యువ

ఈ ఫ్రీడమ్ ఉత్తిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం భారత్‌తో పాటు పలు దేశాల్లో ఏ నోట విన్నా ‘ఫ్రీడం-251’ స్మార్ట్ఫోన్ మాటే వినిపిస్తోంది. ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ఫోటోలు దిగువ మధ్యతరగతి ప్రజలు మొదలుకొని అట్టడుగు స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలను ఊరిస్తున్నాయి. కేంద్ర మంత్రుల చేతుల మీదుగా కొద్ది రోజుల క్రితమే ఈ స్మార్ట్ఫోన్‌ను ఆవిష్కరించిన నోయిడా సంస్థ ‘రింగింగ్ బెల్స్’ ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో కేవలం 251 రూపాయలకే దీనిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చేసిన ప్రకటనలే వీరి ఆశలకు కారణం. అయితే మొబైల్ ఫోన్ వినియోగదారులకు కనీసం ఒక మోస్తరు నాణ్యత కలిగిన స్క్రీన్‌గార్డ్‌ను కూడా అందించలేని ఇంత తక్కువ ధరలో ఏకంగా 3జి స్మార్ట్ఫోన్‌నే అందుబాటులోకి తీసుకురావడం ఎలా సాధ్యమని కొంతమంది ప్రశ్నిస్తుంటే, కాపీరైట్ హక్కులను ఉల్లంఘించి ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న తమ స్మార్ట్ఫోన్లకు అచ్చమైన నకలుగా ‘ఫ్రీడమ్- 251’ను రూపొందించారని ప్రపంచ ప్రఖ్యాత ‘ఐఫోన్’ తయారీదారు ‘యాపిల్’తోపాటు మరికొన్ని ఇతర స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో ‘రింగింగ్ బెల్స్’ కేవలం కొద్ది గంటల్లోనే ‘ఫ్రీడం-251’ ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేయడంతో అసలు ఈ స్మార్ట్ఫోన్ నిజంగా భారత్‌లోనే తయారైందా?, ఇందులో ఏదైనా కుంభకోణం దాగివుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కారణాలు ఏవైనా ఈ వివాదాలు, అనుమానాలు అందరినీ నీరుగారుస్తున్నాయి.
వాస్తవానికి ఈ ఫోను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ‘యాపిల్’ ఐఫోన్‌కు అచ్చమైన నకలుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ‘ఫ్రీడం- 251’ కింది భాగంతోపాటు దాని సర్క్యులర్ టచ్ ఐడి, సాఫ్ట్‌వేర్ ఐకాన్లు ‘యాపిల్’ తాజా మోడళ్లయిన ఐఫోన్-6, ఐఫోన్-6 ఎస్‌లను అచ్చుగుద్దినట్లు ఉన్నాయి. అంతేకాకుండా ‘ఫ్రీడం-251లోని డయలర్ యాప్, కెమెరా, కాలిక్యులేటర్, క్లాక్, బ్రౌజర్, మెసేజ్‌లను కూడా ‘యాపిల్’ ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఐఓఎస్’ నుంచే కాపీ కొట్టినట్లు కనిపిస్తోంది. అయితే ‘ఫ్రీడం-251’ తమ సొంత వెబ్‌సైట్ (ఫ్రీడం251.కామ్)లో పోస్టు చేసిన ఫొటోలో కనిపిస్తున్నట్లుగా ఈ స్మార్ట్ఫోను లేకపోవడం గమనార్హం.
మరోవైపు న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ ఐటి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న ‘యాడ్‌కామ్’ సంస్థ బ్రాండ్‌తో ‘ఫ్రీడం-251’ను రూపొందించారన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ రకం స్మార్ట్ఫోన్‌ను ‘యాడ్‌కామ్’ ఇప్పటికే సుమారు 4 వేల రూపాయల ధరతో ‘అమెజాన్’, ‘స్నాప్‌డీల్’, ‘షాప్‌క్లూస్’ వంటి పలు ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో లిస్ట్ చేసింది. అయినా తమ బ్రాండ్‌ను ‘రింగింగ్ బెల్స్’ ఉపయోగించుకోవడంపై ‘యాడ్‌కామ్’ పెదవి విప్పకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా సమీక్ష నిమిత్తం ‘రింగింగ్ బెల్స్’ కొంతమంది విలేఖరులకు ఇచ్చిన ‘ఫ్రీడం-251’ ఫోన్లపై ‘యాడ్‌కామ్’ బ్రాండ్‌ను వైట్‌నర్‌తో చెరిపేసి ఉండటంతో అసలు నిజంగా ఈ స్మార్ట్ఫోన్ భారత్‌లోనే తయారైందా? దీనివెనుక ఏదైనా కుంభకోణం దాగి ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ‘రింగింగ్ బెల్స్’ ప్రకటించినట్లుగా 251 రూపాయలకే ‘ఫ్రీడం-251’ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వస్తుం దా? లేదా? అన్న ప్రశ్నలు అందరినీ తొలిచేస్తున్నాయి.

-ఉజినీ రాజేష్