యువ

రన్ శ్రీను రన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుగుల వీరుడు మిల్ఖాసింగ్ గురించి అందరికీ తెలుసు. కామన్‌వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్ విభాగంలో పతకం తెచ్చి, భారత కీర్తిప్రతిష్ఠలను సమున్నతంగా నిలిపిన ఈ ఫ్లయింగ్ సిఖ్, ఆసియా క్రీడల్లోనూ పలు దఫాలు సత్తా చాటాడు. ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. విచిత్రమేమంటే...పరుగనే పదానికి అతనికి అర్థం తెలిసింది సైన్యంలో చేరాకే. చదువుకునే రోజుల్లో మిల్ఖాసింగ్ ఏనాడూ పరుగుల పందెంలో పాల్గొన్న పాపాన పోలేదు.
కట్ చేస్తే...
ఇప్పుడు భారత సైన్యంలో మరో మిల్కాసింగ్ తయారవుతున్నాడు. అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటేందుకు సమాయత్తమవుతున్నాడు. పేరు బుగత శ్రీను. అతనికీ, మిల్ఖాసింగ్‌కీ ఎన్నో సారూప్యాలు ఉండటం విశేషం. డిగ్రీ చదివిన శ్రీను అప్పటివరకూ ఎప్పుడూ పరుగు పందేల్లో పాల్గొనలేదు. అతనూ సైన్యంలో చేరాకే పరుగెత్తడం మొదలుపెట్టాడు. మిల్కా లాగానే అతనూ ఓ కుగ్రామంనుంచే వచ్చాడు. ఇప్పటికే ఎన్నో దేశవాళీ పోటీల్లో పతకాలు కొల్లగొట్టిన శ్రీను...2024 ఒలింపిక్సే లక్ష్యంగా తన ప్రతిభా పాటవాలకు సానబెట్టుకుంటున్నాడు.
విజయనగరం జిల్లాలోని బంగరామపేటకు చెందిన బుగత శ్రీను తండ్రి ఓ రైతు. కొడుకుని కష్టపడి చదివించాడు. చిన్నప్పుడు శ్రీను ఐదారు కిలోమీటర్లు నడిచి వెళ్లి, స్కూల్లో చదువుకునేవాడు. 2010లో ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు. స్కూల్లోనూ, కాలేజీలోనూ ఏనాడు పరుగు పందేల్లో పాల్గొనని శ్రీనుకి రన్నింగ్ రేసులపట్ల మక్కువ ఎలా కలిగింది? ఈ ప్రశ్నకు శ్రీను ‘బెంగళూరు ఎంఇజి ఆర్టిలరీ సెంటర్‌లో చేరేవరకూ నేను ఎలాంటి పోటీల్లోనూ పాల్గొనలేదు. నేను బాగా పరుగెత్తగలననే సంగతిని నాకంటే ముందుగా గుర్తించింది నా కోచ్ సుబేదార్ రాజేంద్రన్. ఆయనే నన్ను ఇక్కడ శిక్షణకు తీసుకొచ్చారు. మఖన్‌సింగ్ స్టేడియంలో సుబేదార్ అమ్రిష్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించాడు.
హవల్దార్ బుగత శ్రీను ఇప్పటివరకూ అథ్లెటిక్స్‌లో 80 పతకాలు సాధించాడు.
ఇటీవలే జరిగిన హైదరాబాద్ 10కె రన్‌లో పాల్గొని విజయం సాధించాడు. 10 కిలోమీటర్ల పరుగులో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే ఘనత కేవలం మూడు నిమిషాల వ్యవధిలో అతని చేజారింది.
భోపాల్‌లో జరిగిన 21కె రన్ (హాఫ్ మారథాన్)ను 1:03:43 గంటల్లో పూర్తి చేసి, స్వర్ణ పతకం అందుకున్నాడు. ఇక్కడ కూడా శ్రీను ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ‘రోడ్డు మారథాన్లను అంతర్జాతీయ అథ్లెటిక్ అసోసియేషన్ సమాఖ్య (ఐఎఎఎఫ్) గుర్తించడం లేదు. నేను భోపాల్‌లో హాఫ్ మారథాన్ పూర్తి చేయగానే చాలామంది నా దగ్గరకు వచ్చి, ప్రపంచ రికార్డుకు అతి చేరువలోకి వచ్చావంటూ అభినందించడం చాలా సంతోషాన్నిచ్చింది’ అని శ్రీను చెప్పాడు. ఖాళీ సమయాల్లో సినిమాలు చూడటం హాబీ అని చెప్పే శ్రీనుకు పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టం. శ్రీను రోజంతా ప్రాక్టీస్‌లోనే గడుపుతాడు. రోజూ క్రమం తప్పకుండా డైరీ రాయడం అతనికున్న మరో మంచి అలవాటు. ప్రతి రోజూ కోచ్ ఇచ్చే సలహాలను తప్పనిసరిగా డైరీలో రాసుకుంటానంటాడు శ్రీను.
ప్రస్తుతం 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపిక కావాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నాడు. అక్కడ 10వేల మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు విజేత కెనిన్సా బెకెల్ (ఇథియోపియా)తో పోటీ పడాలని ఉందంటూ మనసులో మాట చెప్పిన శ్రీను ఆశయం నెరవేరాలని ‘యువ’ కోరుకుంటోంది.