రాష్ట్రీయం

తెరాస ఖాతాలోకి మరో ఎమ్మెల్సీ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్థానిక సంస్థల కోటా ఎన్నిక ఏకపక్షమే?
నిజామాబాద్, నవంబర్ 28: నిజామాబాద్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో తెరాసకు చెందిన ప్రజాప్రతినిధులే ఉండగా, ప్రస్తుతం అధికార పార్టీ ఖాతాలోకి మరో స్థానం వచ్చి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటా కింద ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం డిసెంబర్ నెలాఖరు నాటికి భర్తీ కానుండగా, ఈ స్థానాన్ని తెరాస దక్కించుకోవడం లాంఛనప్రాయంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు కలిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలాబలాలను బేరీజు వేసుకుంటే, తెరాస వైపే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది.
అధికార పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి సునాయాసంగానే పెద్దల సభలో అడుగిడడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం 766మంది ఓటర్లకు గాను తెరాస తరఫున స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న వారి సంఖ్య 520పైచిలుకుగా ఉంది. దీనిని బట్టి చూస్తే తెరాస అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే తెరాస ఖాతాలో మరో ఎమ్మెల్సీ స్థానం పెరుగనుంది. ఇప్పటికే ఈ జిల్లా నుండి మరెక్కడా లేని విధంగా చట్ట సభల్లో కొనసాగుతున్న అధికార పార్టీ సభ్యుల సంఖ్య గణనీయంగా ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంటు సెగ్మెంట్లలోనూ తెరాస అభ్యర్థులే గెలుపొందారు. ప్రతిపక్షాలకు ఒక్కటంటే ఒక్క స్థానమైనా దక్కలేకపోయింది. జడ్పీ సమావేశాలు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్‌తో సహా ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ ప్రతిపక్షాల ప్రాతినిథ్యం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా వలసల పర్వంతో తెరాస మరింతగా బలపడింది. ప్రతిపక్ష పార్టీల తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పలువురు కీలక నేతలు కూడా పరిస్థితులను అంచనా వేసి తమ రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునేందుకు గులాబీ గూడుకు చేరడంతో ప్రతిపక్షాల బలం మరింతగా కుదించుకుపోయింది.
కాంగ్రెస్ తరఫున గవర్నర్ కోటాలో వరుసగా రెండవ సారి ఎమ్మెల్సీగా ఎన్నికై జుక్కల్ నియోజకవర్గానికి పెద్దదిక్కుగా నిలుస్తూ వచ్చిన డి.రాజేశ్వర్‌రావు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అభ్యర్థిత్వం కేటాయించలేదన్న కోపంతో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆయన బాటలోనే మరో ఎమ్మెల్సీ విజి.గౌడ్ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన విజి.గౌడ్‌కు ఆ పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కొన్నాళ్లకే ఆయన పార్టీ ఫిరాయించి అధికార పక్షానికి చేరువయ్యారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తరఫున ఇద్దరు సభ్యులు షబ్బీర్‌అలీ, ఆకుల లలిత మాత్రమే ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ చట్టసభలో కొనసాగుతున్నారు. తెదేపా తరఫున స్థానిక సంస్థల కోటాలో ఎన్నికై ఎమ్మెల్సీగా కొనసాగిన అర్కల నర్సారెడ్డి పదవీ కాలం గత ఆరు మాసాల క్రితమే పూర్తవడంతో, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థానానికే ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలోనూ బలాబలాలను బేరీజు వేసుకుంటే తెరాసకే స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తున్నందున ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం దాదాపుగా ఖాయమని స్పష్టమవుతోంది. ఇదే జరిగితే తెరాస ఖాతాలో మరో ఎమ్మెల్సీ చేరి, ఆ పార్టీ బలం మరింతగా పెరగనుంది. జిల్లాలో ఏకపక్షంగా మారిన సమీకరణలతో ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నిక విషయమై ప్రతిపక్షాల్లో నిస్తేజం ఆవరించి ఉండగా, అధికార పార్టీలో ఎనలేని ఉత్సాహం కనిపిస్తోంది. విజయం దాదాపుగా ఖాయమని స్పష్టమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు తెరాసకు చెందిన ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.