కృష్ణ

ప్రాభవం కోల్పోతున్న జిల్లా కేంద్రం మచిలీపట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 25: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఉన్న ప్రధాన కార్యాలయాలను కాదని విజయవాడలో క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటుచేస్తే చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జిల్లా అధికార యంత్రాంగానికి చేసిన హెచ్చరికలు బుట్టదాఖలయ్యాయి. ఒక పక్క క్యాంప్ కార్యాలయాలు వద్దని ప్రభుత్వమే చెబుతున్నా అధికారులు మాత్రం ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఉన్న ఆధునాతన, విశాలమైన కార్యాలయాలను కాదని విజయవాడ నగరంలో వేలాది రూపాయలు అద్దెలు చెల్లించి క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంగా మచిలీపట్నం తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. సకల సౌకర్యాలకు వేదికగా మారుతున్న విజయవాడ నగరం వైపు అధికారులు ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తించేందుకు ఏ మాత్రం సాహసం చేయడం లేదు. క్యాంప్ కార్యాలయాల సంస్కృతికి తెరదించాలని, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నీ జిల్లా కేంద్రం మచిలీపట్నంలోనే ఉండాలని ముఖ్య మంత్రి కార్యాలయం నుండి జిల్లా అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు జారీ అయి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే జిల్లా కేంద్రంలో ఉన్న అతి కొద్ది కార్యాలయాల్లో ఒకటి రెండు కార్యాలయాలను ఆ శాఖాధికారులు విజయవాడకు తరలించేశారు. ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం జిల్లా రెవెన్యూ అధికారి ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు చేరవేశారు. ఈ ఆదేశాలు వచ్చిన తర్వాత విజయవాడలో ఉన్న క్యాంప్ కార్యాలయాలన్నీ జిల్లా కేంద్రం మచిలీపట్నం వస్తాయని ఆశించిన ఈ ప్రాంత వాసులకు భంగపాటు కలిగింది. జిల్లా సర్వశిక్షాభియాన్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారులు విజయవాడలో క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంగా మచిలీపట్నం ఏనాడో ఖ్యాతిని పోగొట్టుకుంది. విజయవాడ నగరం దినదినాభివృద్ధి చెందుతుండటం, రాజధాని ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి కేరాఫ్ అడ్రస్‌గా విజయవాడ మారిపోవటంతో మచిలీపట్నం ప్రాభవం మరింత పడిపోయింది. జిల్లాకు వచ్చిన కలెక్టర్లే జిల్లా కేంద్రంలో ఉండని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇతర శాఖల జిల్లా అధికారుల సంగతి సరేసరి. కలెక్టర్ ఎక్కడుంటే జిల్లా అధికారులు అక్కడే అన్న చందాన పాలన సాగిపోతోంది. పాలన అంతా విజయవాడ నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండే సాగుతూ వచ్చింది. ఇటీవల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీకాంతం తొలి రోజుల్లో జిల్లా కేంద్రానికి అధిక ప్రాధాన్యతే ఇచ్చారు. వారంలో మూడు రోజులు ఇక్కడే ఉంటానని చెప్పి పాడుబడిన కలెక్టర్ బంగ్లాను సైతం పెద్ద మొత్తంలో వ్యయంచేసి మరమ్మతులు చేసి నివాసయోగ్యంగా మలుచుకున్నారు. అయితే గృహ ప్రవేశం చేసిన తర్వాత మూడు రోజులు మాత్రమే ఆయన బంగ్లాకు పరిమితమయ్యారు. విజయవాడలో తరుచూ ముఖ్యమంత్రి స్థాయిలో పలు రకాల సమావేశాలు, సమీక్షలు జరుగుతుండటంతో ఆయన విజయవాడ నుండి మచిలీపట్నం రాలేని పరిస్థితి. ఆయనకు జిల్లా కేంద్రం మీద ప్రేమ ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఏది ఏమైనా సిఎం కార్యాలయ ఉత్తర్వులతో జిల్లా కేంద్రానికి ప్రాధాన్యత పెరుగుతుందనుకుంటున్న రోజుల్లో... ఉన్న కార్యాలయాలు తరలిపోతుండటం మింగుడుపడని అంశంగా మారింది.