేధిస్తూ వుంటారు. ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఒక రసీదు పుస్తకం పట్టుకొని ‘‘మేం ప్రాథమిక పాఠశాలలో టీచర్లం. బీద పిల్లలకు అన్నదానం చేసి, పుస్తకాలు అవీ కొని ఇస్తూ వుంటాం,’’ అని ఎంతో నమ్రతగా అడుక్కుంటారు.
నా చిన్నతనంలో ఏలూరులో తెలవారుతూ వుండగా ఒకరి తర్వాత ఒకరు అడుక్కోవడానికి వచ్చి ఇంటి ముందు నిలబడేవారు. గుప్పెడు బియ్యం వేసి పంపాలి. ఇక సంక్రాంతి ముందయితే నూనె గుడ్డలువాళ్ళు, హరిదాసర్లు, గంగిరెద్దు మేళాలవారు తప్పనిసరి. కొందరు యాయవారపు బ్రాహ్మణులు తిథి వార నక్షత్రాలు ఏకరువు పెడుతూ, మడి బట్ట కట్టుకుని ఒక పెద్ద చెంబు ముందు పెడతారు. బియ్యం వేస్తే చెంబు, రొక్ఖం ఇస్తే చేయి ముందుకు చాస్తారు. ఇక రైళ్ళల్లో అయితే పాటలు పాడి అడుక్కొనేవారు ప్రయాణికుల వద్ద తృణమో, ఫణమో పుచ్చుకుంటారు. ఒకసారి ఒక ప్రయాణీకుడు ‘‘సిగ్గులేదా నీకు అడుక్కోవడానికి’’ అని విసుక్కుంటే ‘‘నాకెందుకు బాబూ సిగ్గు. మమ్మల్ని బీదరికంలోకి నెట్టిన మీకుండాలి సిగ్గు’’ అని లా పాయింటు లాగాడట.
ఇంతకీ ‘‘ఎందుకమ్మా ఈ యాచక వృత్తిపై ఊదరకొడుతున్నావ్’’ అంటారేమో. ఎందుకంటే ఈమధ్య ఒక యాచకుడు లక్షాధికారి అని బయటపడిందట. తంజావూరులోని అడ్రుపాలయంలోని మసీదు దగ్గర ఒక భక్తుడి సెల్ పోయిందట. అక్కడ బిక్షాటన చేసుకునే అబ్దుల్ సమద్ దంపతుల వద్దవున్న సంచిని తెరిచి చూడమంటే ‘ససేమిరా’ అన్నారట. దాంతో అక్కడ చేరిన నలుగురూ ఆ సంచిని లాక్కుని తెరిచి చూస్తే ధనలక్ష్మి కట్టలుకట్టలుగా పడి వుందట. వెంటనే పోలీసులకు ఆ విషయం అందజేస్తే తేలిన విషయమేమిటి అంటే ఆశ్చర్యపోక తప్పదు. డబ్బు లెక్కచూస్తే 6,26,930 రూపాయలట. వారు 2003 వరకు తొంబరంలోని బ్యాంక్‌లో డబ్బు దాచుకుని ఒక ఇంటిని ‘మన్నారుకుడి’లో కొనుక్కున్నారట. ఇప్పుడు దాచుకున్న డబ్బుతో తంజావూరులో మరో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారట. పోలీసులు ఆ డబ్బును నొక్కేయకుండా నిజాయితీగా ఆ డబ్బు ఆ దంపతులకు తిరిగి ఇచ్చేసి ‘‘బ్యాంక్‌లో పెట్టుకోండి. ఇలా సంచిలో కాదు’’అని సలహా ఇచ్చారట.
మైసూరులో ఒక బాలిక యాచక వృత్తి చేస్తూనే చదువుకుని మంచి మార్కులతో పదవ తరగతి పాసయింది. ఆ సంగతి తెలిసి అప్పటి (ఇప్పటి) తమిళనాడు ముఖ్యమంత్రి ఆ అమ్మాయి ‘చదువుకు డబ్బు నేనిస్తాను. ఇక భిక్షాటన మానేయ’మన్నారట. ఆ పిల్ల తల్లి ‘‘అది మా వృత్తి. కనీసం వారానికొకరోజయినా భిక్షాటనకు వెళ్ళాలి’’ అందట. నాకు మరొక సంఘటన గుర్తుకొస్తోంది. కర్ణాటకలోని శాసన మండలికి నామినేటెడ్ సభ్యుల ఎంపిక రోజులవి. ఒక చిన్నపాటి పారిశ్రామికవేత్త వచ్చి ‘‘అమ్మా! మీరు మా యాచక వృత్తిని కూడా గుర్తించి, మాలో ఒకరిని మండలి సభ్యుడిగా నామినేట్ చేయండి’’ అన్నాడు. ‘‘యాచకవృత్తా?’’ అన్నాను ఆశ్చర్యంగా. ‘‘అవునమ్మా! నాకు చిన్నపాటి పరిశ్రమ వున్నా, ఇప్పటికీ మా కుల వృత్తి వారానికొకరోజయినా చేయాలి’’ అన్నాడు. ప్రభుత్వం పంపించిన పేర్లనే ఎంపిక చేయాలి’ అని ఎంత చెప్పినా వినకుండా ‘మీకూ మా యాచక వృత్తిమీద గౌరవం లేదు’ అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయాడు.
Add new comment