యువ

‘ఒలింపిక్స్’పైనే గురి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 2020 ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించడమే తన ధ్యేయమంటోంది పదిహేడేళ్ల గోనెల్ల నిహారిక. హైదరాబాద్‌కు చెందిన ఈ యువ క్రీడాకారిణి బాక్సింగ్ క్రీడలో ఇప్పటికే పలు సంచలన విజయాలను నమోదు చేసింది. ఇటీవల జరిగిన 31వ ‘ఇంటర్నేషనల్ అహ్మెట్ కార్మెట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్’ పోటీల్లో రజత పతకాన్ని సాధించిన నిహారిక తన నైపుణ్యానికి మరింతగా మెరుగులు దిద్దుకుంటానంటోంది. ఇటీవల జరిగిన ‘అనస్టాసియా’ (షమొనవా) తుది పోటీలో తాను విఫలం చెందడం నిరాశకు గురి చేసినప్పటికీ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బాక్సింగ్‌లో మెళకువలను ఇంకా నేర్చుకుంటానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. నిరంతర సాధనతో కొత్త నైపుణ్యాలను పుణికిపుచ్చుకుని ‘బాక్సింగ్’లో తలపడతానని ధీమాగా అంటోంది. వచ్చే నవంబర్‌లో అస్సాంలో జరిగే ‘వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్’ పోటీలకు భోపాల్‌లో జరిగే శిక్షణ శిబిరంలో నిహారిక పాల్గొంటోంది. బాక్సింగ్‌లో మరింతగా రాణించేందుకు ‘జిందాల్ గ్రూపు’ తనకు అన్ని విధాలా అండగా నిలవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది. బళ్లారిలోని ‘జిందాల్ ఇన్‌స్పైర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్సు’లో తనకు అవకాశం కల్పించి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని ఆమె చెబుతోంది. మరింతగా శిక్షణ తీసుకుంటున్నందున 2020 ఒలింపిక్స్‌పైనే తాను ఎక్కువగా దృష్టి పెడుతున్నానని, బాక్సింగ్‌లో మన దేశానికి పతకాన్ని కచ్చితంగా సాధించగలనన్న నమ్మకం ఉందని చెబుతోంది. 2015లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్, 2016లో నేషనల్ కప్ పోటీల్లో పతకాలను సాధించడమే గాక ఎన్నో మెళకువలను తెలుసుకున్నానని ఆమె గుర్తు చేస్తోంది.
తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ సాధిస్తున్న అద్భుతాలను చూసి తాను ఎంతగానో స్ఫూర్తిని పొందానని నిహారిక తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. త్వరలో జరిగే బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మన దేశానికి బంగారు పతకాన్ని సాధించాలన్నదే తన ప్రస్తుత లక్ష్యమని చెబుతోంది. ఈ టార్గెట్‌ను సాధించేందుకు తనకు కోచ్‌లు ఎంతో అండగా నిలుస్తున్నారని, భోపాల్‌లో జరుగుతున్న శిక్షణ శిబిరం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందని అంటోంది. శిక్షకులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించే కోచ్‌లు, సిబ్బంది ఉండడం తనకు సంతోషం కలిగిస్తోందని ఆమె తెలిపింది. 2015లో స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) విశాఖలో నిర్వహించిన బాక్సింగ్ శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందడంతో తన క్రీడాజీవితం అనుకోని మలుపు తిరిగిందని నిహారిక గుర్తు చేస్తోంది. విశాఖలో ‘ద్రోణాచార్య’ పురస్కార గ్రహీత ఐ. వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఆమె శిక్షణ పొందింది. బాక్సింగ్ క్రీడలో ప్రత్యర్థిని చిత్తు చేయాలంటే శారీరక బలంతో పాటు పలు మెళకువలు అవసరం అంటోంది. ఒకసారి చూపిన మెళకువలు, నైపుణ్యాలు మరోసారి పనిచేయక పోవచ్చని ఆమె అంటోంది. ప్రతి పోటీ కూడా కొత్తగా ఉంటుందని వివరిస్తోంది. మానసిక ప్రశాంతత వల్ల బాక్సింగ్‌లో సరైన నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుందని, ఒత్తిడి వల్ల వైఫల్యం తప్పదని చెబుతోంది. భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రత్యర్థి బలాన్ని అంచనా వేస్తూ సరైన సమయంలో సరైన నైపుణ్యాన్ని చూపాల్సి ఉంటుందని అంటోంది. తల్లిదండ్రుల సహాయంతో బాక్సింగ్‌లో రాణిస్తున్న నిహారిక ‘2017 యూత్ నేషనల్’ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రెండు సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించిన అమెరికా క్రీడాకారిణి క్లారెస్సా మారియా తనకు స్ఫూర్తిదాత అని నిహారిక చెబుతోంది. భవిష్యత్‌లో అంతర్జాతీయ వేదికలపై పతకాలను సాధించి, భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడమే తన ఏకైక ధ్యేయమని ఆమె అంటోంది.