డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ - 39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకో చాలా ఏళ్ళ తరువాత సడెన్‌గా రఘు మాటలు గుర్తుకువచ్చాయి. ‘‘మనసులో భావాలు మొహంలో వెల్లడవుతాయి తెలుసా?’’
గుర్తుకురాలేదు. వినిపించాయి.
వెనక్కి తిరగలేదు. వౌనంగా ఉండిపోయాను.
‘‘నిద్రపట్టడంలేదా?’’ అన్నాడు వౌళి.
వాడి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే- ‘‘నువ్వెందుకు నిద్రపోలేదు ఇంకా’’ అన్నాను.
ఒక మంచి ఇంటరెస్టింగ్ నవల చదువుతున్నాను. అడుగుల చప్పుడుయితే నువ్వే అయి ఉంటావని అనుకున్నాను’’ అన్నాడు. భుజాలమీంచి చేయి తీసి వచ్చి పక్కగా పిట్టగోడ మీద కూర్చున్నాడు. ‘‘ఏమిటాలోచిస్తున్నావ్?’’ నా ప్రయాణం గురించేనా?
వౌనంగా ఊరుకున్నాను. వాడితో అబద్ధం చెప్పడం అనవసరం.
‘‘అమ్మా, ఈ రోజుల్లో అమెరికా వెళ్ళడం చాలా సులువు. ప్రయాణాలు చాలా సింపుల్ అయిపోయాయి. ఎంతోమంది వెడుతున్నారు, వస్తున్నారు. ఎందుకు నీకు వర్రీ?’’ అన్నాడు.
‘‘నువ్వు వెళ్ళడం గురించి కాదు వౌళి’’ అన్నాను.
‘‘నేను తిరిగి రావడం గురించా?’’ అన్నాడు.
వాడు అసాధ్యుడు. వాడికి నా మనోభావాలు తెలుసు. అందుకే మాట్లాడకుండా ఊరుకున్నాను, ఎటో చూస్తూ వాడి చూపులు తప్పించుకునేందుకు.
‘‘అమ్మా! ఇటు చూడు’’ బలవంతంగా తిప్పాడు నా మొహాన్ని.
‘‘అమ్మా నీ మనసులో ఏం ఆలోస్తున్నావో నాకు తెలియదని అనుకోకు. నీ మనసులో ఉన్న భయాలన్నీ నాకు తెలుసు. నాకు తెలియనిది అవి ఎలా దూరం చేయాలా అని, నేనేం చేసి నిన్ను నమ్మించగలనా అని-
‘‘నా భవిష్యత్తు గురించి నేను ఏమీ ఆలోచించుకోలేదు. ప్రస్తుతం వెడుతున్నది ఎంఎస్ చేయడానికి. అక్కడ ఉంటానో, వస్తానో నాకేమీ తెలియదు. నీ జీవితం గురించి వింటూ పెరిగిన నేను, భవిష్యత్తు గురించి ప్లాన్స్ వెయ్యదల్చుకోలేదు. కాని ఒక్కటి మాత్రం చెప్తాను. ఈ విషయంలో నన్ను నమ్ము’’ అన్నాడు. అంటుంటే వాడి గొంతు కూడా వణికింది.
‘‘నేను ఎక్కడున్నా, ఏం చేసినా నువ్వెప్పుడూ నా జీవితంలో ఒక భాగం అయ్యే ఉంటావు. నేను డాక్టర్ రఘురామ్ కాను. అంత సామర్థ్యం, తెలివితేటలు ఏవీ లేవు నాకు. నేను సాధారణమయిన వాడిని. నువ్వే అనేదానివిగా నాకు బ్రిలియంట్ సన్ అక్కర్లేదు, ఇంటిలిజెంట్ అయితే చాలు అని.
నేను అంతే! ప్లీజ్ ఏవేవో ఊహించుకుని, మనసు బాధపెట్టుకోకు. అమ్మా ప్లీజ్.. అన్నాడు.
వాడి వంక మొహం ఎత్తి చూచాను. మొహం కొంచెం విచారంగా ఉన్నా పెదిమలపైన చిరునవ్వు తొంగిచూస్తోంది. ఎంత స్పష్టంగా అన్నాడు.
‘‘ఐ యామ్ నాట్ డా.రఘురామ్’’ అని.
‘‘ఏ తల్లయినా తనకు పుట్టిన బిడ్డ ఎంతో సమర్థుడైన, తండ్రిని పోలకుండా ఉండాలని అనుకుంటుందా!’’ నిట్టూర్చాను.
అలా అనుకోవడంలో స్వార్థం తప్ప ప్రేమ ఎక్కడ ఉంది? తల్లి ప్రేమ ఒక్కటే స్వార్థరహితమైనది అని అనుకున్నాను ఇన్నాళ్ళు. ఇవాళ నా మనసు ఎందుకింత చిన్నదైపోతోంది?
‘‘పద పడుకుందాం. ఇంకా బాగా ఆలస్యమయింది’’ అంటూ లేచాను. బలంగా శ్వాస వదులుతూ లేచి వెనకనే వౌళి వచ్చాడు.
ఆ తరువాత ఎప్పటికి నిద్రపోయానో తెలియదు. కళ్ళు తెరిచేసరికి దైనందిన జీవితం నిశ్చింతగా ఆహ్వానిస్తోంది.
***
వౌళి అమెరికా వెళ్లిపోయాడు. చెప్పిన ప్రకారం ఫోన్ చేస్తూనే ఉన్నాడు. టైం ఉంటే కాసేపు కబుర్లు చెప్తాడు. లేకపోతే చాలా బిజీగా ఉన్నాను. వచ్చేవారం పిలుస్తాను అని రెండు నిమిషాలలో పెట్టేస్తాడు. కానీ, నన్ను మాత్రం నిరాశపరచడంలేదు.
వాడి చదువు, అమెరికా వాతావరణం, భారతీయుల తీరుతెన్నులు, ఒకటేమిటి ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటాడు. మొదటి సంవత్సరం అవగానే రెండు వారాల కోసం ఇండియా వచ్చి వెళ్ళాడు. కేవలం నన్ను సంతోషపెట్టడం కోసం. నాకు ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం.
వౌళి తిరిగి రాగానే అన్నయ్య దగ్గరకు పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. అన్నయ్య వచ్చి నన్ను అడిగాడు. నేను వౌళితోనే మాట్లాడు అని ఊరుకున్నాను.
అన్నయ్య వౌళితో ఈ మాట అనగానే- వౌళికి చాలా కోపం వచ్చేసింది. ‘‘మామయ్యా, నాకు ఇంకా డాలరు సంపాదన లేదు. చదువు పూర్తికాలేదు. ఆ అడిగే వాళ్లకు తెలియపోయినా నీకు తెలుసు కదా!’’ అన్నాడు.
‘‘నాకు తెలుసురా! అయినా నీకు చెప్పకుండా నేనెలా సమాధానం ఇస్తాను? అందుకని నీకు చెప్తున్నాను. ఎవరో ఒకరు వస్తే మాత్రం వెంటనే నీకు పెళ్లి జరుగుతుందా ఏమిటి- కంగారు పడకు’’ అన్నాడు ఎర్రబడిపోయిన వౌళి మొహం వంక చూస్తూ!
‘‘కంగారు కాదు మామయ్యా. నాకసలు ఇలాంటి ఏర్పాట్లు ఇష్టం లేదు. నేనీరకంగా పెళ్లి చేసుకోలేను. నేను పెళ్లంటూ చేసుకున్నపుడు ఆ అమ్మాయి ఎవరో, ఏమిటో నాకు పూర్తిగా తెలిస్తేగానీ నేను పెళ్లి చేసుకోను’’ అన్నాడు సీరియస్‌గా.
వౌళి మాటలు వింటూ, ‘‘అక్కడెవరయినా పరిచయం అయ్యారేమిట్రా’’ అన్నాడు అన్నయ్య.
‘‘అదేం లేదు మామయ్య. విషయం అర్థమవడానికి చెప్పాను అంతే’’ అంటూ లేచిపోయాడు.
ఎం.ఎస్ అయిపోయింది. ఉద్యోగంలో చేరదామని అనుకున్నాడు. కానీ వాడి ప్రొఫెసర్ చాలా ప్రోత్సహించాడు పిహెచ్‌డి చెయ్యమని. ఒక్కసారి అవకాశం చేయిజార్చుకుంటే చాలా కష్టం అన్నాడు. అసిస్టెంట్‌షిప్, గ్రాంట్స్ అన్నీ ఏర్పాట్లు చేశాడు.
వౌళి ఆ అవకాశం వదులుకోలేదు. అదే చోట మరో మూడేళ్ళు ఉండటానికి నిర్ణమయింది. ఇండియా వచ్చాడు కొన్నాళ్ళు గడపాలని. ఈసారి అన్నయ్య మాత్రం పెళ్లి సంబంధాలు చూడాలని చాలా ట్రై చేశాడు.
కాని వౌళి ససేమిరా ఒప్పుకోలేదు ఎవ్వరినీ చూడటానికి కానీ, కలవటానికి కాని. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపింది. పెళ్లిమాట గురించే మాట్లాడటానికి ఇష్టపడకపోవడం చూచి. అడుగుదామని అనుకునేదాన్ని మనసులో ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో అని. కాని, నేనే విరమించుకున్నాను. వాడంతట వాడు ఏమయినా చెప్తే తప్ప అడగదలుచుకోలేదు.
***
గతంలోకి నిరాటంకంగా విహరిస్తున్న మనసు ఎవరో స్పీడ్ బ్రేకులు వేసినట్లు ఉలిక్కిపడింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి అటూ ఇటూ చూశాను. అందరి మొహల్లో భయభ్రాంతులు చిందులేస్తున్నాయి. అంతా అయోమయంగా అటు ఇటూ చూస్తున్నారు.
పక్కనే ఉన్న అమ్మాయి వంక చూశాను. తల్లి వడిలో అమ్మ చేతి సంరక్షణలో ఉన్న పిల్లలు తప్ప అందరూ ఆందోళనగానే ఉన్నారు. విమానం అటూ ఇటూ ఊగినట్లు అనిపించింది. ఒక్కసారి ప్రెషర్ తగ్గినట్లు అనిపించింది. పైన సీలింగ్‌లోంచి ఆక్సిజన్ మాస్క్ వేళ్లాడుతున్నాయి. మైక్‌లోంచి ఇన్‌స్ట్రక్షన్స్ వినిపిస్తున్నాయి. గబగబా అందుకుని ముఖానికి తగిలించుకున్నాను.
పక్కన ఉన్న అమ్మాయి ముందు కూతురికి పెట్టబోయింది తను పెట్టుకోకుండానే. విమానం ఎక్కగానే ప్రత్యేకంగా నొక్కి చెప్తారు. ముందు మీరు పెట్టుకుని తరువాత పిల్లలకు సహాయపడమని. కానీ తల్లి ప్రాణానికి అవేవీ గుర్తుండవు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి