యువ

చూపు లేకపోయనా.. సూదంటురాయే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీనేజీ విద్యార్ధికి ఉండాల్సిన అన్ని లక్షణాలూ అతనికి ఉన్నాయి. అతను నవ్వితే ముత్యాలు రాలాల్సిందే. చురుకుతనంలోనూ ఎవరికీ తీసిపోడు. విషయ పరిజ్ఞానంలో అతనికి అతనే సాటి. అన్నింటికి మించి ఆ వయస్సులో ఉండే సిగ్గు, బిడియంతోపాటు తనపై తనకు సడలని ఆత్మవిశ్వాసం ఆ విద్యార్ధి ఆస్తిపాస్తులు. ఇన్ని గుణగణాలున్న ఆ కుర్రాడికి చూపు లేదన్న విషయం తెలిస్తే మాత్రం ఎవరికైనా కంట నీరు పెల్లుబుకమానదు. అయితే చూపు లేకపోయినా చూపున్న విద్యార్థులతో పోటీ పడి చదివి ఇంటర్లో వెయ్యికి 976 మార్కులు సంపాదించాడని తెలిస్తే, ఆ కన్నీరు ఆనందబాష్పాలుగా మారకామానదు. మనం మాట్లాడుకుంటున్నది ఏలూరుకు చెందిన విద్యార్ధి పినపాక శ్రీవెంకట రవికుమార్ గురించి. ఇంటర్‌మీడియట్‌లో ఏకంగా 976 మార్కులు సాధించి, అందరిచేతా వారెవ్వా అనిపించిన ఈ కుర్రాడి విజయ ప్రస్థానం ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం...
పుట్టడమే అంధుడిగా పుడితే అది వేరు. కానీ మధ్యలో చూపుపోతే ఆ బాధ వేరు. అది భరించేవారి కన్నా కన్నవారి బాధను రెండింతలు చేస్తుంది. పదేళ్ల వయసు వచ్చేవరకూ అందరిలానే ఉన్న రవికుమార్‌కు అకస్మాత్తుగా అనారోగ్యం చేయటంతో తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యులకు చూపించారు. చివరకు జబ్బు తగ్గినా, అప్పట్లో వాడిన కొన్ని మందులు వికటించి, కంటి చూపును దెబ్బతీశాయి. మొదట్లో తల్లిదండ్రులు కుంగిపోయినా, తమ బాధను గుండెల్లోనే దిగమింగి, కుమారుడికి తామే రెండు కళ్లయి పెంచారు. అతనిని మామూలు మనిషిని చేసి, మళ్లీ పాఠశాలకు వెళ్లేలా ఆత్మవిశ్వాసం నింపారు. అదే ఊపులో రవికుమార్ కేంద్రీయ విద్యాలయలో పదవ తరగతి పరీక్షల్లో పదికి పది పాయింట్లు సాధించి, కళ్లు లేకపోయినా తాను ఎవరికి తీసిపోనని నిరూపించుకున్నాడు. రవికుమార్ తండ్రి కామేశ్వరబాబు వృత్తిరీత్యా ఆంధ్రాబ్యాంకులో భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అవిధంగా రవికుమార్ బాల్యం చాలావరకు ఉత్తరాదిన గడిచిపోగా అనంతర కాలంలో బదిలీపై ఏలూరు వచ్చారు. ఇంటర్‌లో రవికుమార్ ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కళాశాలలో చేరాడు. తాజాగా వెలువడిన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఎంఇసి గ్రూపులో రవికుమార్ వెయ్యి మార్కులకుగాను 976 మార్కులు సాధించాడు. చిన్నప్పటినుంచి రవికుమార్ లెక్కల్లో దిట్ట. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఒక మార్కు తగ్గిందని బెటర్‌మెంట్ రాసి మరీ ఆ ఒక్క మార్కును తిరిగి దక్కించుకున్నాడంటే అతనిలోని పట్టుదల ఏమిటో తెలుస్తుంది. ఇంగ్లీషు, హిందీల్లో అనర్గళంగా మాట్లాడే రవి, ఉత్తరాదిలో విద్యాభ్యాసం జరిగిన కారణంగా తెలుగు రాయటం మాత్రం ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. రవికుమార్‌ది అద్భుతమైన గ్రహణ శక్తి అని ఎన్‌ఆర్‌ఐ లెక్చరర్లే చెబుతున్నారు. తల్లి కళ్యాణి పాఠాలు చదివి వినిపిస్తే రవికుమార్ వాటిని అలాగే మెదడులో నిక్షిప్తం చేసుకుంటాడట. కంప్యూటర్ వాడకంలోనూ అతనిది అందె వేసిన చేయి. చూపు లేకపోయినా కీబోర్డుపై చక్కగా టైప్ చేస్తాడట. ఇక ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లలో చిట్‌చాట్‌లు, వాట్సప్‌లలో మేసేజ్‌లు సరేసరి. ఇంటర్ తర్వాత ఏం చేస్తావనే ప్రశ్నకు బిఎస్‌సి కంప్యూటర్స్‌లో చేరతానని చెప్పాడతను. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు వైద్యం కూడా చేయించుకుంటున్నాడు. ఏనాటికైనా తమ కుమారుడికి మళ్లీ చూపు వస్తుందన్న ఆశాభావం ఆ తల్లిదండ్రుల్ని ముందుకు నడిపిస్తోంది. కంటిచూపు లేకపోయినా, అపారమైన ఆత్మవిశ్వాసం, అమోఘమైన గ్రాహ్య శక్తిని రెండు కళ్లుగా చేసుకుని, చదువుల్లో ముందడుగు వేస్తున్న రవి భవిష్యత్తులో మరింతగా ఎదగాలని ‘యువ’ ఆశిస్తూ, అతనికి బెస్ట్ఫా లక్ చెబుతోంది!
*
-జి రఘురామ్, ఆంధ్రభూమి బ్యూరో, ఏలూరు
*

చిత్రం..తల్లిదండ్రులతో సంతోషం పంచుకుంటున్న రవికుమార్