యువ

కోరుకున్న కొలువు ఇక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నత విద్యలో, ఉపాధి అవకాశాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న నేటి ఆధునిక యుగంలో తమ కెరీర్‌కు సంబంధించి యువత ఒక నిశ్చితాభిప్రాయం కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ‘డాలర్ల వేట’లో విదేశీ ఉద్యోగాల కోసం పరితపించే వారి సంఖ్య ఇటీవల తగ్గుముఖం పడుతోంది. అమెరికా సహా మరికొన్ని దేశాల్లో అక్కడి పరిస్థితులు, ‘ఉద్యోగాల్లో కోత’ (రెసిషన్) వంటి కారణాల రీత్యా విదేశీ ఉద్యోగాల కోసం మునుపటిలా యువత అర్రులు చాచడం లేదు. మన దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం, ఉత్పత్తిరంగాలకు ఊతం లభించడంతో దేశీయంగా ఉద్యోగాల సంఖ్య పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎలాంటి ఉద్యోగంలో చేరాలనే అంశంపై యువతలో భిన్నాభిప్రాయాలున్నా, సొంత గడ్డపైనే ఉపాధి చూసుకోవాలన్న ధ్యాస యువతరంలో పెరిగినట్లు ఇటీవల జరిగిన ‘టైమ్స్ జాబ్స్ సర్వే’లో తేలింది. తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు భారత్‌లోనే లభిస్తున్నాయన్న సంతృప్తిని సర్వేలో పాల్గొన్న అరవై శాతం మంది ఉద్యోగార్థులు వ్యక్తం చేయడం గమనార్హం. భారీ సంపాదన అన్న కోణంలో తప్ప విదేశీ ఉద్యోగాల్లో అనుకున్నంత సంతృప్తి లేదని చాలామంది అభిప్రాయపడ్డారు. నలభై శాతం మంది మాత్రం తమ చిరకాల వాంఛలు నెరవేరాలంటే విదేశీ ఉద్యోగం ఏకైక మార్గమని భావిస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో సుమారు 1,100 మంది ఉద్యోగార్థులను సర్వే సందర్భంగా ప్రశ్నించగా, వారు తమ మనోభావాలను ఆవిష్కరించారు. 35 శాతం మంది ఉద్యోగార్థులు ఐటి రంగంపైన, 30 శాతం మంది ఆరోగ్య సంరక్షణ, ఉత్పత్తి రంగాలపైన ఆసక్తి చూపారు. బీమా, బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలపై ఇరవై శాతం మంది, రవాణా రంగంపై పదహారు శాతం మంది సుముఖత చూపారు. ఇప్పటికీ అబ్బాయిల్లో అధిక శాతం మంది ఇంజనీరింగ్‌పై, అమ్మాయిలు వైద్యరంగంపై దృష్టి సారించాలని భావిస్తున్నారని సర్వేలో తేలింది. మగవారిలో 25 శాతం మాత్రమే ఆరోగ్య సంరక్షణ రంగంపై ఆసక్తి చూపారు. ఐటి రంగంపై ఇరవై శాతం మంది, చార్టర్డ్ అకౌంటెంట్లుగా రాణించాలని పదిహేను శాతం మంది, న్యాయవాదులుగా స్థిరపడాలని పది శాతం మంది అబ్బాయిలు భావిస్తున్నారు.
ఇక, అమ్మాయిల్లో అయితే ఐటి రంగంపై ఇరవై శాతం మంది, సిఏలుగా సేవలందించాలని ఇరవై అయిదు శాతం మంది, ఇంజనీరింగ్‌పై పదిహేను శాతం మంది, మానవ వనరుల విభాగాల్లో పనిచేయాలని పది శాతం మంది తమ మనోభావాలను ఆవిష్కరించారు. మొత్తం ఉద్యోగార్థుల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా ఐటి, రిటైల్ రంగంపై 15 శాతం మంది ఆసక్తి ప్రదర్శించారు. ఉద్యోగం లభించినప్పటికీ తాము కోరుకున్న సంస్థలో అవకాశం దక్కలేదని సుమారు 70 శాతం మంది తమ అసంతృప్తిని తెలిపారు. ఉన్న ఉద్యోగంతోనే సంతృప్తి చెందుతూ, తమ ఆకాంక్షలకు నీళ్లు వదులుకున్నట్లు ఇరవై అయిదు శాతం మంది తెలిపారు. తమ అర్హతలకు సంబంధించి ఉద్యోగం లభించే పరిస్థితులు దేశీయంగా ఉన్నాయన్న సంతృప్తి చాలామందిలో ఉన్నా, ప్రస్తుతం తాము చేస్తున్న పని తమ ఆశలను నెరవేర్చేదిగా లేదన్న ఆవేదన దాదాపు 55 శాతం మందిలో వ్యక్తం కావడం గమనార్హం. రాని ఉద్యోగం కోసం కాలయాపన చేసే కన్నా, ఉన్నదాంతోనే సంతృప్తి పొందడం ఉత్తమమని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం తమ అర్హతలకు తగినట్లు లేదని 65 శాతం మంది అబ్బాయిలు, 75 శాతం మంది అమ్మాయిలు భావిస్తున్నారు. అయితే- తాము అనుకున్న రంగంలోనే స్థిరపడ్డామన్న భావనను 70 శాతం మంది వ్యక్తం చేయడం విశేషం.
ఐటికి మంచి రోజులు..
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు వెలువడుతున్నందున భారత్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగం వచ్చే ఆర్థిక సంవత్సరం పదిహేనువేల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ‘నాస్కామ్’ అంచనా వేసింది. అమెరికా క్లయింట్ల నుంచి డిమాండ్ పెరగడం, ఆర్థిక రంగంలో సాంకేతిక కోసం వెచ్చించే నిధులను పెంచడం వల్ల ఐటి రంగం మరింత పురోగతిని సాధించే వీలుందని ‘నాస్కామ్’ చెబుతోంది. అమెరికాలో పరిస్థితులు సానుకూలంగా మారుతున్నందున భారత్‌లో ఐటి నిపుణులకు ఉపాధి అవకాశాలు దండిగా ఉంటాయని భావిస్తున్నారు. సరికొత్త డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు భారతీయ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయని, ఈ నేపథ్యంలో దేశీయంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు- కొత్త రియల్ ఎస్టేట్ చట్టం (రెరా), వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) కారణంగా దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో 2025 నాటికి ఎనభై లక్షల మందికి ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన జిడిపిలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 2025 నాటికి రెట్టింపు అవుతుందని అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో గత ఏడాది నాటికి 92 లక్షలుగా ఉన్న ఉద్యోగాల సంఖ్య 2025 నాటికి 1.72 కోట్లకు చేరుకుంటుందని రియల్ ఎస్టేట్ సంస్థ ‘క్రెడాయ్’, ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ సిబిఆర్‌ఇ అంచనా వేశాయి.
రానున్నది ‘ఉద్యోగ పర్వం’!
వచ్చే ఏడాది దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర స్థాయిలో ఆరు లక్షలు, రాష్ట్రాల స్థాయిలో 14 లక్షల ఉద్యోగాల భర్తీకి కేంద్రం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, అనుబంధ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యను మదింపు వేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఈ ఏడాది చివరి నాటికి కొలిక్కి వస్తుందని, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు మొదలవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నత స్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలను రావడంతో భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఇందుకు తగిన సమాచారాన్ని సిద్ధం చేయాలని కేంద్ర కార్మికశాఖ నిర్ణయించింది. కార్మికశాఖ తాత్కాలిక అంచనాల మేరకు పోలీసు విభాగాల్లో 5 లక్షలు, రైల్వేలో రెండున్నర లక్షలు, ప్రాథమిక విద్యలో 5 లక్షలు, అంగన్‌వాడీల్లో రెండు లక్షలు, ఆదాయపు పన్ను శాఖలో 32వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా ప్రధాన శాఖల్లో ఖాళీల వివరాలను సేకరించాక నియామక ప్రక్రియకు తెర లేస్తుందని అధికారులు చెబుతున్నారు.