యువ

ఆ బార్బర్.. ఓ బిలియనీర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతకడం ఎలా?
ఇది కొందరిని వేధించే సమస్య.
నచ్చినట్టు బతకడం ఎలా?
మరికొందరిని పరీక్షించే ప్రశ్న.
ముందు బతకడం, ఆ తరువాత నచ్చినట్లు జీవించడం ఎలాగో తెలుసుకున్నాడు.. నిరూపించాడు రమేష్‌బాబు..
అతణ్ణి ఇప్పుడంతా ‘బిలియనీర్ బార్బర్’ అని పిలుస్తారు..
బార్బర్ అని పిలిస్తే ఆయనేం సిగ్గుపడడు. ఎందుకంటే ఆయనకు అన్నంపెట్టిన వృత్తి అది. జీవితాన్ని నిలబెట్టిన పని అది. బార్బర్‌గా పనిచేసి బతకడం నేర్చిన రమేష్ నిలదొక్కుకునేందుకు ఇష్టాన్ని పెట్టుబడిగా చేసుకున్నాడు. కోట్లు వచ్చిపడేలా చేసిన ఇష్టంపై మమకారం ఉన్నా అసలు పని (బార్బర్‌గా)ని ఎప్పుడూ విస్మరించలేదు. ప్రతిరోజు సాయంత్రం, వారాంతాల్లో ఇప్పటికీ సెలూన్‌లో పనిచేస్తూనే ఉంటాడు. దశాబ్దాల తరబడి అతడివద్దే క్షవరం చేయించుకునే కస్టమర్లు ఇప్పటికీ అతడికోసం వస్తూనే ఉంటారు. ఒకప్పుడు రోజు గడవడమే కష్టంగా ఉండేది. అతికష్టంమీద, బంధువుల సహకారంతో ఒకపూట తిని, తినక పస్తులున్న రోజులున్నాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని, వృత్తిని నమ్ముకుని జీవితంలో అడుగులు వేసిన రమేష్ ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. ప్రపంచంలో సంపన్నులమని చెప్పుకునేవారి వద్దకూడా లేనన్ని అధునాతన కార్లు ఇప్పుడు అతడి సొంతం.
***
బెంగళూరులోని ఎజీపురలోని రమేష్‌బాబు కార్యాలయంలో పదుల సంఖ్యలో కార్లు ఉంటాయి. మిని మెర్సిడెస్, రోల్స్‌రాయిస్, వింటేజ్ మోడల్ కార్లు అక్కడ కనిపిస్తాయి. వివిధ దేశాలు, నగరాల నుంచి గత 24 ఏళ్లుగా సేకరించిన వివిధ మోడళ్ల కార్లు దర్శనమిస్తాయి. కొన్ని నమూనా కార్లు ఉంటాయక్కడ. కార్యాలయం బయట అధునాతమైన, విలాసవంతమైన కార్లు బారులు తీరి ఉంటాయి. కార్ల సేకరణ చాలామందికి హాబీయే. కానీ రమేష్ తీరు వేరు. ఖరీదైన, అరుదైన, విలాసవంతమైన, వినూత్నమైన, సరికొత్త కార్లను సేకరించడం అతడికి ఇష్టం. ఆ ఇష్టమే ఇప్పుడు అతడిని సంపన్నుడిని చేసింది. బెంగళూరులో పేరుపొందిన రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ అతడిదే. అతడి దగ్గరున్న కార్లలో కొన్ని అసలు ఇండియాలో మరెవ్వరి దగ్గరా లభించనివి కూడా ఉన్నాయి. బార్బర్‌గా సంపాదించిన డబ్బును 1993లో తొలిసారిగా తనకు ఇష్టమైన కార్లపై పెట్టుబడి పెట్టిన రమేష్ ఇంతవాడయ్యాడు. లగ్జరీ కార్లను సేకరించడం, అద్దెకి తిప్పడం వ్యాపారంగా చేసుకున్న రమేష్ మొదట్లో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు.
***
రమేష్ పుట్టింది, పెరిగింది బెంగళూరులోనే. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. బ్రిగేడ్ రోడ్‌లో తండ్రికి సెలూన్ ఉండేది. ఆయన పోయాక పేదరికం, ఆకలి వేధించాయి. దగ్గరి బంధువు సెలూన్‌ను నడిపించే బాధ్యత తీసుకుని రోజుకు ఐదు రూపాయలు ఇచ్చేవారు. తోబుట్టువులు, తల్లి, నాయనమ్మతో రోజు గడవడం కష్టంగా ఉండేది. చివరకు తల్లి ఒకరి ఇంట్లో వంటమనిషిగా పనికి కుదిరింది. నెలకు 50 రూపాయలు వచ్చేవి. ఏడాదికోసారి కొత్తబట్టలు, కడుపునిండా తిండి ఉండేదంతే. సరైన దుస్తులు లేవని స్కూల్‌నుంచి పంపేయడం బాధనిపించేది. పదమూడేళ్ల వయసులో ఇంటింటికీ న్యూస్‌పేపర్ వేయడం మొదలెట్టాక వచ్చే డబ్బుతో ఒకపూట భోజనం తినే పరిస్థితి వచ్చింది. ప్రియూనివర్శిటీ చదువయ్యాక సెలూన్‌ను సొంతంగా నడిపడం ప్రారంభించాడు. ఇన్నర్‌స్పేస్ అని సెలూన్ పేరు మార్చాడు. దాచుకున్న డబ్బులతో హంగులు చేర్చాడు. పనివారు రాక ఇబ్బందులెదురైతే తనే పనిలోకి దిగాల్సివచ్చింది. ఓ కస్టమర్ వచ్చి కటింగ్ చేయాలని అడగడం, తనకు రాదని చెబితే ఎలా వస్తేఅలా చేయమనడం, అది నచ్చి ఎక్కువ డబ్బులు ఇవ్వడం మరచిపోలేనంటాడు రమేష్. ఆ కస్టమర్ ఇప్పటికీ రమేష్ సెలూన్‌కు వస్తూంటాడు. రానురాను వృత్తిపై పట్టువచ్చింది. ఏకంగా సింగపూర్ వెళ్లి అక్కడ పేరున్న టోనీ అండ్ గై సంస్థలో హెయిర్‌కటింగ్‌లో ప్రత్యేక కోర్సు చేసివచ్చాడుకూడా. ముఖ్యంగా మహిళలకు హెయిర్‌కట్ చేయడంలో మెలకువలు, కొత్తవిధానాలను తెలుసుకున్నాడు. ఆ తరువాత సెలూన్ అభివృద్ధి చెందింది. అలా సంపాదించి పొదుపుచేసిన నగదును తొలిసారిగా, 1993లో తొలిసారి ఓ మారుతి ఒమిని కారును కొన్నాడు. సొంతంగా వాడుకునేందుకు. కానీ తప్పనిసరై ఓసారి అద్దెకు తిప్పడం ప్రారంభించాడు. ఆ ప్రయోగం అతడి జీవితాన్ని మార్చేసింది. బ్యాంకురుణం వాయిదాలు తీర్చేందుకు అలా చేయాల్సి వచ్చేది.
***
బెంగళూరులో ఖరీదైన, విలాసవంతమైన కార్లకు గిరాకీ ఉందని గుర్తించిన రమేశ్ బ్యాంకులోన్లతో కార్లు కొనడం మొదలెట్టాడు. 2000 సంవత్సరంలో దశ తిరిగింది. మెర్సిడెస్ ఇండియా కారును కొనేందుకు తనదగ్గర ఉన్న డబ్బు, బ్యాంకులోన్ జోడించాడు. అంత ఖరీదైన కార్లు ఎవరు అద్దెకు తీసుకుంటారన్న భయం వెన్నాడేది. కానీ కలిసొచ్చింది. మరుసటి ఏడాది మరో మెర్సిడెస్ మోడల్ కొన్నాడు.
ప్రస్తుతం అతడివద్ద 400 కార్లు ఉన్నాయి. వాటిలో బిఎండబ్ల్యు, మెర్సిడెస్, జాగ్వార్, రోల్స్‌రాయిస్ ఘోస్ట్‌వంటివీ ఉన్నాయి. బెంగళూరులో మెర్సిడెస్ మేబక్ ఎస్600 మోడల్ కారును కొన్న మూడోవ్యక్తిగా రమేష్ నిలిచాడు. ‘ఇదంతా కష్టార్జితం. కష్టపడితే దక్కిన ఫలితం. మా డ్రైవర్లు సమయానికి రాకపోతే నేనే డ్రైవర్‌గా మారిపోతా’ అని అంటున్న రమేష్ మాటలు అతడేంటో చెబుతాయి. అయితే ఇలాంటి వ్యాపారాలు ఒక్కోసారి భయపెడతాయంటాడాయన.
2011లో రోల్స్‌రాయిస్ కారు కొన్నప్పటి అనుభవాన్ని చెబుతూంటాడు. ఎక్కువ పన్నులు వేయడంవల్ల దానిని తెచ్చుకోవడం ఆర్థికకష్టాలకు కారణమైంది. భార్య బంగారాన్ని తాకట్టుపెట్టాను. ఒకటిన్నర సంవత్సరం తరువాత మొత్తానికి బయటపడ్డానని చెబుతారు రమేష్. చాలామంది రోల్స్‌రాయిస్ ఘోస్ట్ మోడల్ కారంటే ఇష్టపడతారని, కానీ తనకు కంటెస్సా అంటేనే ఇష్టమని చెప్పే రమేష్ ప్రస్తుతం చెన్నై, ఢిల్లీల్లో కార్లను అద్దెకు తిప్పుతున్నారు. త్వరలో హైదరాబాద్, విజయవాడలకు వ్యాపారాన్ని విస్తరిస్తానని చెబుతున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించామంటున్న రమేశ్ ఇప్పటికీ తనకు బతుకునిచ్చిన సెలూన్‌ను మరచిపోడు. ఎందులోనైనా ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు తప్పవని చెప్పే రమేశ్ చెప్పే విజయసూత్రం ఒక్కటే. ‘కష్టపడి పనిచేయండి..అన్నీ వాటంతట అవే వస్తాయి’ అని. రమేష్‌ను చూస్తే అది నమ్మకతప్పదుకదా!

బిగ్ బి, షారుక్
మా కార్లు ఎక్కారు!
బాలీవుడ్ తారలు సహా ఎందరో విఐపిలు మా కార్లను ఉపయోగించారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారుక్‌ఖాన్‌సహా ఎందరో ప్రముఖులు మా వాహనాలను వాడారు. ఇది నాకెంతో గర్వకారణం. తొలిసారిగా నేను కొన్న మారుతి వ్యాన్ ఇప్పటికీ వాడుతున్నా. అయితే అద్దెకు తిప్పే విషయంలో రిటైర్‌మెంట్ ఇచ్చా. నా దగ్గర ఉన్న వాహనాల్లో256 లగ్జరీకార్లు. 6 బిఎండబ్ల్యులు, 9 మెర్సిడెస్ బెంజ్, 1 జాగ్వార్, 3 ఆడి, 9 రోల్స్‌రాయిస్ కార్లు ఉన్నాయి. సగటను రోజుకు వెయ్యిరూపాయల నుంచి 50వేల రూపాయల అద్దెపై అందించేందుకు నావద్ద ఎప్పుడూ వాహనాలుంటాయి. విజయవాడ, హైదారాబాద్‌లలోకూడా ఈ వ్యాపారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా’

నా పిల్లలకు నేర్పుతా!
‘హెయిర్‌కటింగ్ అంటే చిన్నచూపు అవసరం లేదు. అది మా వృత్తి. అదంటే ఇష్టం. ఇప్పటికీ ప్రతి రోజు సాయంత్రం 5.30 అయితే చాలు సెలూన్‌కు వెళతా. నాతో క్షవరం చేయించుకునేందుకు కస్టమర్లు వేచిచూస్తారు. అప్పుడప్పుడు నా పిల్లల్ని సెలూన్‌కు తీసుకెళుతూంటా. ఒగ పాప, ఇద్దరు బాబులున్నారు. వాళ్లకూ ఈ పని నేర్పిస్తా. ఇదేమీ తప్పుకాదు. నేను స్వయంగా హెయిర్ కట్ చేసినా రూ.150 మాత్రమే తీసుకుంటా. అదొక పద్ధతి. అంతే. ఉదయం 6 గంటలకల్లా గ్యారేజ్‌కు వెళ్లి కార్ల మరమ్మతులు చూస్తా. 10.30కల్లా ఆఫీసు వ్యవహారాలు చక్కబెడతా. సెలవులు, ఆఫ్‌ల ప్రసక్తే లేదు. నిరంతరం పని చేస్తూనే ఉంటా. కుటుంబంతో కలసి అప్పుడప్పుడు పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రమే విశ్రాంతి. అదే నన్ను ఇంతవాణ్ణి చేసింది. ఇంట్లో కన్నడ, తెలుగు మాట్లాడతాం తెలుసా’