కరీంనగర్

హమ్మయ్యా..ఎట్టకేలకు ఛాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 23: రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆకర్షణీయ నగరాల (స్మార్ట్‌సిటీ) జాబితాలో కరీంనగర్ నగరం చేరిపోయింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం కేంద్ర పట్టణాభివృద్థి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మూడవ జాబితాను విడుదల చేశారు. రెండేళ్లుగా ఇటు ప్రజాప్రతినిధులు, అటు మున్సిపల్ అధికారులు చేసిన కృషి, ప్రయత్నాలు ఫలించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, కరీంనగర్ నగరంలో సంబరాలు హోరెత్తాయి. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బిజెపి ప్రభుత్వం వంద నగరాలను ఆకర్షణీయ నగరాల (స్మార్ట్‌సిటీ)గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల పేర్లను కేంద్రానికి ప్రతిపాదించింది. 2015లో ప్రకటించిన తొలి జాబితాలో హైదరాబాద్‌కు నూటికి 90శాతం మార్కులతో, వరంగల్‌కు నూటికి 87.50శాతం మార్కులతో స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కించుకోగా, 85శాతం మార్కులతో కరీంనగర్ దక్కించుకోలేకపోయింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చొరవ తీసుకొని స్మార్ట్‌సిటీ జాబితాల నుండి హైదరాబాద్‌ను తొలగించి ఆ అవకాశాన్ని కరీంనగర్‌కు కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే, సకాలంలో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్)ను సకాలంలో కేంద్రానికి అందించకపోవడంతో 2016లో విడుదల చేసిన రెండవ జాబితాలో కూడా కరీంనగర్‌కు అవకాశం దక్కలేదు. మూడవ జాబితాలోనైనా కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చే లక్ష్యంతో కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌లతో కలిసి నగరంలో వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి, వారి నుంచి సూచనలు, సలహాలను తీసుకున్నారు. సకాలంలోనే డిపిఆర్‌ను రూపొందించారు. ఆకర్శనీయ నగరంగా తీర్చిదిద్దడానికి రూ.1878 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇందులో పరిమిత ప్రాంత అభివృద్ధికి రూ.1410 కోట్లు, పట్టణ వ్యాప్త టెక్నాలజీ ఆధారిత ప్రతిపాదనలకు రూ.468 కోట్లు అంచనా వేశారు. డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను మార్చి 30న ఢిల్లీలోని స్మార్ట్‌సిటీ మిషన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సంజయ్‌శర్మకు మేయర్ రవీందర్‌సింగ్, కమీషనర్ శశాంక అందజేశారు. మూడవ విడత స్మార్ట్ సిటీ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్న దరిమిలా ఇప్పటికే మంత్రి కెటిఆర్ వెంకయ్యనాయుడును స్వయంగా కలిసి కరీంనగర్‌కు అవకాశం కల్పించాలని కోరారు. అటు ఎంపి వినోద్‌కుమార్ ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేయగా, మూడవ విడతలో ఖచ్చితంగా అవకాశం దక్కుతుందనే ఆశతో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, కమీషనర్ శశాంక్‌లు గురువారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక అందరు ఆశించినట్లుగానే శుక్రవారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించిన స్మార్ట్‌సిటీ జాబితాలో కరీంనగర్ నగరానికి చోటు దక్కింది. కరీంనగర్‌కు చోటు దక్కిన నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న సిఎం కెసిఆర్‌ను ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌లు కలిసి పుష్పగుచ్ఛాలను అందించి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్రంగా ప్రయత్నించిన ప్రయత్నం ఫలించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా ప్రకటించిన దరిమిలా ఇటు బిజెపి, అటు టిఆర్‌ఎస్ శ్రేణులు శుక్రవారం నగరంలో డప్పుచప్పుళ్లు వాయిస్తూ, టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ సంబరాలను హోరెత్తించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు సైతం సంబరాలు జరుపుకున్నారు.