రాజమండ్రి

అరచేతిలో పెళ్లి (హాస్య కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం ఉదయం 10 గంటలు. అమలాపురం అమ్మాయికి, అమెరికా అబ్బాయికి పెళ్లి. స్మార్ట్ ఫోన్, వాట్సాప్‌లో అందరికీ ఆహ్వానం. సుధీంద్ర పురోహితుల వారు జానెడు జరీ అంచు పంచె కట్టి, ఎర్ర శాలువా కప్పుకొని, ఐదు వేళ్లకి ఐదు ఉంగరాలు, మెడలో పులిగోరు చైన్ వేసుకొని, ఇన్నోవా కారులో కూర్చొని, ట్యాబంత అమెరికా సెల్‌ఫోన్‌లో నెట్ ఓపెన్ చేసి వివాహ వేడుక ఆహ్వానం సుమూహూర్తం సమయానికి అందరికీ మెసేజ్‌లు పెట్టారు. అందరూ చేతుల్లో ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు.
పెళ్లికూతురి బంధువులు, పెళ్లికొడుకు బంధువులు అంతా ఎవరిళ్లలో వాళ్లు కుర్చీల్లో కూర్చొని స్మార్ట్ ఫోన్లు ఓపెన్ చేసుకొని పెళ్లి తంతు చూడటం మొదలుపెట్టారు. పురోహితుల వారు ఫోన్‌లో కుడి నుంచి ఎడమకు వేళ్లు జరిపి అటు, ఇటు గీతలు గీయగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకు కనిపించారు. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టగానే మంగళస్నానాలు చేసి, పట్టుబట్టలు ధరించి వచ్చి పెళ్లిపీటల మీద కూర్చున్నారు. మరో ఎస్‌ఎంఎస్ పెట్టగానే మంత్రాలు, మంగళవాయిద్యాలు వినిపించాయి. 2జి నుంచి పంపిన మెసేజ్ చూసి పెళ్లికూతుర్ని గంపలో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చారు. 3జి నుంచి వాట్సాప్‌లో పంపిన కొబ్బరిబొండాం చూసి పెళ్లికూతురు కొబ్బరిబొండాం పట్టుకొని వచ్చింది. 4జి నుంచి సన్నాయి మేళం సౌండ్ పెరిగింది.
‘జీలకర్ర-బెల్లం’.. అనగానే ఒకరి నెత్తిన ఒకరు ఫాస్ట్‌గా పెట్టుకున్నారు. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ వాట్సాప్‌లో అక్షింతల ఆశీర్వచనాల ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. మంగళసూత్ర ధారణ జరిగింది. వైఫై ద్వారా అరచేతిలో పెళ్లిని అందరూ చూశారు.
అమ్మాయి మెడలో అబ్బాయి మూడుముళ్లూ వేశాడు. బ్యాండు మేళం మోగింది. మధ్యలో కొద్దిసేపు బ్రేక్!
తరువాత పెళ్లి జంట ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు. ఎవరింట్లోంచి వాళ్లు కదలకుండా ఫ్రిజ్‌లో నుంచి కూల్‌డ్రింకులు, జ్యూస్‌లో తీసి తాగారు.
పెళ్లికూతురు, పెళ్లికొడుకు పక్కపక్కనే నిల్చుని సెల్ఫీ తీసుకుంటున్నారు.
మిగతా కార్యక్రమం మొదలైంది.
కొంగులు ముడివేసుకొని వారే ఏడడుగులు నడిచారు. చదివింపుల కార్యక్రమం మొదలయింది. బంధువులంతా రకరకాల ఫోన్లు 2జి, 3జి, 4జి నుంచి రీచార్జ్ బ్యాలెన్స్‌లు వేయించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన గిఫ్ట్ ప్యాక్‌లు ఇచ్చి సంతకం చేయించుకొని వెళ్లిపోయారు కంపెనీ వాళ్లు.
పెళ్లివారికి, బంధువులకి ఆన్‌లైన్ ద్వారా బట్టలు అందాయి. కట్నం ఇవ్వలేదని అత్తగారు అలిగింది. లాంఛనాలు ఏవని ఆడపడుచు ప్రశ్నించింది. వేసవి కాలం స్పెషల్‌గా చెరో బుట్ట మామిడి పండ్లు, చెరొక జాడీ ఆవకాయ పంపించారు.
అమెరికా అల్లుడు అత్తగారికి ల్యాప్‌టాప్ అంత సెల్ ఫోన్ గిఫ్ట్‌గా అందజేసేసరికి ఆమె ముఖం చాటంతయింది. దాంట్లో రోజూ కూతుర్ని చూస్తూ మాట్లాడుకునే సదుపాయం ఉంది. ఎవరికీ ప్రయాణం ఖర్చుల అవసరం రాలేదు. హమ్మయ్య! పెళ్లి తంతు ముగిసింది. ఇక భోజనాల కార్యక్రమం. ఎవరిళ్ల దగ్గరికి ఆ ఊళ్లో నుంచే క్యాటరింగ్ వాళ్లొచ్చి ఎందరుంటే అంతమందికీ పిండివంటలు సహా భోజనం క్యారేజీలు అందించి వెళ్లారు. ఇదికూడా పెళ్లివారి ఖర్చే. ఐస్‌క్రీములు, కిళ్లీలు కూడా వచ్చాయి.
వేసవిలో పెళ్లి చాలా బాగుందని మెచ్చుకున్నారు అందరూ. మేం కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటాం. కల్యాణ మంటపాల కోసం ఇబ్బందులు పడక్కర్లేదు. శుభలేఖల ఖర్చుండదు. వచ్చిన వారందరికీ మర్యాదలు చేయలేదనే మాటరాదు. ముహూర్తం పెట్టుకుంటే చాలు, బ్రాహ్మడితోనూ పనిలేదంటూ అభినందనల ఎస్‌ఎంఎస్‌లు వచ్చిపడ్డాయి. అరచేతిలో పెళ్లి అదిరిపోయింది. పెళ్లి సంభావన ఇవ్వకుండా ముహూర్తం కూడా పెట్టేది లేదన్నాడు పురోహితుడు. ‘మీరంతా వాట్సాప్ పెళ్లిళ్లు చేసుకుంటే మేం బతికేదెట్టా?’ అని ప్రశ్నించాడు.
బ్యాంక్ ఎకౌంట్‌లో ఆన్‌లైన్ ద్వారా దక్షిణ తాంబూలం కింద ఎవౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ‘సర్వేజనా సుఖినోభవంతు’!.. అంటూ దీవించారు పురోహితుల వారు. తొలి రాత్రికి మాత్రం సెల్ ఫోనే్లవీ గదిలోకి తీసుకెళ్లొద్దని సున్నితంగా హెచ్చరించారు!

- తాటికోల పద్మావతి, చరవాణి : 9441753376