యువ

‘గురుకుల’ ప్రవేశం జీవితాన్ని మార్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడో మారుమూల పల్లెలో వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు ఆసియా స్థాయిలో జరిగిన పోటీ పరీక్షలో సత్తా చాటి మన దేశానికి వనె్న తెచ్చాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం (అమెరికా)లో నిర్వహించే ‘సమ్మర్ క్రాస్ రోడ్ ప్రోగ్రామ్’కు తెలంగాణకు చెందిన గురుకుల కళాశాల విద్యార్థి మాశగల్ల ఆనంద్ ఎంపికై సంచలనం సృష్టించాడు. ఆసియా దేశాల నుంచి సుమారు 2,500 మంది విద్యార్థులు హార్వర్డ్ వర్సిటీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా అందులో 40 మంది మాత్రమే ఎంపికయ్యారు. ‘హార్వర్డ్’ అధ్యాపకుల ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఆగస్టు రెండో వారంలో ప్రారంభమయ్యే శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన ఆనంద్ చిలుకూరులోని గురుకుల పాఠశాలలో పదో తరగతి, ఇబ్రహీంపట్నం గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు.
అకడమిక్ ప్రొఫైల్, రాతపరీక్ష, ఇంటర్వ్యూలో అత్యుత్తమ నైపుణ్యం ప్రదర్శించిన ఆనంద్‌ను ‘సమ్మర్ రోడ్ క్రాస్ ప్రోగ్రామ్’కు ఎంపిక చేసినట్టు హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. శిక్షణ పూర్తి చేసిన వారికి హార్వర్డ్ వర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. అంతేగాక వీరికి ‘హార్వర్డ్’లో డిగ్రీ కోర్సులో చేరేందుకు ఏభై శాతం వెయిటేజి ఇస్తారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన ఆనంద్ పేద కుటుంబానికి చెందినప్పటికీ చిన్నతనం నుంచి చదువులో ప్రతిభ చూపాడు. ఇతని తల్లిదండ్రులు రత్నమ్మ, కాశయ్య వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కానె్వంట్లలో చదివించే ఆర్థిక స్థోమత లేనందున ఆనంద్‌ను తల్లిదండ్రులు చిలుకూరు గురుకుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ అయిదో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివిన అతను తెలివైన విద్యార్థిగా పేరుతెచ్చుకున్నాడు.
ఇబ్రహీంపట్నంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న పట్టుదలతో చదువుపై దృష్టిపెట్టి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యాడు. చిలుకూరు గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందడంతో తన జీవితమే మారిపోయిందని, నిరుపేద కుటుంబానికి చెందిన తాను భవిష్యత్‌లో పెద్ద పరిశ్రమను స్థాపించి బడుగువర్గాల యువతకు ఉపాధి కల్పిస్తానని ఆనంద్ చెబుతున్నాడు. ప్రతిభావంతులైన నిరుపేద యువతకు ఉపాధి కల్పించడమే తన జీవితాశయం అంటున్నాడు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటే పేద విద్యార్థులైనా అద్భుతాలను సాధించగలరని ఈ కుర్రాడు నిరూపించాడు.

చిత్రం.. గురుకుల కళాశాల విద్యార్థి మాశగల్ల ఆనంద్