ఉత్తరాయణం

ఆత్మహత్య వేరు-ఆత్మత్యాగం వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మహత్య అంటే సహాయం కోసం చేసే ఆక్రందన అని మనస్తత్వశాస్తవ్రేత్తలు చెబుతారు. తాము కోరుకున్న కోరిక తీరనప్పుడో, కష్టాల నుంచి బయటపడలేనప్పుడో ఇతరులనుంచి సానుభూతి, సహకారం అందడానికి చేసే ఆఖరు ప్రయత్నమే ఆత్మహత్య. మరణించే ప్రయత్నం చేసేవారు చివరిక్షణం వరకు బతకాలని, ఎవరైనా వచ్చి తమను రక్షించాలని అనుకుంటారని మానసిక నిపుణులు అంటారు. స్వయంగా తమంతట తాము జీవించలేని వారు చేసే పని ఆత్మహత్యాయత్నం. ఆ ప్రయత్నం విఫలమైనప్పుడు చట్టం ప్రయత్నించిన వారిని శిక్షిస్తుంది. ప్రయత్నంలో సఫలమైన వారిని ప్రస్తుతం రాజకీయ నాయకులు నెత్తిన పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నారు.
ఆత్మత్యాగం ధైర్యవంతుల లక్షణం. ఒక ఉన్నతాశయ సిద్ధికోసం ప్రాణాలు అర్పించడానికి వెనుదీయని వారుంటారు. ఉదాహణకు భగత్‌సింగ్‌నే చెప్పుకోవచ్చు. ఆ యువకుడికి ఉరిశిక్ష విధించబడింది. తాను మరణిస్తానని తెలుసు. తనను ఎవరూ రక్షించరనీ తెలుసు. మరణానికి భయపడలేదు. తనవంటి వారెందరికో భారత మాతను రాజకీయ దాస్య శృంఖలాలనుంచి విముక్తి చేయడానికి తనను ఉరితీయం స్ఫూర్తినిస్తుందని నమ్మి మృత్యువును ఆహ్వానించాడు. తమ ధర్మాలను నెరవేర్చిన అనంతరం ప్రాణాలను విడనాడడం సనాతన భారతీయ ధర్మం. పురాణాలనుంచి ఎన్నో ఉదాహరణలను ఇందుకు దృష్టాంతంగా చూపవచ్చు. చారిత్రకమైనవే కావాలంటే చంద్రగుప్త వౌర్యుడు రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి శ్రావణ బెళగోళలో నిరాహారిగా ఉండి ప్రాణత్యాగం చేశాడు.
జీవితాన్ని ఎదుర్కొనలేక ఆత్మహత్య చేసుకున్న వారిని హీరోగా చిత్రించడం తగదు. మృత్యువుని ఆహ్వానించడానిక ధైర్యస్థైర్యాలుండాలి. అవమానాలు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకోదల్చుకుంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఎన్నిసార్లు మరణించి ఉండాలి? ఆయన జీవితంలో కష్ట నష్టాలను, అవమానాలనూ ఎదుర్కొని, ఉన్నత స్థానాన్ని చేరుకున్నారు. ఎందరికో చేయూతనిచ్చారు. 1970లలో సైతం కులం పేరుతో పిలిచే సంప్రదాయం ఆర్థికంగా ప్రగతి సాధించిన పల్లెల్లో కూడా ఉండేది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఒకవేళ వివక్ష చూపినా బాబాసాహెబ్ వలె ఎదుర్కొని నిలబడాలి తప్ప మరణమే శరణ్యమనుకోరాదు.
దేశంకోసమో, సమాజంలో మార్పుకోసమో, ఇతరులను రక్షించడంకోసమో మరణించిన వారికి నివాళి అర్పించడం అభిలషణీయం తప్ప సమస్యలను పరిష్కరించుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారికి కాదు. కానీ ఏ కారణంగానో మన సంఘంలో వ్యతరేక పరిస్థితి నడుస్తున్నది.సరిహద్దులో సైనికుడు గుండెల్లో తూటాతో నేలకొరిగితే మనకు పట్టదు. క్రికెటర్ బంతి తగిలితే మన గుండెలలో తూటా పేలుతుంది. ఇక నిష్కృతి ఏదీ?
-పాలంకి సత్య, సికిందరాబాద్
సంక్షోభంలో మెడికల్ షాపులు
బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను రక్షించేందుకు చిల్లర మెడికల్ వ్యాపార రంగాన్ని కనుమరుగు చేసే లక్ష్యంతో గత కొంతకాలంగా అర్థం లేని బ్రిటిష్ కాలం నాటి నిబంధనలు అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా రిటైల్ మెడికల్ షాపులను నిర్వీర్యం చేసే వ్యూహంలో భాగంగా మరో కొత్త నిబంధన అమల్లోకి రాబోతోంది. రెన్యూవల్ ఫీజులను ఏకమొత్తంగా పదిరెట్లు పెంచాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ముసాయిదా జారీ చేశారు. ఈ మార్గదర్శకాలపై 11 ఫిబ్రవరిలోపు అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా వ్యాపారంతో ముడివడిన వర్గాలనందరిని కోరారు. ఈ ప్రతిపాదనల వల్ల ప్రస్తుతమున్న రూ.3 వేలున్న లైసెన్స్ ఫీజులన్నీ రూ.30వేలు (లైసెన్స్ చిరునామా కోరితే మళ్లీ రూ.30 వేలు) అవుతున్నాయి. ఇది కచ్చితంగా రిటైల్ మెడికల్ వ్యాపారులను దెబ్బతీసే చర్య. ఇప్పటికే బహుళజాతి కంపెనీల ఆన్‌లైన్ మందుల అమ్మకాల వల్ల, అసంబద్ధమైన డిస్కౌంట్ తాయిలాల వల్ల నిర్వీర్యమైన రిటైల్ మెడికల్ షాపులు ఈ క్రొత్త ప్రతిపాదన వల్ల మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా దయనీయ స్థితికి దిగజారనున్నాయి. దీనివల్ల మొత్తం రిటైల్ మెడికల్ షాపు యజమానులు వారిపై ఆధారపడిన లక్షలాది ఉద్యోగులు ఏ ఆధారం లేక రోడ్డున పడతారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే వెంటనే మెడికల్ షాపులు మూసేయాల్సిన స్థితి ఎదురవుతుంది. కావున రిటైల్ మెడికల్ షాపుల యజమానులు, ఉద్యోగుల జీవించే హక్కును హరించే ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు, నిరసనలు తెలియజేస్తూ ప్రతిపాదనను విరమించాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వారిపై ఒత్తిడి తేవలసిందిగా యావత్ రిటైల్ మెడికల్ షాపుల పక్షాన దేశంలోని మేధావులకు, మానవతా, ప్రజస్వామ్య వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
- గుండవరం వేణుగోపాల్ రావు, సెల్: 9246332558

యధేచ్ఛగా కోడిపందేలు
సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, ఎద్దు పందేలు, నిషేధిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ అది కేవలం ప్రకటనగానే మిగిలిపోయింది. గ్రామాల శివార్లలో కోడిపందేలు యదేచ్ఛగా సాగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. సంఘంలో పలుకుబడి ఉన్న అనేకమంది ఈ పందేలలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చారు. ఈ పందేలను టీవీల్లో కూడా వీక్షించి అనేకమంది ఆనందించారు. పండుగ సందర్భంగా వాడవాడలా మద్యం ఏరులై పారింది. పండుగ రోజుల్లో తమ ఆనందం, తమ స్వార్థం కోసం అమాయక ప్రాణులను కర్కశంగా కత్తికాటుకు బలి చేయడం ఎంతవరకు సమంజసం? తెనాలి పట్టణంలో వేలాది ప్రాణులను చంపేసి, కనీసం ఆ రక్తాన్ని శుభ్రం కూడ చేయకుండా అట్లాగే వదిలేశారు. పాదచారులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరీ ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? సామాన్యుల ఇబ్బందిని పట్టించుకోరా?
-ఎం. కనకదుర్గ, తెనాలి