యువ

రోబోలు వచ్చినా.. ఉద్యోగాలకు ఢోకా లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కృత్రిమ మేధస్సు’ పెరిగేకొద్దీ యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతాయన్న భయాందోళనలు అనవసరమని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో భరోసా ఇస్తోంది. వైద్యం, పర్యాటకం, ఆతిథ్యం, సైనిక, పారిశ్రామిక రంగాలలో ఇప్పటికే రోబోలు రంగప్రవేశం చేశాయి. ఆధునిక సాంకేతిక ఫలితంగా అనేకానేక రంగాల్లో రోబోలకు స్థానం కల్పిస్తున్నారు. రోబోల రాకతో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందా? ఉపాధి సమస్య మరింత తీవ్రరూపం దాలుస్తుందా? అన్న అనుమానాలు దేశదేశాల్లో వ్యాపిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో రోబోల వినియోగంలో చైనా ఇప్పటికే రెండో స్థానంలో నిలిచింది. రోబోల వినియోగం పెరిగినప్పటికీ చైనాలో గత పదేళ్ల కాలంలో వేతనాలు 1.5 రెట్లు పెరిగాయి. అదేవిధంగా జర్మనీ, మెక్సికోల్లో రోబోల వినియోగం పెరుగుతున్నా మరోవైపు ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది.
రోబోల వినియోగానికి సంబంధించి జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లో భారీ లక్ష్యాలను నిర్దేశించారు. చైనాలో రోబోల వినియోగం గణనీయంగా పెరిగినా ఉపాధి రంగంలో అంతగా ప్రతికూల పరిస్థితులేవీ కనిపించడం లేదని ఐక్యరాజ్య సమితిలోని ‘ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ సదస్సు’ అభిప్రాయపడింది. ఉత్పత్తి రంగానికి సంబంధించి చైనా, జర్మనీల్లో ఉపాధికి ఎలాంటి కోత పడలేదు. అయితే, దక్షిణ కొరియాలో మాత్రం రోబోల ప్రభావం ఇప్పుడిప్పుడే స్వల్పంగా కనిపిస్తోందట! జర్మనీలో యాంత్రీకరణ ఫలితంగా ఉపాధి రంగంలో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావం ఇతర దేశాలపై పడుతోందట. అయితే, రోబోల వినియోగం వల్ల ఉత్పత్తి రంగానికి పెద్దగా ప్రమాదం లేదని, యువతకు ఉపాధి అవకాశాలు తగ్గే ప్రమాదం లేదని నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ ఇదే పరిస్థితి ఉంది. యూరప్, ఆసియా దేశాల్లో ఆధునిక రీతుల్లో ఉత్పత్తి రంగాలు వృద్ధి చెందుతున్నాయి. ఉత్పత్తి రంగంలో రోబోల సంఖ్య పెరిగినా ఉపాధికి అవకాశాలు తగ్గుతాయని భావించరాదని, అభివృద్ధి చెందిన దేశాలే ఇందుకు నిదర్శనమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కార్మిక ప్రయోజనాలను పరిరక్షించే దిశగా ఆలోచనా విధానాలు ఉన్నపుడు ఉత్పత్తి రంగంలో ఆధునికత ప్రభావం ఉండదని అంటున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా 2015 తర్వాత ఉత్పత్తి రంగాల్లో రోబోలను వినియోగించడం ఊపందుకుంది. ఇంత పెరుగుదల ఉన్నప్పటికీ 2015 నాటికి పారిశ్రామిక రంగంలో రోబోల సంఖ్య 1.6 మిలియన్లుగా ఉంది. 2019 నాటికి ఈ సంఖ్య 2.5 మిలియన్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రోబోల్లో 60 శాతం వరకూ అభివృద్ధి చెందిన దేశాల్లోనే వినియోగిస్తున్నారు. జర్మనీ, అమెరికా, జపాన్‌లో 43 శాతం రోబోలను వాడుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న రోబోల వినియోగంలో ఆసియాకు సంబంధించి మూడు ప్రధాన దేశాలు జపాన్, దక్షిణ కొరియా, చైనాల్లో 40 శాతం రోబోలున్నాయి. మిగతా దేశాలతో పోల్చితే చైనాలో రోబోల వినియోగం అత్యధికంగా ఉంటోంది. పారిశ్రామిక రోబోల వినియోగంలో జపాన్ అగ్రగామిగా ఉండగా, ఆ తర్వాతి స్థానంలో చైనా నిలిచింది.
మన యువతలో నైపుణ్యాల లేమి..
శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్ అద్భుత విజయాలను సాధిస్తున్నప్పటికీ మిగతా దేశాలతో పోల్చితే మన యువతలో సరైన నైపుణ్యాలు లేవని ‘అస్పైరింగ్ మైండ్స్- 2016’ నివేదిక తేల్చి చెబుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో మన ఇంజనీరింగ్ పట్ట్భద్రులు నైపుణ్యం చూపలేకపోవడంతో మంచి ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. ఇంజనీరింగ్‌లో డిగ్రీలు పూర్తిచేసి ‘జాబ్ మార్కెట్’లో అడుగుపెడుతున్న మన కుర్రకారుకు అంతగా డిమాండ్ ఉండడం లేదు. ఆంగ్లంలో ప్రావీణ్యం, కెరీర్ పరమైన నైపుణ్యాలు లేకపోవడమే ఇందుకు కారణాలని తేలింది. బోధనలో లోపం వల్లే భారతీయ యువత నైపుణ్యాలకు దూరం అవుతోంది. ఆంగ్లభాషలో తగిన పరిజ్ఞానం, సబ్జెక్టుల్లో సరైన అవగాహన ఉండడం లేదని అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయగా, 2014లో 18.4 శాతం మంది మాత్రమే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉపాధికి అర్హత సాధించారు. సాఫ్ట్‌వేర్ ప్రాడక్ట్స్‌లో 3.2 శాతం మంది, నాన్ ఫంక్షనల్ రంగంలో (బిజినెస్, అవుట్ సోర్సింగ్) 39.8 శాతం మంది ఉద్యోగాలు పొందారు. 2016లో సాఫ్ట్‌వేర్ సర్వీస్‌లలో 17.91 శాతం మంది, సాఫ్ట్‌వేర్ ప్రాడక్ట్సులో 3.7 శాతం మంది, బిపివో రంగంలో 40.5 శాతం మంది ఉద్యోగాలకు అర్హత సాధించారు. 3.84 శాతం మంది మాత్రమే స్టార్టప్ రంగంలో ప్రతిభ చూపుతున్నారు. రాబేయే మూడేళ్లలో ఐటి తదితర రంగాల్లో ఏడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, అయితే- జాబ్ స్కిల్స్ ఉన్నవారు 20 శాతం మాత్రమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉత్పత్తి, మార్కెటింగ్, రిటైల్, ఎలక్ట్రానిక్ రంగాల్లోనూ పది లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, అయితే వీటికి నైపుణ్యం ఉన్నవారు 40 శాతానికి మించి లేరని తాజా నివేదికలో పేర్కొన్నారు. బోధనలోను, పాఠ్యాంశాలను విద్యార్థులు చదివే తీరులోను మార్పులు వస్తే మన యువతలో నైపుణ్యాలు పెరిగే అవకాశం లేదని నిపుణలు స్పష్టం చేస్తున్నారు. సబ్జెక్టుపైనే కాదు, ఇతర అంశాలపైనా యువత దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు.