రాజమండ్రి

‘కాలం దోసిలిలో’ సామాజిక దర్పణం (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజాన్ని నిశితంగా పరికించే వ్యక్తి కవి అయితే అతని కలం నుంచి వచ్చే రచనలు ఉన్నతంగానే ఉంటాయి. కాగితాన్ని తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నింపుతారు. కనుక వారి రచనల్లో అంతులేని ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఉత్తమ ఉపాధ్యాయునిగానే కాకుండా ఉత్తమ రచయితగా సమాజ హితం కోసం పాటుపడుతున్నవారు పిడుగు పాపిరెడ్డి గారు. నిరంతర సాహితీ సేవ చేస్తున్న ఆయన ఇటీవల వెలువరించిన కవితా సంపుటి ‘కాలం దోసిలిలో’ యాబది ఆరు కవితల హారం! ఇది పాఠకుడు మెచ్చే కవితల పుస్తకం. దేశంలోని తీవ్రవాదం, దాని పర్యవసానాలను తనదైన శైలిలో వ్యక్తీకరించారు పాపిరెడ్డి. ‘చిన్నదానికి, పెద్దదానికీ సామాన్యుడినైతే ‘బొక్కలో వేసి బొమికలేరేస్తాం’ అంటారు.. అదే పార్లమెంట్ పేలినా, మందిరాలు కూలినా, బస్సులను తగలేసినా, మానం దోచినా, వరుస పేలుళ్లతో వణికించినా ‘చుట్టాలు’గా చూసుకుంటారు కొందరిని.. ధర్మాధర్మ విచక్షణలో యమధర్మరాజుగ మిగలాలి.. లేదంటే ఉత్తోడి చేతుల్లో పుత్తడి కూడ ఇత్తడి అవుతుంది.. జాతి నీతి తప్పి నిర్జీవం అవుతుంది’ అని ప్రబోధించిన కవిత (న్యాయో రక్షతి). ఉన్న ఊరు, కన్నతల్లి, సాకిన దేశం అందరూ ద్రోహిగ చూసుకున్నారు. ‘ఎందుకీ రత్తపాతం, ఎందుకీ దాష్టీకం/ గమ్యం తెలియక గమనం తప్పి నిర్భాగ్యులను నిర్మూలించటం నీచత్వం/ నీవు మనిషివైతే నా అక్షరాలు సూర్యోదయాలై/ నీ అంతరంగాన్ని మధిస్తాయి/ జీవిత గవాక్షం గుండా ఉషోదయాలై మేల్కొలుపుతాయి’ అంటారాయన.
ప్రపంచీకరణ నేపథ్యంలో సంస్కృతీ సంప్రదాయాలు మంటగలుస్తున్న నేటి సమాజంలోని పరిస్థితులను కొన్ని కవితల్లో వివరించారు పాపిరెడ్డి. కొట్టుకుపోతున్న ఆచార వ్యవహారాలు, సభ్యత, సంస్కృతి, సంప్రదాయాలు, మాయమవుతున్న వృత్తులు, విత్తనాలు, ఉత్పత్తులు, విద్య, వైద్యం, కొత్తగా వచ్చిన కామక్రోధాలు, క్లబ్బులు, పబ్బులు, స్వలింగ సంపర్కులు, సహజీవనం, అద్దెగర్భాలు, మమీ-డాడీ పిలుపులు, వీటన్నిటి మధ్య వేలాడుతున్న సజీవ శవంలా ‘ఓ తల్లీ! నీ విశ్వరూపాన్ని ఉపసంహరించి.. మా పూర్వరూపాలు మాకిచ్చెయ్యి’ అనే వేడుకోలుతో నేటి సమాజ వైచిత్రి, మాయాజాలాల్ని అద్భుతంగా వివరించారు. ‘సభ్యత, సంస్కారాలను సమాధి చేస్తున్న వాలెంటైన్స్ డేలు, కామసూత్రాలు, ఛానళ్ల కార్యక్రమాలు, నాయకుల హాస్యపు మాటామంతీ, నాటుబాంబు దాడులు, బరితెగింపుతనం, అంగాంగ ప్రదర్శనలు, మందు-మగువలపై ఆకర్షణ.. ఇదా నేటి భారతం! ఇవికావు- మన పూర్వీకులు చెప్పిన నోటి అదుపు, సభ్యత, సంస్కారాలు, నీతి నిజాయితీలు- ఇవికదా నిజమైన ఆస్తి’ అంటూ మారిన విలువలపై వేదన వ్యక్తపరుస్తారు. సభ్యసమాజంలో మనిషి తత్వానికి మనుగడే లేదంటూ అక్షరీకరించిన కవితల్లో ‘వాడు ఒక్కడే, ముఖాలనేకం/ ప్రయోజనాలను పక్కన పెట్టటం/ పొంచి కాటెయ్యటం/ అందనివాటిని పొందాలనటం వాడి వృత్తి, ప్రవృత్తి/ అన్నీ వాడే పొందాలనే స్వార్థం/ వంచనతోనైనా మోసాలతో సాధించటం/ నవ్వును పులుముకొని వదిలెయ్యటం/ ఇవన్నీ వాడి నైజం/ వాడెవడో కాదు నువ్వు, నేను/ నిలువెల్లా మారాల్సిన మనిషి!’ అని చాటారు. ఆశల సౌధంలో కోర్కెల గోళ్లు.. దాచినదంతా దోచి ఆషాఢభూషిలా వ్యవహరిస్తున్నాడు మనిషి. తన ఆరని ఆకలి జ్వాల రైతుదని, తను లాగుతున్న చీర తన తల్లిదని, దోచుకున్న శీలం ఒక చెల్లిదని, కొట్టిన కడుపు ఒక తమ్ముడిదని తెలియదా? నిన్ను నువ్వు దోచుకోకు.. మానవత్వాన్ని మరచిపోకు’ అని హితవు పలికారు. ‘కోరికల గుర్రాల్ని అదుపులో ఉండనీ/ ఆరాటపడితే ముల్లులా గుచ్చుకుంటాయి/ కొట్టేకొద్దీ పుడుతూనే ఉంటుంది/ అందుకే మూలాల్ని తీసేస్తేగానీ కోరిక తీరదు/ ఎక్కడమ్మా చంద్రుడు/ ఒక్కడైనా కానరాడు మంచోడు/ విశ్వాసపు కుక్కలు బుక్కెడు బువ్వను/ గంపెడు బరువు మోసే గాడిదను గరికపాసలను/ తురంగానికి పిడికెడు గుగ్గిళ్లను/ ఆరుగాలం కష్టపడి అరక దునే్న ఎద్దుకు గంపెడు గడ్డిని ఎరవేసి అన్నిటినీ వాడేసి వదిలేసే మనిషి/ ప్రకృతి మారాలి.. వాటిని ఆదరించాలి’ అంటూ జీవకారుణ్యాన్ని ప్రబోధించిన కవిత ‘ప్రవృత్తి’. ‘కలలు, ఆశల మీద ప్రయాణం చేస్తూ నేటి మనిషి తనను తాను కాపాడుకోటానికి అడ్డదారిన గడ్డి మేస్తున్నాడు/ అందుకే ధర్మం మారిందేమో! అలనాడు జన్మ మనదే.. జీవితం దేశానిది- అన్న జాతి/ నేడు జన్మ మనదే, దేశం మనదే దోచుకోడానికి, దాచుకోడానికి/.. అంటూ ధర్మసూత్రాలను కొత్తగా అన్వయించుకుంటోంది’ అంటారు కవి ‘భ్రమ, భ్రాంతి, బతుకు’ అనే కవితలో. నేటి పరిస్థితులకు అద్దంపట్టేలా కవితలు రాశారు ఈ పుస్తకంలో. ‘దారితప్పిన భావదారిద్య్రానికి సాక్ష్యాలు/ గురువుల కామాగ్ని, పంతులమ్మల శీలవేలం/ ప్రేమాగ్నిలో యువతులు, నోళ్లుకొట్టే నేతలు/ అధికార కామాంధులు, అమ్మను అనాథాశ్రమాల పాల్జేసే తనయులు/ తనయులను పాతేసే తల్లులు.. ఇలా దారితప్పిన జనం/ అందుకే చీకట్లు వచ్చిన స్వాతంత్య్రానికి సూర్యోదయం రావాలి’ అన్నారు ‘ఏదారి’ కవితలో. ‘ఉపకారోపకారాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలై నీతిని పణంగా పెట్టిన అధికారులు/ నీలిచిత్రాల మోజులో యువతరం/ హక్కుల పోరాటాల్లో ఉద్యోగులు/ దిక్కులేక మానవత వెక్కివెక్కి ఏడుస్తోంది’ అంటారు ‘మానవత మంచాన పడింది’ కవితలో పాపిరెడ్డి.
నేటి జీవితం ఎలావుందో చెపుతూ ‘ఓ సామాన్యుడా! నీవేమైనా నాయకుడివా, అధికారివా, కాంట్రాక్టరువా, వ్యాపారివా, గూండావా, కబ్జాదారుడివా దర్జాగా బతకడానికి/ అందుకే బతకాలంటే బకాసురుడిలా మారు/ సామాన్యుడిలా బతకలేవు/ ఈ విశాల విశ్వవేదిక మీదికి ఎవడో ఒకడు వస్తాడు/ ఏదోఒకటి చేస్తాడు/ సృష్టి నిరంతరం/ చంద్రుడిని వదలని భూమి/ సూర్యుణ్ని కలిసే సంధ్య/ ఇలా అన్నీ నిరంతర పాత్రలే సూత్రధారి ముందు’ అంటారు ‘వేదిక’ కవితలో. ‘చొరవగా పైకొచ్చేవాడిని చూసి ఏడవకు/ వాడి సిరులను చూసి నీ దారిద్య్రశోకాన్ని మరచి మనసారా హర్షించవయ్యా/ ఎందుకయ్యా ఏడుస్తావ్’ అని హితబోధ చేస్తారు. నేటి పాలకులు ప్రజలను ఎనలేని కష్టాలకు గురిచేస్తుంటే ‘ఓ దేవుడా! నిన్ను నిలువునా పాతరేసి నీ బొమ్మకు పూజలు చేస్తున్నారు/ ఎవరూ వారి అధికారాలను ఉపయోగించటంలా’ అని చెపుతారు ‘జనతా నేతలు’ కవితలో. ‘శివమెత్తిన శిశిరాలే కాని, చిగిర్చిన వసంతాలేవి? బిడ్డలున్న గొడ్రాళ్లే కాని, పుత్రోత్సాహం పొందే తల్లులేరి? బిడ్డలు పచ్చని పైరును మేసే బర్రెపడ్డల్లా కీచకులుగా సమాజంలో సంచరిస్తుంటే/ శాంతిపావురాల జాడేది! అడ్డదారిలో నడిచి జాతి నడ్డివిరిచే బిడ్డలను నరికే సత్యభామలు, కాళదుర్గలు కావాలి సమాజానికి’ అంటూ ‘సత్యభామలు రావాలిప్పుడు’ కవితలో సందేశమిచ్చారు. ప్రలోభాలకు గురవుతున్న వ్యవస్థలోని ప్రజల లోపాలు ఎత్తిచూపుతూ ‘సంపాదించుకున్న స్వాతంత్య్రం పరతంత్ర ప్రజాస్వామ్యమైంది/ పెద్దలు విందుకు కూర్చుంటే జాతి సంపదంతా భోజనంగా డిన్నరు ప్లేట్లో ఒదిగింది/ జాతిపితలు, శాంతిదూతలు, సర్దారులు, శాస్ర్తిలు వీరికి తెలియదు/ చట్టాలను చుట్టాలుగా మార్చుకున్న వీరిది గూండాల నీడ, మాఫియాల మేడ/ కన్నతల్లిలా కాపాడే ప్రభుత్వం రావాల’నేది కవిగారి ఆక్షాంక్ష.
ఆడపిల్లలపై అఘాయిత్యాలు, చీకటి రాజ్యాలు, వృద్ధాప్యంలో జీవన స్థితిగతులు, తదితర ఎన్నో అంశాలపై ఆయన సూటిగా కవితలు వెలువరించారు. ‘పల్లెను తలుచుకోనీ.. ఇది నిలువు దోపిడీకి గురైన నాతి.. తెగులు తగిలిన తోట.. కూలిపోతున్న కోట.. అందరూ వదిలేస్తే కలిగిన సమరం చేస్తున్న ఏకవీర.. ఎవరూ దాని జోలికి వెళ్లలేరు’ అని ‘నా పల్లె’ కవితలో ధీమా వ్యక్తం చేస్తారు కవి. ఈ కవితలో వాడిన పదాలు కవిగారి వస్తు చాతుర్యం, పదగాంభీర్యాన్ని తేటతెల్లం చేశాయి. రైతుల దయనీయ పరిస్థితులు చెబుతూ ‘వాడు ప్రకృతి కని పారేసిన బిడ్డ.. మట్టిని పట్టినవాడు.. ఈ జగన్నాటకంలోని పాత్రధారులకు, సామాజిక చట్టాలనుసరించే సూత్రధారులకు.. సమస్య జీవనానికి శక్తిని అన్నం రూపంలో అందించేవాడు.. అందరూ ఆ చెట్టుపైనే వాలి, ఆ చెట్టునే కొట్టేస్తున్నారు.. కని పారేసిన బిడ్డ అయినా.. మానవత్వపు ఊపిరి మరణం అంచునున్నా.. జాతికి నిత్య సంజీవని’ అంటూ హృద్యంగా చెపుతారు. విత్తనం మొలకెత్తడం, చిగురించటం, మొక్క శాఖలుగా విస్తరించటం, ఎగబాకటం వాస్తవం. పుట్టుకతో ఉన్న సద్గుణాలన్నింటినీ కొనసాగించటం, అలాకాకుండా కుళ్లు, కుతంత్రాలతో కొమ్మలన్నిటినీ నరుక్కుంటూపోతే మిగిలిన మాను మోడుగ నిలుస్తుంది. మోడువారినా మళ్లీ చిగురిస్తూనే ఉంటుంది. ‘ఎందుకంటే మట్టితత్వం.. మరణాన్ని జయించటం తెలిసినదానవు!’ అని బలంగా వివరిస్తారు ‘అజరామరం’ కవితలో. ఈ సంపుటిలోని అన్ని కవితల్లోనూ సరళత్వం, సమాజ శ్రేయస్సు, నిక్కచ్చితత్వం కనిపించాయి. రచయిత పదలాలిత్యం, వస్తు గాంభీర్యం, చమత్కృతి, నిజాయితీ, ప్రజాపక్షపాతం, భావగాఢత.. అన్నీ ఒకదానికొకటి పోటీపడి కవితల్లో వ్యక్తమయ్యాయి. ఎంతో సహజంగా ప్రారంభమయ్యే ప్రతి కవిత చివరికి పాఠకుని మదిలో తిష్టవేసి, ప్రశ్నవేసి, జవాబునిచ్చి, కర్తవ్యాలను బోధించింది. తన చుట్టూ చూస్తున్న, జరుగుతున్న సంఘటనలను కవితా వస్తువులుగా స్వీకరించి ప్రశ్నిస్తూ, చమత్కరిస్తూ, విమర్శిస్తూ కొనసాగిన కవితలు లోకరీతిని చెపుతూనే మన సంస్కృతీ సంప్రదాయాలు, స్ర్తిలు, రైతులు, దేశం పట్ల భక్తిని కలిగిస్తాయి. అందరూ కొని చదివి, మరికొందరితో చదివించాల్సిన పుస్తకం ఇది. పాపిరెడ్డి గారి కలం మరెన్నో సమాజహిత రచనలు వెలువరించాలని ఆశిద్దాం.

పుస్తకం : కాలం దోసిలిలో
రచయిత : పిడుగు పాపిరెడ్డి
వెల : రూ. 100
ప్రతులకు : 8/137, అప్పయ్యగారి వీధి, కొత్తపేట, కనిగిరి- 523230.
చరవాణి : 9440227114

- డాక్టర్ మక్కెన శ్రీను, చరవాణి : 9885219712