కృష్ణ

బందరు పోర్టుకు తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 22: బందరు ఓడరేవు నిర్మాణానికి తొలి అడుగు పడింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మండల పరిధిలోని మంగినపూడి గ్రామంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడతగా 262 ఎకరాలకు సంబంధించి 112 మంది రైతులకు రూ.83లక్షల మేర కౌలు చెక్కులను రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చేతుల మీదుగా అందజేశారు. ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కౌలు చెల్లింపుతో ప్రతిపక్షాలు చేస్తున్న విషప్రచారానికి అడ్డుకట్ట వేశామన్నారు. ఓడరేవు నిర్మాణం విషయంలో ఇకపై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని రైతులు నమ్మే పరిస్థితి ఉండదన్నారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులందరికీ ఇకపై ప్యాకేజీలో పేర్కొన్న విధంగా ప్రతి యేటా కౌలు చెల్లించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ తొలి నుండి పోర్టు నిర్మాణం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ వచ్చిందన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సాగరమాల కింద పోర్టు నిర్మాణానికి టెండర్లు పిలవగా సింగిల్ టెండరు రావటంతో నిర్మాణానికి నోచుకోలేదన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన పోర్టును గోగులేరుకు తరలించిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సంఘాలను కలుపుకుని ఉద్యమించామన్నారు. ప్రజా ఉద్యమానికి తలొగ్గిన రాజశేఖరరెడ్డి బందరులోనే పోర్టు అని నమ్మబలికి మొక్కుబడిగా శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి కూడా మాయమాటలతో బందరు ప్రజానీకాన్ని మోసగించి పోర్టును అటకెక్కించారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు నిర్మాణం దిశగా అడుగులు వేశామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక లోటు కారణంగా ప్రభుత్వానికి, రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ఒక్క పోర్టుతో అభివృద్ధి సాధ్యంకాదని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టుతో పాటు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 33వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు పూనుకున్నారన్నారు. 33వేల ఎకరాల్లో 14వేల ఎకరాలు మాత్రమే పట్టా భూములు ఉన్నాయన్నారు. పోర్టు భూములకు తొలి ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశగా భూసమీకరణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 3వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించడం జరిగిందన్నారు. సుమారు 600 ఎకరాల వరకు రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. తొలి విడతగా 247 ఎకరాలకు సంబంధించి 112 మంది రైతులకు కౌలు చెల్లింపునకు శ్రీకారం చుట్టామన్నారు. కౌలు చెల్లింపుతో మిగిలిన రైతుల్లో కూడా పోర్టు నిర్మాణం పట్ల నమ్మకం ఏర్పడిందన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం పోర్టును అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొడుతుండటం బాధాకరమన్నారు. పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్న ఆలోచన ఏ మాత్రం ప్రతిపక్షానికి లేదన్నారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షం లక్ష్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రైతుల త్యాగంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రాజధానిని నిర్మించుకోగలిగామన్నారు. అదే రైతుల త్యాగంతో బందరు అభివృద్ధికి పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. రైతుల త్యాగాన్ని ఎన్నటికీ ఈ ప్రభుత్వం మరువదన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో ఎంతో మంది రైతులు మేజర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి తమ భూములను స్వచ్ఛందంగా ఇస్తున్నారన్నారు. బందరులో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడటం హర్షణీయమన్నారు. ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, గోపిచంద్, పార్టీ నాయకులు కుంచే దుర్గా ప్రసాద్, తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.