యువ

మట్టిలో మాణిక్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి మురికివాడ నుంచి న్యూ యార్క్‌లోని ప్రఖ్యాత నృత్య పాఠశాలలో చేరడం అసాధారణ విషయం.. అయితే, పదిహేనేళ్ల అమీరుద్దీన్ షా ఈ అద్భుతాన్ని సాధించి అందరినీ అబ్బురపరచాడు. ‘కలలు కనడానికి కూడా ధైర్యం ఉండాల’న్న మాటలను పటాపంచలు చేస్తూ, నాట్యరంగంలో భారత్‌కు మంచి పేరు తెస్తానని ఈ కుర్రాడు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. ఆరేళ్ల ప్రాయంలో సంగీతం పట్ల ఆసక్తి చూపిన అమీరుద్దీన్ ఆ తరువాత తన దృష్టిని నృత్యం వైపు సారించాడు. మూడేళ్ల క్రితం ముంబయిలోని ఓ డాన్స్ అకాడమీలో చేరిన అమీరుద్దీన్ ప్రతిభను ఇజ్రాయిలీ- అమెరికన్ టీచర్ యెహుదా మార్ గుర్తించి, న్యూ యార్క్ బాలే స్కూల్‌లో చేరాలని వెన్నుతట్టి ప్రోత్సహించాడు.
ముంబయి మురికివాడలో ఓ వెల్డర్ కుమారుడైన అమీరుద్దీన్ అందరు కుర్రాళ్ల మాదిరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కన్నాడు. అందుకు నృత్యాన్ని తగిన మార్గంగా ఎంచుకున్నాడు. ‘బాలే మ్యాపులో భారత్ ఎక్కడా కనిపించదు.. మన దేశాన్ని నృత్యరంగంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నదే నా ఆశయం..’ అంటున్న ఈ కుర్రాడు మొత్తానికి తాను అనుకున్నది సాధించాడు. న్యూ యార్క్‌లోని ‘అమెరికన్ బాలే థియేటర్‌కు చెందిన జాక్వెలిన్ కెన్నడీ ఒనాసిస్ స్కూల్’లో నాలుగేళ్ల కోర్సులో ప్రవేశానికి అనుమతి పొందాడు. ఓ ప్రముఖ నృత్య పాఠశాలలో గత రెండున్నరేళ్లుగా శిక్షణ పొందుతూ అబ్బురపరచే నృత్య విన్యాసాలను ప్రదర్శిస్తున్నాడు. తన ట్యూషన్ ఫీజుకు, రవాణా ఖర్చులకు అవసరమైన విరాళాలను సేకరించే పనిలో ఉన్నప్పటికీ నిరాశ చెందకుండా నృత్యంపైనే దృష్టి పెట్టాడు. ‘బాలే’ గురించి పూర్తి అవగాహన లేకున్నా, తనకు నచ్చిన రీతిలో నృత్య విన్యాసాలను ప్రదర్శిస్తూ శిక్షకులను సైతం విస్మయపరుస్తున్నాడు. వివాహ వేడుకల్లో నృత్యం చేయాలంటూ ఇపుడు ఈ కుర్రాడికి అవకాశాలు వస్తున్నాయి. తీరిక వేళల్లో స్నేహితుల మధ్య నృత్యం చేస్తూ వారిని ఆహ్లాదపరుస్తుంటాడు.
అమీరుద్దీన్ విన్యాసాల్లో అద్భుతాలను చూసిన ఇజ్రాయిలీ- అమెరికన్ టీచర్ మార్ ‘బాలే’లో శిక్షణ పొందాలని సూచించాడు. ఇలాంటి ‘మట్టిలో మాణిక్యాన్ని’ తాను ఇంతవరకూ చూడలేదని అంటున్న మార్ నృత్యసాధనకు అవసరమైన పాదరక్షలు, దుస్తులను స్వయంగా కొని అమీరుద్దీన్‌కు ఇచ్చాడు. అమీరుద్దీన్‌తో పాటు మనీష్ చౌహాన్ (21) అనే మరో కుర్రాడికి న్యూ యార్క్‌లోని జాఫ్రీ బాలే స్కూల్‌లో స్కాలర్‌షిప్ లభించేలా మార్ సాయం చేశాడు. అయితే సకాలంలో అమెరికా వీసాలు లభించకపోవడంతో వీరు ఆ స్కూల్‌లో చేరలేకపోయారు. ఆ తర్వాత మనీష్‌తో కలసి అమీరుద్దీన్ ఓరెగాన్ బాలే థియేటర్ స్కూల్‌లో చేరాడు. ప్రస్తుతం పోర్ట్‌ల్యాండ్‌లో శిక్షణ పొందుతున్న అమీర్ న్యూ యార్క్‌లోని అమెరికన్ బాలే థియేటర్‌లో చేరేందుకు విరాళాల కోసం దాతలను ఆశ్రయిస్తున్నాడు. ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడలేక పోయినా హిందీ మాట్లాడుతూ ఎలాగో నెట్టుకొస్తున్న ఈ కుర్రాడు మరో నాలుగేళ్లు అమెరికాలోనే ఉంటూ శిక్షణ పొందుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. న్యూ యార్క్ చాలా జనసమ్మర్ధమైన నగరమని, ఇక్కడి ప్రజలతో ఎలా కలిసిపోవాలో తనకు తెలియడం లేదని అమీర్ అంటున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా న్యూ యార్క్ బాలే స్కూల్‌లో ముఖ్య డాన్సర్‌గా నిలవాలన్నదే తన ఆకాంక్ష అంటున్నాడు. ఫీజులు చెల్లించుకోలేని పేదవర్గాల పిల్లలకు నృత్యం నేర్పాలన్నదే తన జీవితాశయమని అమీరుద్దీన్ చెబుతున్నాడు.

చిత్రం.. అమీరుద్దీన్ షా