తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

నేను దరిద్రుణ్ణి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదరికం తప్పుకాదు. ప్రతి దైవం పేదగానే పుడతాడు. ప్రజావీరులు సైతం పేదరికంలోంచి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చరిత్రలో నిలిచిపోతారు. పేదరికాన్ని, పేదల్ని ద్వేషించడం అంటే దానిని సృష్టిస్తున్న మనని మనం ద్వేషించుకోవడమే. అది ఒక వాస్తవం! ఎవరు అణచివేసినా పేదలు మొదట దేవుణ్ణి ద్వేషిస్తారు. దైవంలో నమ్మకం ఉన్న రాజు ఎవరైనా సరే నరకయాతన అనుభవించాల్సిందేనని ఒక నమ్మకం. పేదరికం తాండవించే చోట దేవుడు మరణించక తప్పదని ఓ ఉవాచ.
***
22 జూన్ 2017 నాడు రాజస్థాన్‌లో దేసా జిల్లాలోని సిక్రి బందికు తహసీల్ కింద ఉన్న గ్రామాలలోని ఇళ్లముందు ప్రతి గోడమీద ‘నేను దరిద్రుడిని. నేను ప్రభుత్వం నుండి రేషన్ పొందుతున్నాను’ అని రాసిన ప్రకటనలు కనిపించాయి. ఈ సమాచారాన్ని ఏఎన్‌ఐ వార్తాసంస్థ దేశంలోని అన్ని పత్రికలకు పంపింది. ట్విట్టర్ కూడా దానిని నిర్థారించింది. ఈ ప్రకటన గోడమీద రాయకపోతే దారిద్య్ర రేఖ దిగువ (బిపిఎల్) లబ్ధిదారుల లిస్టు నుండి వారి పేర్లు తొలగిస్తామని అధికారులు చెప్పారు. ఒక్కసారి భయభ్రాంతులకు లోనైన జనం తెల్లారేసరికి గోడలమీద ప్రకటన రాయించేశారు. ప్రకటనలు కొన్ని గ్రామాలలో గోడలకే పరిమితమయ్యాయి. కాని దేశం పరువు విదేశాలలో పోయింది. దౌసా జిల్లా పరిషత్ సిఇఓ సురేంద్ర సింగ్ పేర జారీ అయిన ఈ ఉత్తర్వులు కలకలం రేపాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రకటనని ఖండించనందున రాజస్థాన్ ప్రభుత్వం అనుమతి ఉన్నట్లే అనుకోవాలి. ఇందులో విడ్డూరం ఏముంది? కాంగ్రెస్ పాలనలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం బిల్వారా జిల్లాలో అప్పుడు ఇలాంటి ప్రకటన వేయించారు. ఇప్పుడు వాళ్ళే దీనిని ఖండిస్తున్నారని ప్రస్తుత పాలకులు అంటున్నారు. ఈ విషయం ఏ పాలక వర్గాలదని కాదు. దొందూ దొందే. ఇలాంటి చర్యలవల్ల పేదల మనోభావాలు ఎంతగానో దెబ్బతిన్నాయి. వారి ఆత్మగౌరవం మంటగలసిన విషయం మరీ ముఖ్యం.
భారతదేశం ఆధ్యాత్మిక దేశం. దైవం ఆరాధనీయం, తరతరాల విశ్వాసం. నిజానికి చాలాసార్లు మనిషికన్నా దైవమే ముఖ్యం. కాని మనిషి- దేవుడి పక్కన ఉండడం అంటే పేదల పక్కన నిలవడమే అని ఆర్యోక్తి. పేదరికం పక్షాన నిలవడం అంటే దేవుడి పక్కన ఉన్నట్లే. కాని ఏవౌతోంది ఈ దేశంలో. పేద జాతిని కష్టాలకు గురిచేస్తూ మెల్లిగా వారిని నిర్మూలించే పథకాలు పెరిగిపోతున్నాయి. వారిని ఆత్మన్యూనతకి గురిచేసే చర్యలకు అంతులేకుండా పోతోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో?
విభిన్న రూపాలలో పేదరికం తాండవిస్తోం ది. పసిపిల్లల్ని అమ్ముకుంటున్న దృశ్యం. సరోగసి తల్లుల ఆక్రందన. పేదరికం వల్ల మైనర్ పిల్లలకి పెళ్లిళ్ళు. కిడ్నీలు అమ్ముకోవడం. శరీరాలు అమ్ముకుంటూ పిల్లల్ని సాకడం. ఎనె్నన్ని దృశ్యాలు? పనిచేయనివాడు, ధర్మం తెలియనివాడు, కుటుంబం లేనివాడు, మూర్ఖుడు, బలహీనుడు దరిద్రుడిగా జీవిస్తాడు. కాని ఇదేమిటి? ఆరుగాలం కష్టపడినా కుటుంబం రాత్రింబవళ్లు పనిచేసినా దరిద్రులుగా ఉంటున్నారు. ఎందుకు? ఏదో కిటుకు ఉంది. ఎక్కడో ఎవరో బిస తిప్పుతున్నారు. ‘కీ’ ఇస్తే పనిచేసే వ్యవస్థ రాజ్యమేలుతున్నది.
చిన్నప్పుడు ఇంటిముందు గోడమీద చాకలి లెక్క, పాలవాడి పద్దు రాసేవారు. కొన్నాళ్లకి మలేరియా జ్వరాల గురించి వైద్య శాఖవారు ఏవో పిచ్చిగీతలు గెలికేవారు. ఆ తరువాత మునిసిపాలిటీవారు ఇంటినెంబరు రాశారు. ఇవన్నీ ఇళ్ళున్న వారి గోడల బాధలు. మరి ఇళ్లు లేనివాళ్ళు? గోడలు అసలే లేని పూరి గుడిసెలు, శివుని కుళ్ళాల వంటి టెంటులలో జీవించేవారు, సంచార జాతులవారు ఏ ఇంటి గుమ్మానికి రాసుకోవాలి.ఈ సమూహాల పేదరికాన్ని గుర్తించిందా ప్రభుత్వం?
పేదరికం అంటే ఆర్థికంగా చితికినవారు అని అర్థం. కాని ఇప్పుడు ఆ పదం మన దేశంలో పనికిరాని పదం. దారిద్య్రం అనే పదమే మనకి నప్పుతుంది. ఎందుకంటే ఏమీలేనివాడు- తిండిలేనివాడే కాదు. సంస్కృతి లేనివాడు. దేవుడూ లేనివాడు. చిరునవ్వులు లేనివాడు. పండగలు లేనివాడు. గుడిలేనివాడు. బడిలేనివాడు వాడు దరిద్రుడు. ఇంతమంది దరిద్రులు ఉన్న దేశాన్ని ఏమని పిలవగలం? లక్షలమంది దరిద్రుల ఇళ్ళమందు ‘మేం దరిద్రులం’ అనే ప్రకటనలు రాయించడానికి ఇచ్చిన బడ్జెట్ వల్ల ఓ పదిమంది వాటాలు పంచుకుని లబ్ధిపొందుతారు. అదీ పథక రచన. ముందుచూపులేని రాజు ఏలుబడిలో ధనికులే పేదల కోసం ప్రణాళికలు రచిస్తారు. అంతిమంగా వారికే లాభం దక్కుతుంది. అందుకే ధనికుల సంఖ్య పెరుగుతున్నది. దరిద్రుల సంఖ్య కోటానుకోట్లుగా పెరుగుతున్నది. అంతకన్నా దరిద్రం ఏమంటే ధనవంతుల ధనం దేశం దాటిపోతున్నది. దేవుడి మాన్యాలను, ఆలయ భూముల్ని స్వాహా చేసినవారు దైవభక్తులుగా గుర్తింపబడుతున్నారు. ‘నేను దరిద్రుణ్ణి’ అని రాసుకునేవారు ఎందుకు బాధపడుతున్నారు? నాలాంటివారు గుండెపోటుకి ఎందుకు గురవుతున్నారు? అవును. ప్రభుత్వం ఇచ్చే జాతీయ ఆహార రక్షణ చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద పది కిలోల గోధుమలు పొందడం లేదా? మరి ఎందుకు అంత అవమానభావన! ఎందుకంటే- గణాంకాల కోసం లెక్కేస్తుంటే వారు తమ మానవ భావనకి దూరం అవుతున్నారు.
డబ్బున్నవాడి ఇంటి గోడలపై ‘‘నేను దరిద్రుణ్ణి. ఎలాంటి సాంస్కృతిక కళావారసత్వం లేనివాణ్ణి’’ అని రాసుకోవాలి. ‘‘నేను డబ్బుకోసం కాని పనులు ఎన్నో చేసినవాడిని’’ అని రాయాలి. పేదవాడు ఏయే స్కీంకి లబ్ధిదారులు, ఏయే పథకాలు పొందుతున్నారో రాసినట్టుగానే డబ్బున్న ప్రతి రాజకీయ నాయకులు తమ గోడలమీద తాము సంపాదించిన వివరాలను ఎందుకు రాయించకూడదు? ఎన్ని ప్రజా పథకాలను మోసగించి ఎంత డబ్బు సంపాదించాడో రాయాలని ప్రభుత్వం ఎందుకు జీవో ఇవ్వొద్దు? అనైతికంగా వేల కోట్లు సంపాదించిన వారి ఇంటి గోడలమీద ఈ వారి సంపాదన ఎంతటిదో, ఎలా సంపాదించారో రాస్తే ఏం పోయింది? వేస్తే జైల్లో వేస్తారు. అక్కడ కూడా తినేది ప్రభుత్వం కూడే కదా. దేశాన్ని తాకట్టుపెట్టేవారి పేర్లని ప్రతిగోడ ఆక్రమించాలి. పేదరికం ప్రజలలో ఉండదు. పరిపాలనలో ఉంటుంది. పేదలు ఈ దేశ నిర్మాతలు. వ్యవస్థలను కూల్చేవాడే నిజమైన దరిద్రుడు. రాజకీయ పోరంబోకులు, అశ్లీల, అసభ్య సంస్కృతి ప్రచారకర్తలు, వ్యాపారశక్తులు దరిద్రులు. వీళ్ళు చేస్తున్న అమానవీయ పనులు వారి ఇంటిముందున్న గోడలమీద రాసుకోవాలని ప్రజలు జీవో రాయాలి. పేదల్లో మంచితనం అనే దేవుడు ఉంటాడు. వాడి ధర్మాగ్రహం ఈ దేశానికి రక్ష. మరణిస్తున్న దేవుణ్ణి బతికించేవాడు పేదవాడే!

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242