రాష్ట్రీయం

రిజర్వ్‌డ్ సీట్లపై కాంగ్రెస్ ‘ఐ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తిరిగి అధికారం చేపట్టేందుకు టి.కాంగ్రెస్ ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తున్నది. ఇందులో భాగంగానే తొలుత ఎస్‌సి, ఎస్‌టి రిజర్వ్‌డ్ స్థానాలపై దృష్టి సారించింది. పంజాబ్ రాష్ట్రం తరహాలో తెలంగాణలో ‘సూపర్-31 మిషన్’ పేరిట బుధవారం ‘ఎస్‌సి, ఎస్‌టిల కోసం రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో నాయకత్వ లక్షణాల పెంచే లక్ష్యం (ఎల్‌డిఎంఆర్‌సి)’గా శిక్షణా తరగతులను ప్రారంభించింది. ఈ శిక్షణా తరగతుల్లో ఎఐసిసి ఎస్‌టి (ఆదివాసి) విభాగం చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్, ఎఐసిసి ఎస్‌సి విభాగం చైర్మన్ కొప్పుల రాజు, ఎఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నాయకత్వ లక్షణాలపై టి.పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ సుమారు గంట సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
లక్ష సైనికులను సిద్ధం చేయాలి: కొప్పుల
కొప్పుల రాజు మాట్లాడుతూ పంజాబ్ అసెంబ్లీలో 117 సీట్లు ఉంటే, అందులో 30 రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తొలుత ఆ రిజర్వ్‌డ్ స్థానాలపై దృష్టి సారించి ‘సూపర్-30 మిషన్’ పేరిట అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ మిషన్‌లో భాగంగా పార్టీ బలోపేతానికి పోలింగ్ కేంద్రం వరకూ కమిటీలను నియమించడం, ప్రతి ఇంటి గడపకూ పార్టీ కార్యకర్తలు వెళ్ళి బాగోగులు తెలుసుకోవడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, దీంతో ఆ ప్రయోగం విజయవంతమై 30 స్థానాల్లో 20 కాంగ్రెస్ కైవసం చేసుకున్నదని ఆయన వివరించారు. తెలంగాణలోనూ ‘సూపర్-31 మిషన్’ చేపట్టి 30 రిజర్వ్ స్థానాలు కైవసం చేసుకోవాలని ఆయన అన్నారు. 31 రిజర్వ్‌డ్ స్థానాల్లో ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మంది ముఖ్య నాయకులకు శిక్షణ ఇచ్చి, మొత్తం లక్ష మందితో సైనాన్ని తయారు చేయాలని ఆయన సూచించారు.
రిజర్వ్ కాని సీట్లపైనా: కిశోర్
కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ప్రసంగిస్తూ రిజర్వ్ కాని సీట్లపైనా దృష్టి సారించి ఇదే విధంగా శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. జనరల్ సీట్లలో ఎస్‌సి, ఎస్‌టిలు గెలుపొందడాన్ని ఆయన ఉదహరించారు. 60 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమి చేసిందని ప్రధాని మోదీ ప్రశ్నించారని ఆయన చెబుతూ నాగార్జున సాగర్ మోదీ కట్టారా? అని ప్రశ్నించారు. మాజీ ఎంపి విహెచ్ కల్పించుకుని రిజర్వ్ స్థానాల్లో అగ్రకులాల పెత్తనం గురించి ప్రశ్నించగా, కిశోర్ చంద్రదేవ్ స్పందిస్తూ అటువంటిదేమైనా ఉంటే తన దృష్టికి తేవాలని చెప్పారు.
ఈ సమావేశంలో ఎఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా, ఎఐసిసి ఎస్‌సి విభాగం కన్వీనర్ డాక్టర్ సిరివెల్ల ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపిలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ. మోహన్ ప్రసంగించారు.
చిత్రం: బుధవారం గాంధీభవన్‌లో ‘ఎస్‌సి, ఎస్‌టిల కోసం రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో నాయకత్వ లక్షణాల పెంచే లక్ష్యం’గా నిర్వహించిన శిక్షణా తరగతుల్లో పాల్గొన్న కిశ్‌ర్ చంద్రదేవ్, కొప్పుల రాజు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కుంతియా