యువ

‘ఖుషీ’గా యోగ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్బురపరచే ‘యోగ’ విన్యాసాలను ప్రదర్శిస్తూ పదమూడేళ్ల ప్రాయంలోనే ఆమె అద్భుత రికార్డులను సొంతం చేసుకుంది. శరీరాన్ని విల్లులా వంచే ఖుషీ హేమచంద్ర అత్యంత క్లిష్టతరమైన యోగాసనాలను ప్రదర్శిస్తూ ‘ఔరా’ అనిపించుకుంటోంది. కర్నాటకలోని మైసూరుకు చెందిన ఆమె కష్టసాధ్యమైన ఓ ఆసనాన్ని ఒకే నిముషంలో పదమూడు సార్లు ప్రదర్శించింది. శరీరాన్ని వెనక్కి వంచి ఒకే నిముషంలో 15 ఆసనాలను ప్రదర్శించి ప్రపంచ రికార్డును సైతం సాధించింది. ‘గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్సు’లో స్థానం సంపాదించిన ఖుషీ తన విన్యాసాలతో ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
చేతులు ముడుచుకుని ఆసనాలు వేసినా, కేవలం తల భాగాన్ని నేలపై ముందుగా పెట్టి పైకి లేవడం వంటి విన్యాసాలు ఆమె యోగ నైపుణ్యానికి నిదర్శనాలు. నేలపై చేతులు వెనక్కి పెట్టి పాదాలను పైకి లేపుతూ ఆమె చేసే విన్యాసాలను ఎవరైనా చూసి విస్మయం చెందాల్సిందే. శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో ఖుషీకి ఆమె తల్లిదండ్రులు మొదట యోగ క్లాసులకు పంపేవారు. అయితే, ఆ తర్వాత ఆమె యోగాసనాలపై దృష్టి సారించి ఎన్నో మెళకువలు నేర్చుకుంది. పలు అంతర్జాతీయ యోగ పోటీలకు మన దేశం తరఫున ఖుషీ హాజరవుతూ పతకాలను, ప్రశంసలను సొంతం చేసుకుంది. 2016లో వియత్నాంలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో యోగ విన్యాసాలు ప్రదర్శించి రెండు రజత పతకాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న తాను భవిష్యత్‌లో యోగా టీచర్‌గా సేవలందిస్తానని ఖుషీ చెబుతోంది. దేశంలోనే అత్యంత క్లిష్టతరమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గాలన్నది తన ఆకాంక్ష అని ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది.

చిత్రం.. ఖుషీ హేమచంద్ర