యువ

‘ఉద్యోగ’ యోగ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉద్యోగం వేట’లో సవాలక్ష సవాళ్లు ఎదుర్కొంటున్న నేటి యువత ఏదో ఒక వైవిధ్యం చాటుకుంటే తప్ప అవకాశాలు దక్కడం లేదు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోవడం, అప్పుడప్పుడు నియామకాలు జరిగినా విపరీతమైన పోటీ వల్ల నిరుద్యోగ యువతకు నిరాశ తప్పడం లేదు. ఇంజనీరింగ్ విద్యపై వేలం వెర్రి పెరగడంతో ‘పట్టాలు’ పొందినవారందరికీ తగిన ఉద్యోగాలు దక్కడం లేదన్నది కాదనలేని వాస్తవం. ఐటి రంగంలో ఉద్యోగాలకు ‘కోత’ పెట్టడంతో మిగతా కోర్సుల వైపు యువత దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాస్త విలక్షణమైన కోర్సులను అభ్యసిస్తే ఉపాధి అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. మంచి ఉద్యోగం దక్కలేదని నిరాశ పడుతూ కాలాన్ని వృథా చేసే బదులు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్న రంగాలపై యువత దృష్టి సారించడం ఉత్తమం.
భిన్నమైన కెరీర్ గురించి తపన చెందేవారికి ఇపుడు ‘యోగ’ కోర్సులు వరంగా మారాయి. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల ‘యోగ’కు ఆదరణ పెరిగింది. మన ప్రధాని నరేంద్ర మోదీ చొరవ ఫలితంగా ఏటా ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడంతో ఇపుడు దేశ దేశాల్లో ‘యోగ’కు ప్రాచుర్యం లభిస్తోంది.
‘యోగ’ పట్ల ఆసక్తి ఉన్నవారు దీనిని మంచి కెరీర్‌గా ఎంచుకోవచ్చని ఉపాధిరంగ నిపుణలు సైతం సలహా ఇస్తున్నారు. దీన్ని కెరీర్‌గా ఎంచుకునేవారు ముందుగా అన్ని విషయాలనూ అవగాహన చేసుకోవాలి. ‘యోగ’ను చాలెంజింగ్ కెరీర్‌గా భావించినపుడు ఉపాధి అవకాశాలు కూడా మెరుగ్గానే ఉంటాయి. ఇపుడు అనేక విద్యాసంస్థల్లో యోగ టీచర్లను నియమిస్తున్నారు. యోగలో మెళకువలు నేర్పే శిక్షకులకు సైతం రానురానూ డిమాండ్ పెరుగుతోంది. దీర్ఘరోగాలకు యోగాసనాలు చక్కటి పరిష్కారం చూపుతాయని వైద్యులు సైతం సలహాలిస్తున్నారు. పిల్లలు, యువత, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ యోగ పట్ల మక్కువ చూపుతున్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇపుడు అన్ని వర్గాల వారూ ప్రాధాన్యత ఇస్తున్నందున యోగ శిక్షకుల అవసరం ఏర్పడింది. నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో సైతం యోగ శిక్షణ సంస్థలు వెలుస్తున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలో యోగ టీచర్లను నియమిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో అయితే యోగ టీచర్లకు పది నుంచి ఇరవై వేల వరకూ జీతభత్యాలు ఇసున్నారు. రిసార్టులు, జిమ్‌లు, పాఠశాలలు, ఆరోగ్య సలహా కేంద్రాలు, టూరిజం రిసార్టులు, హౌసింగ్ సౌసైటీల్లో యోగ శిక్షకులను నియమించడం ఇపుడు చూస్తున్నాం. నిపుణులైన యోగ శిక్షకులు నెలకు 30 నుంచి 40 వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నారు. ఇక, టీవీ చానళ్లలో యోగాసనాలను బోధించేందుకు శిక్షకుల అవసరం ఏర్పడింది. ఇలా స్వయం ఉపాధికి కూడా ‘యోగ’ దోహదం చేస్తోంది. ప్రముఖ క్రీడాకారులు, సినీ సెలబ్రిటీలకు యోగ నేర్పించేవారికైతే భారీగానే సంపాదన ఉంటుంది.
నేడు దేశంలో పలు ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు యోగలో సర్ట్ఫికెట్, డిగ్రీ, పీజీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. మిగతా కోర్సులు చదువుతూనే ‘యోగ’లో శిక్షణ పొందేందుకు అవకాశం ఉంది. యోగ శిక్షకులుగా రాణించాలంటే ఈ కోర్సులతో పాటు మానవ శరీర శాస్త్రం, ఫిలాసఫీపై కూడా పట్టు సాధించాలి. మైండ్ అండ్ యోగ, ఫిలాసఫీ ఆఫ్ యోగ, పర్‌స్పెక్టివ్ ఆఫ్ యోగ వంటి అంశాల్లోనూ నైపుణ్యం అవసరం.