యువ

‘స్మార్ట్’ ఎడబాటు..ఓ కుంగుబాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్మార్ట్ఫోన్ జీవితంలో ఒక భాగం.. దాని నుంచి దూరం కావడం ఓ విషాద వియోగం..’ అనే భావన గుండె వేగాన్ని పెంచుతోంది.. రక్తపోటును తీవ్రతరం చేస్తోంది.. స్మార్ట్ఫోన్‌తో అనుబంధాన్ని మితిమీరి పెంచుకోవడం వల్ల- దానికి దూరం కావడం అనేది ఓ మానసిక కుంగుబాటుగా మారింది.. అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ చెంత లేకున్నా, అది స్విచ్ ఆఫ్ అయినపుడు ఎవరైనా ఆందోళనకరంగా, అయోమయంగా కనిపించారంటే వారు ఓ రకమైన మానసిక రుగ్మతకు లోనయినట్టే! ఫోన్ లేనపుడు తాము ఏదో కోల్పోయామన్న బాధ, ప్రపంచమే శూన్యమై పోయిందన్న భావన వారిలో కనిపిస్తాయట! ఇది వైద్య నిపుణులు నిగ్గు తేల్చిన నిజం. స్మార్ట్ఫోన్‌కు దూరమయ్యాక కొందరిలో కనిపిస్తున్న ఆందోళనను పరిశోధకులు ‘నోమోఫోబియా’గా అభివర్ణిస్తున్నారు. దీనిని ఓ ‘సోషల్ డిజార్డర్’గా భావించాలి లేదా వర్చువల్ ఎన్విరాన్‌మెంట్ కమ్యూనికేషన్ మీద అధికంగా ఆధారపడే తత్వంగా పరిగణించాలని నిపుణులు అంటున్నారు. అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు స్మార్ట్ఫోన్‌లను ఇపుడు విరివిగా వినియోగిస్తున్నారు. వీటిని తమలో ఓ భాగంగా పరిగణిస్తూ, ఎక్కడికి వెళ్లినా వీటిని పట్టుకుని తిరగడం సర్వసాధారణమైంది. స్మార్ట్ఫోన్ వినియోగం విస్తరించి ఓ వ్యసనంలా మారడంతో ఒక్క గంట కూడా వీటికి దూరంగా గడపాలంటే చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. స్మార్ట్ఫోన్‌ను కాసేపైనా పక్కన పెట్టడం ముఖ్యంగా యువతకు ఎంతమాత్రం సాధ్యం కావడం లేదు. ఇది చేతులో లేకుంటే- ఒకటే ఆందోళన, మానసిక కుంగుబాటు.. మొబైల్‌ను తమ ప్రపంచంగా భావించేవారికి అది చేతిలో లేకుంటే పిచ్చెక్కినంత పనవుతోందని అమెరికాలోని ‘ఇంటరాక్టివ్ మీడియా’ సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. స్మార్ట్ఫోన్‌లు విద్య, ఉపాధి రంగాల్లో పలు విధాలుగా ఉపయోగపడుతున్నప్పటికీ చాలామంది కాలక్షేపం కోసం వాడడం ఎక్కువైంది. సాంకేతికతను మితిమీరి వాడడం, దానిపై అతిగా ఆధారపడడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతోందని సియోల్‌లోని నుంగ్‌క్యుక్వాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. స్మార్ట్ఫోన్ వినియోగదారుల విపరీతమైన అనుబంధాలు, వారి వ్యాపకాలు, జ్ఞాపకాలు తదితర విషయాలపై లోతుగా అధ్యయనం చేయగా పలు ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. స్మార్ట్ఫోన్ లేనపుడు ‘సమాచార వ్యవస్థ’కు దూరమైపోతున్నామన్న వేదన చాలామందిలో కనిపించింది. వ్యసనంగా మారిన స్మార్ట్ఫోన్‌కు దూరమైనపుడు కొందరిలో నోమోఫోబియా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఆఫ్‌లైన్ వంటి మానసిక ఆందోళనలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఇతర మానసిక రుగ్మతల మాదిరిగానే వీటికి కూడా వైద్యపరంగా చికిత్స అందించేందుకు వీలుందని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ఫోన్ చెంత లేనపుడు- తమకు చెందిన అత్యంత ప్రియమైన సమాచారం అందుబాటులో ఉండడం లేదని చాలామంది కుంగుబాటుకు లోనవుతున్నారట! సరికొత్త ఫీచర్లు, అధునాతన సాంకేతికను స్మార్ట్ఫోన్లు అందిస్తున్నాయి. దీంతో ఇవి అద్భుత సంధానకర్తలుగా మారుతున్నాయి. అందుకే వీటితో బంధం నానాటికీ బలోపేతమవుతోంది. రోజులో అధిక సమయం వీటితో గడిపేవారు మరో వ్యాపకం పెట్టుకోవడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ జీవనశైలిలో మార్పులు సహజమే అయినప్పటికీ, స్మార్ట్ఫోన్‌లకు బానిసలు కావడం ఆందోళనకర పరిణామమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మానసిక సమస్యలు ముదిరితే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు తప్పవంటున్నారు. అవసరమైన మేరకు సాంకేతికను వాడుకోవడం అలవాటు చేసుకుంటే తప్ప ‘నోమోఫోబియా’ వంటి రుగ్మతల నుంచి బయటపడడం అసాధ్యమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

- మానస