అనంతపురం

అస్తవ్యస్తం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 25 : అక్కడ అడుగు పెడితే.. అంతా గందరగోళమే.. ఎవరి పనులు అవుతాయో, ఎవరి పనులు కావో తెలియని అయోమయ పరిస్థితి.. సమస్యలు విన్నవించుకోవడానికి పెద్ద దిక్కులేకపోవడంతో పాలన పడకేసింది. వివిధ రకాల పనులపై వచ్చే వారితో నిత్యం కార్యాలయం కిటకిటలాడుతోంది. సరిగా స్పందించడం లేదని, పనులు చేయడం లేదంటూ ఉన్న సిబ్బందిపై కారాలూమిరియాలు నూరడం షరామామూలైంది. ఈ దైన్య స్థితి నెలకొన్నది ఎక్కడో కాదు.. జిల్లాకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలోనే..
జిల్లాలోనే అత్యధిక జనాభా, పని ఒత్తిడి అధికంగా ఉండే అనంతపురం తహశీల్దార్ కార్యాలయంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏ పని ఎప్పుడు జరుగుతుందో తెలియని అయోమయం. రెండు నెలలుగా తహశీల్దార్ పోస్టు ఖాళీగా ఉంది. ఇదివరకు పని చేస్తున్న తహశీల్దార్ శ్రీనివాసులు సెలవుపై వెళ్లడంతో ఆ పోస్టులో నేటికీ ఎవరినీ నియమించలేదు. దీనికితోడు మండలంలో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల పరిధిలోని రెవెన్యూ క్లస్టర్లలో 25 మంది విఆర్‌ఓలకు 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కొక్కరు మూడు, నాలుగు రెవెన్యూ గ్రామాల విధులు పర్యవేక్షించాల్సి వస్తోంది. తహశీల్దార్ కార్యాలయంలో ఒక యుడిఆర్‌ఐ, మరో ఆర్‌ఐ, ఒక సిఎస్‌డిటి, ఒక టైపిస్టు పోస్టులు కొన్ని నెలలుగా భర్తీకి నోచుకోలేదు. ఉన్న ఒకే ఒక డిటి, ఇతర కింది స్థాయి సిబ్బందితోనే రోజులు నెట్టుకొచ్చే దుస్థితి. దీంతో భూ సంబంధ సమస్యలు, వివిధ రకాల సర్ట్ఫికెట్ల తదితరాల కోసం వచ్చే వారు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్ లేని కారణంగా మీసేవా బడ్జెట్ నుంచి నిధులు వాడుకుని తాత్కాలిక ఆపరేటర్‌తోనే మమ అనిపిస్తున్నారు. కాగా జిల్లా కేంద్రం కావడంతో జిల్లాకు వారంలో కనీసం ఐదారు రోజులు విఐపిలు వస్తుంటారు. వీరి ప్రొటోకాల్ విధులు కూడా ఇక్కడి తహశీల్దారే చూసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే చాలు అందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మామూలు రోజుల్లో కూడా అనంతపురం తహశీల్దార్ అందుబాటులో ఉండటం చాలా అరుదు. ఇప్పుడు ఆయనే లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో రైతుల సమస్యలు, భూముల సర్వేలు, భూ సంబంధ సమస్యలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు వంటి వాటి పరిష్కారం అటకెక్కిందనే చెప్పాలి. విద్యా సంబంధ సర్ట్ఫికెట్లు మినహా ఇతరత్రా సర్ట్ఫికెట్లు సకాలంలో అందక ప్రజలు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. సిఎస్‌డిటి లేకపోవడంతో చౌక దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. ప్రభుత్వ నిబంధనల మేరకు డీలర్లు నగరంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు, గ్రామీణ ప్రాంత పరిధిలో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు చౌక దుకాణాలు తెరిచి ఉంచాలి. ప్రతి నెలా 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు ఇవ్వాల్సి ఉంది. అయితే సంబంధిత అధికారి లేకపోవడంతో మండల పరిధిలో ఉన్న మొత్తం 200 చౌక దుకాణాల పర్యవేక్షించే నాథుడే కరవయ్యాడు. ఈ నేపథ్యంలో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇక మీ సేవ నుంచి సుమారు 20 రకాల సర్ట్ఫికెట్లను రైతులు, నిరుద్యోగులు, కుల ధృవీకరణ వంటి వాటి జారీకి ఆటంకాలు ఎదురవుతున్నట్లు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు విఐపి ప్రొటోకాల్‌లు, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రూ.36 లక్షలు ఖర్చయింది. ఈ మొత్తంలో రూ.12 లక్షల వరకు ఇచ్చారు. రూ.18 లక్షలు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో వస్తే తప్ప ఈ మొత్తాన్ని చెల్లించే పరిస్థితి లేదు. ఈ వ్యవహారం కూడా ఇక్కడికొచ్చే తహశీల్దార్లకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాకేంద్రానికి రావడానికి తహశీల్దారులు ఎవరూ సాహసించడం లేదని తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ స్పందించి ఖాళీ పోస్టుల్ని భర్తీ చేస్తే ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు కోరుతున్నారు.