నెల్లూరు

‘గో’ విలాపం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలా! గోకుల పాలా!
మా మొర వినవేలా!
పాప పుణ్యములెరుగని మూగ జీవులం మేము
పవిత్రమైన చరిత కలిగిన వారము మేము
నీకత్యంత ప్రియమైన పశుజాతులం మేము
మా‘నవు’లు చేసే దుష్కృత్యాలు కనలేవా!
విధాతనిచ్చిన గాలి, నీరు, గ్రాసము తింటూ
పరులకు ఏమాత్రము హానిచేయని
జంతువులం మేము
సాధు జీవులుగా బతికే మా కష్టాలు తీర్చలేవా గోపాలా!
చనుబాలిద్దామని పూతన నిను లాలించబోగా
దాని దుర్మార్గం తెలుసుకుని
రొమ్మును చీల్చి ఊపిరులూదేశావే!
మా పాలు, పెరుగు, మీగడలు త్రావి
మా పసిపాపలను పొలం పనులకు వాడుకొని
వయసు తీరిన వెంటనే కబేళాలకు తరలించే
ఈ దుష్కర మనుజుల దుర్మార్గాలు కనలేవా! దేవా!
రాజసూయాగమున నిను నూరు దోషములు
ఎలుగెత్తి నిండు సభలో నినదించిన శిశుపాలుని
శిరమును నీ చక్రాయుధంతో తరిగివేయలేదా మాధవా!
కుల మత వర్ణ బేధాలన్నవి తెలియనివారము
ప్రాంత, రాజకీయ కుళ్లు కుత్సితాలు ఎరగని వారము
కాసింత ప్రేమతో గడ్డి, నీరు, ఆవాసమిస్తే
జీవితాంతం రుణపడి సేవలందిస్తామే
అట్టి మమ్ము గురిచేసే పలు హింసలు
నీకు కనబడవా గోవిందా!
శకటాసురుడు, ధేనరుకాసురుడు,
బకాసురుడు వంటి
అసురులను సులువుగా తెగటార్చావే..
గోవులుగా పుట్టి, గోమాతలుగా పేరుపొంది
సాధువు జీవులుగా పుట్టడం మా నేరం
ఇరుకు వాహనాలలో కుక్కి,
నీరు ఆహారం పెట్టక
సలసల కాగే నీళ్లు మాపై పోసి
శీతల గిడ్డంగిలో నిల్వచేసి
పదునైన కరకు రంపాలతో మా చర్మాలు వలిచేసి
తలలు నరికి, కొమ్ములు తరిగేసి, కాళ్లు నరికి
దేహాన్ని ఖండఖండాలు చేసి విఫణి వీధిలో అమ్మే
ఈ ‘నర’కాసురులు నీకు కనబడలేదా
గోపీలోలా!
నరకాసుర, కాలనేమి, శిశుపాల, జరాసంధుల వంటి దుర్మార్గులను వెంటాడి సంహరించావే దేవకీనందనా!
ముక్కలు చేసి, నూనెలలో వేయించి
మసాలాలు దట్టించి, శీతల డబ్బాల్లో కుక్కి
ప్రపంచాలకు ఎగుమతి చేస్తూ
కాసుల సంపాదనే ధ్యేయంగా బతికే
ఈ మనుషుల లీలలు కనలేవా వాసుదేవా!
పాలకుల గుండెల్లో మాపై దయ కలిగించలేవా
చట్టాలు, న్యాయ స్థానాల్లో
మాపై తీర్పులు రావా!
మనుషుల దుష్ట ప్రవృత్తికి అంతంలేదా!
మాకు భద్రత లేదా?
మూగ జీవులమైన మమ్ము, మా జాతి హత్యలు నిలపలేవా..
ఓ కన్నయ్యా! ఓ కరుణామూర్తి, ఓ కృష్ణమూర్తి
ఆపదమొక్కులవాడని, అనాథ రక్షకుడవని,
బాల, వృద్ధుల, మహిళలను గాచేవాడని,
ఎన్నో ఎనె్నన్నో బిరుదులు కలిగిన నీవు
మాపై జాలి చూపలేవా! మా జాతిని
కాపాడలేవా..
నందనందనా! నవనీత కిశోరా! మా ‘విలాపం’ వినరావా!
మనుషులపై మా ఎడల వాత్సల్యం కలిగించరావా దేవా!
లక్కరాజు శ్రీనివాసరావు
అద్దంకి. చరవాణి : 9849166951

మనిషి కోసం...

మనిషిని తాకితే
మట్టివాసన రావాలి
మానవత్వపు పరిమళం వీయాలి
ప్రేమానురాగాలు పంచాలి
హృదయగీతం వినిపించాలి
ఇప్పుడే దేహాన్ని తట్టినా
మతోన్మాదపు మృత్యుగోష
విధ్వంసక భాష కనిపిస్తున్నది
ఇక్కడే మనిషిని పిలిచినా
తోకల దురహంకారం
తారతమ్య భేదాల విభజనే అంతా అనిపిస్తుంది
కళ్లలో ఒక మెరుపు.. మోములో ఓ చిరునవ్వు
మానవత్వం ఆవిరైపోని
మచ్చుకైనా కల్మషం లేని
మమతల కోవెలతో దేహమంతా
ఆకుపచ్చతనాన్ని నింపుకొని
భగవంతుడు తానై
అవతరించిన మనిషి కోసం
మనిషితనాన్ని ప్రాణం పోసే
రేపటి మనిషి కోసం అనే్వషిస్తున్నా
నేస్తమా అది నువ్వే కదూ...!
- మార్టూరి శ్రీరామ్ ప్రసాద్
చరవాణి : 9490455599

దోబూచులాట

ఎత్తుపల్లాల కాలచక్ర గమనంలో
వెలుగునీడల్లాంటి
జయాపజయాలు
నాతో దోబూచులాడుకుంటున్నాయి
ఒక్కోసారి విమర్శల బాణాలు
సూటిగా గుచ్చుకొని
తిరస్కార చట్రంలో
నిస్సహాయంగా చిక్కుకుపోయి
విలవిలలాడిపోతాను
మరోసారి
పురస్కారాల పూదోటలో
నిలువెల్లా పులకరించిపోయి
విజయపు పాంచజన్యాన్ని
నలుదిశలా పూరిస్తాను
ఒక్కోసారి మనస్సును పిండేస్తూ
వెంటాడుతున్న సమస్యలు
వెర్రితలలు వేస్తూ
గజ్జెకట్టి నర్తిస్తుంటాయి
మరోసారి గుండె గుమ్మంలో
సవ్వడి చేస్తున్న
ఆశల వీచికలు
పచ్చని తోరణాలై వ్రేలాడుతూ
వేదనతో అదృశ్యమైన
అంతులేని ఆనందానికి
స్వాగతం పల్కుతాయి..!
- దుప్పటి రమేష్
చరవాణి : 8985999985