యువ

‘యాప్’రే.. పేపర్‌బాయ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ కుర్రాడి ఆలోచనకు అద్భుత స్పందన
మీట నొక్కితే చాలు వార్తలు ప్రత్యక్షం
నచ్చిన పత్రికను నచ్చిన వేళలో చూడొచ్చు
పద్దెనిమిదేళ్ల వయసులో ఘనవిజయం

నవ యువ భారతంలో అతడూ ఒకడు...
కానీ- చాలామందికన్నా భిన్నమైనవాడు...
వార్తలు తెలుసుకోవడం అతడికి ఇష్టం..
ఇంట్లో ఉంటే దినపత్రికలు చదివో, టీవీ చూసో వార్తలు తెలుసుకునేవాడు.. అదేమీ పెద్ద సమస్య కాదు... ఎటొచ్చీ స్కూలుకు వెళుతున్నప్పుడు, వచ్చేటప్పుడు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది.. అప్పుడు వార్తలు తెలిసేవి కావు.. అదో పెద్ద సమస్య అతడికి.. పదో తరగతి చదివేటప్పుటి బాధ అది.. ఎప్పుడైనా.. ఎక్కడైనా... ఎలాగైనా వార్తలు తెలుసుకోవడం, ఇష్టమైన పత్రికలు చదువుకోవడం ఎలాగబ్బా..? అన్న సమస్య అతడి మెదడును దొలిచేసేది. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే.. ‘పేపర్‌బాయ్’ మొబైల్ యాప్ రూపకల్పన. పదోతరగతిలో వచ్చిన ఆ ఆలోచన ఐదేళ్లలో పరిష్కారాన్ని కనుగొంది. ఆ పేపర్‌బాయ్ యాప్ సృష్టికర్త పేరు జొన్న వెంకట కార్తీక రాజు. బెంగళూరు అతడి స్వస్థలం. పదో తరగతి చదువుతున్నప్పుడు బస్సులో వెళ్లి వచ్చే సమయంలో తన ఊరిలో, దేశంలో, ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోవడం ఎలా అన్నది సమస్యగా మారింది. అప్పటికప్పుడు పత్రికలు దొరకవు. ప్రపంచం సాంకేతిక విప్లవంలో దూసుకుపోతోంది. మనమేం చేయాలని అనుకొన్నాడు. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లినపుడు- మొబైల్ యాప్ సృష్టిస్తే నెట్‌లోగాని, మొబైల్‌గాని, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో గాని నచ్చిన పేపర్‌ను చూసే వెసులుబాటు కల్పిస్తే ఎలా ఉంటుందని అడిగాడు. ఇది పదిహేనేళ్ల వయసులో వచ్చిన ఆలోచన, సందేహం. ‘దూసుకుపోరా..’ అన్నారు తల్లిదండ్రులు.. అంతే రెట్టించిన ఉత్సాహంతో తన ఇద్దరు మిత్రులతో చర్చించాడు. వారూ ‘సై’ అన్నారు. మూడేళ్లపాటు సమాచారాన్ని సేకరించారు. వ్యాపారంలో మెళకువలు నేర్చారు. మూడేళ్లు గడిచేసరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ముగ్గురూ కలసి ‘పేపర్‌బాయ్’ అన్న మొబైల్ యాప్‌ను సృష్టించారు. దాదాపు 400 పత్రికలు ఆ యాప్ ద్వారా మనం చూడొచ్చు. చదవచ్చు. నచ్చిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పాపప్‌లు, యాడ్‌లు, మధ్యలో అంతరాయాలు లేని విధంగా రూపొందిన యాప్ అనతికాలంలోనే ప్రజాదరణ పొందింది. భారత జనాభాలో దాదాపు 40 శాతం ఉన్న పట్టణాలను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పత్రికలు చదివే అభిలాష, అలవాటు, సాంకేతిక సౌలభ్యాలు ఉన్న ప్రధాన పట్టణాలు, నగరాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. ముగ్గురితో మొదలైన ఈ కార్తీకరాజు బృందంలో ఇప్పుడు పనిచేస్తున్నవారు దాదాపు యాభైమంది. ఇదొక్కటి చాలదా? బాప్‌రే పేపర్‌బాయ్ అనడానికి. గూగుల్ ప్లేస్టోర్‌లో కూడా ఇది అందుబాటులో ఉంది. ప్రజాదరణ చూసి మరిన్ని ఆవిష్కరణలకు కార్తీకరాజు బృందం సిద్ధమవుతోంది. డిజిటల్ సమాచారాన్ని అందిపుచ్చుకోవడంలో ప్రజల ఆసక్తి, అనురక్తిని గమనించి కార్తీక రాజు సరికొత్త రూపకల్పనలకు సిద్ధమవుతున్నారు. మన మొబైల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలలో చూసేందుకు వీలుగా ‘పేపర్‌బాయ్’లో సొంతంగా ఒక న్యూస్‌పేపర్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆండ్రాయిడ్, ఐఒఎస్, ఇంటర్నెట్‌లో ఆ పేపర్‌ను చూసే ఏర్పాట్లు చేస్తున్నారు. మనకు నచ్చిన న్యూస్‌పేపర్‌ను చూడటం, చదవడం అతి సులభం. అదికూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ... కాకపోతే చేతిలో ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే చాలు. మనకు కావలసినన్ని వార్తలు చేతిలో ఉన్నట్లే. స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుండా, సినిమాలు, షికార్లతో కాలక్షేపం చేయాల్సిన వయసులో కార్తీకరాజు ఓ అద్భుతానికి రూపం ఇచ్చాడు. ఇది అపురూపమేగా. సరే అక్కడితో ఆగిపోతే వెంకట్ కార్తీక్ రాజు ఎందుకవుతాడు. ఈ యాప్ వెసులుబాటు ప్రస్తుతం భారత్‌కు పరిమితం. మునుముందు విదేశాలలోనూ తన ఆలోచనలను విస్తృతంగా అమలు చేస్తానంటున్నాడు. అదీ విషయం.

ఇదీ విజయం!

బెంగళూరు సిఎంఎస్ జైన్ కళాశాలలో చదువుతూ ‘పేపర్‌బాయ్’ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసిన కార్తీక వెంకట రాజు తండ్రి పారిశ్రామికవేత్త. స్వతహాగా తనకూ వ్యాపారంపై ఆసక్తి ఉండేదంటాడు కార్తీక్. పేపర్‌బాయ్ యాప్ ఆవిష్కరించాక తొలి ఏడాదిలో కనీసం లక్షమంది వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యం పెట్టుకున్న ఆ బృందం మొదటి నాలుగు నెలల్లోనే అది సాధించింది. ఏడాదిలోగా 6 లక్షల మైలురాయిని దాటింది. పత్రికల్లో వచ్చే ప్రకటనలను కూడా డిజిటల్ రూపంలో ఇవ్వడం ద్వారా ఆదాయం సాధిస్తోంది. ఎనిమిది నిమిషాల పాటు తన యాప్ ద్వారా పత్రికలు చూసే వినియోగదారులు ఎక్కువ. రోజుకు 11 వేల వార్తలు డౌన్ లోడ్ చేస్తున్నారు.
16.7 మిలియన్ పేజెస్ చదువుతున్నారు. డిజిటల్ రూపంలో ఆన్‌లైన్‌లో, మొబైల్ లభ్యమవుతున్న సమాచార స్రవంతిని అందించే ‘పేపప్ బాయ్’ యాప్ ద్వారా తాజాగా ‘రీడర్స్ డైజెస్ట్’ కూడా అందుబాటులోకి వచ్చింది. పత్రికలను పట్టుకుని చదివే అలవాటు ఉన్న భారతీయులు ఈ డిజిటల్ సౌకర్యాన్ని ఆదరిస్తారా లేదా అన్న భయం ఉండేదని, కానీ సమాజంలో వస్తున్న సాంకేతిక విప్లవంపై నమ్మకం, దానికి ప్రజలు అలవాటు పడటాన్ని అంచనావేసి ఈ విజయం సాధించానని చెబుతున్నాడు కార్తీక్. త్వరలో అమెరికా, యుఎఇ పత్రికలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు పెట్టుబడులు పెంచను కానీ సరికొత్త ఆవిష్కరణలకు రంగం సిద్ధం చేస్తానంటున్నాడు ఈ యువకుడు అన్నట్లు కేవలం 18 ఏళ్ల వయసులో వచ్చిన ఆలోచనకు పదిహేను నెలల్లో ఆచరణలో చేసి చూపిన ఈ యువకుడు ఇప్పటికే విజయం అంటే ఏమిటో నిరూపించాడు.

-ఎస్.కె.రామానుజం