జాతీయ వార్తలు

మోదీ ధర్మం ఇదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 4: ‘నరేంద్ర మోదీ ఎప్పుడూ హిందూ ధర్మం గురించి చెబుతుంటారు. హిందూ ధర్మ పరిరక్షకుడని చెబుతుంటారు. కానీ ఆయన కోట్లాది మంది ఆరాధించే తిరుమల వెంకటేశ్వరస్వామి సమీపంలో సభ నిర్వహించి ఆంధ్ర రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత హోదా ఇవ్వకుండా మోసం చేశారు. హిందు ధర్మం గురించి మాట్లాడే మోదీ మీకు అబద్ధం చెప్పినట్లే కదా? ఇదేనా మీరు పాటించే ధర్మం? మరి హోదా ఇవ్వని కేంద్రంపై చంద్రబాబు, జగన్‌రెడ్డి ఎందుకు పోరాడరు? మాతో కలసి ఎందుకు ఉద్యమించడం లేద’ని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని భరోసా ఇచ్చారు. ఏపిసిసి ఆధ్వర్యాన గుంటూరు ఆంధ్రా ముస్లిం కాలేజీ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన ‘ప్రత్యేక హోదా భరోసా సభ’కు రాహుల్‌తో సహా ఎన్డీయేతర రాజకీయ పక్షాల నేతలు హాజరయ్యారు. జెడియు నేత శరద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఐ సీనియర్ నేత డి.రాజా, ఆర్జేడీ ఎంపి రాంనారాయణ్ యాదవ్, డిఎంకె ఎంపి ఇలంగోవన్‌లు హాజరయ్యారు. మూడేళ్లలో మోదీ సర్కారు కేంద్రంలో వ్యవహరిస్తున్న తీరుపై వీరు తీవ్రంగా మండిపడ్డారు. మోదీ, షాలు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఏపికి హోదా ఇవ్వటంలో ఎన్డీయే సర్కారు ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. ఏపికి హోదా విషయంలో తాము ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో ప్రధాన భూమిక నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు-జగన్ ఇద్దరూ మోదీని చూసి భయపడుతున్నారని, కానీ ఇక్కడ హాజరైన జాతీయ పార్టీ నేతలెవరూ మోదీకి భయపడరని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వ నిధులతోనే పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మిస్తామని, ఎంత ఖర్చయితే అంతా కేంద్రమే ఇస్తుందని తాము విభజన బిల్లులో పెడితే, దాన్ని కూడా మోదీ-బాబు తూట్లు పొడిచారని విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మిస్తే రాష్ట్రానికే లాభం. కానీ చంద్రబాబునాయుడు తన పార్టీ వారికి కాంట్రాక్టులు, కమిషన్ల కోసం ఆశపడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేలా మోదీని ఒప్పించారు. మరి ఈ విషయంలో మోదీ ఏ ప్రలోభానికి, ఏ ప్రభావానికి గురయ్యారో’నని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తనకు తెలిసి ప్యాకేజీ కంటే హోదాతోనే లాభమని రాహుల్ విశే్లషించారు. సహజంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో 70శాతం రుణం, 30శాతం గ్రాంట్లు ఉంటాయని, కానీ హోదా వల్ల మొత్తం తిరిగి చెల్లించనవసరం లేని గ్రాంట్లే వస్తాయని, అయినప్పటికీ, చంద్రబాబునాయుడు, జగన్‌రెడ్డి ఎందుకు వద్దంటున్నారో? హోదా కావాలని ఎందుకు పోరాడటం లేదో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ‘హోదా కోరకుండా ప్యాకేజీ కోరుకుంటున్నారు. డబ్బులున్న ఆ ఇద్దరు హోదాతో వచ్చే డబ్బు కాకుండా ప్యాకేజీలతో వచ్చే డబ్బు ఎందుకు కావాలంటున్నారో మీకు అర్థమయ్యే ఉండాలి’ అని వ్యంగ్యాస్త్రం సంధించారు.
మోదీ స్వచ్ఛ్భారత్ ప్రచారాన్ని ఉదరగొడుతున్నారని, తాను వస్తున్న మార్గంలో ఒక దారంతా చెత్తతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ్భారత్ పేరు చెబుతున్న మోదీ ప్రచారమంతా కెమెరాలు, వీడియోల కోసమేనని, ఆయనకు చీపురు పట్టుకోవడం కూడా రాదని, మీరు చీపురుపట్టుకుని స్వచ్ఛ్భారత్ చేయండి, నేను విదేశాలకు వెళ్లొస్తానంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. మోదీ 56అంగుళాల ఛాతీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేక పోతోందని రాహుల్ నిలదీశారు. మేకిన్ ఇండియా ప్రచారంతో ఊదరగొడుతున్న మోదీ, ఎన్నికల్లో 2కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పి లక్షమందికే ఇచ్చారని గుర్తు చేశారు.
రాష్ట్రానికి హోదా ఇస్తున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్ సభలో చెబితే, దానిని సాధించుకోవడం టిడిపికి, ఇవ్వడం బిజెపికి చేతకాలేదని ఎద్దేవా చేశారు. ‘అప్పుడు సభలో హామీ ఇచ్చింది మన్మోహన్ కాదు. ప్రధాని. ఒక ప్రధాని హామీ ఇస్తే తర్వాత వచ్చే ప్రభుత్వం దానిని అమలుచేయాలి. బిజెపి సర్కారు అలా చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. అయినా మీకోసం, రాష్ట్రానికి హోదా వచ్చే వరకూ మేమంతా మీ వెంటే ఉంటాం. మేం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి హోదా ఇస్తాం’అని హామీ ఇచ్చారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు యుపిఏ తీసుకువచ్చిన భూసేకరణ చట్టానికి, మూడుసార్లు సవరణ తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తే మూడుసార్లూ తామంతా అడ్డుకున్నామని, కానీ ఏపిలో బాబు ప్రభుత్వం దానినే తీసుకువచ్చిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు ఒప్పుకుంటేనే భూమి తీసుకోవాలని, వారి భూములకు మార్కెట్ ధర ఇచ్చి తీసుకోవాలని చట్టం తీసుకువస్తే, మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు సాగిలబడి, రైతును దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జెడి శీలం, పల్లంరాజు, ఎంపి కెవిపి రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఏఐసిసి కార్యదర్శి శైలజానాధ్, మస్తాన్‌వలి, మాజీ ఎంపి బాపిరాజు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, గంగాభవాని తదితరులు హాజరయ్యారు.

ఆదివారం గుంటూరులో జరిగిన ప్రత్యేక హోదా భరోసా సభలో ఎన్‌డియేతర పక్ష నేతల సంఘీభావం