ఉత్తర తెలంగాణ

బంగారు పంజరం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదృష్టవశాత్తు అమెరికాలో మా నలుగురికి మంచి ఉద్యోగాలు. మేమందరం అంటో ఇంతో సంపాదిస్తున్నాము నాన్నా! ఇంకా ఇలా కష్టపడుతూ..మీరు, అమ్మ ఈ ఊర్లోనే వ్యవసాయం చేస్తూ.. రాత్రనకా, పగలనకా.. కష్టపడాలా? అమ్మ, మీరు మాతో బాటే అమెరికాకు వచ్చేయండి, నాన్నా, అక్కడ నాకు, తమ్ముడికి స్వంత ఇళ్లున్నాయి కదా! మీరు మాతో వున్నట్టుంటుంది. మేము ఏడాదికోసారి ఇండియాకు వచ్చినా కొన్ని వారాలే కదా వుండగలిగేది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. త్వరలోనే మనవల్లనో, మనవరాళ్లనో మీ చేతుల్లో పెడతాం. అందరు అనుకోని తీసుకున్న నిర్ణయం ప్రకారం పెద్దోడు రామ్ తల్లిదండ్రులనుద్ధేశించి అన్నాడు.
ఆనందం ఓ సాధారణ వ్యవసాయదారుడు. ముప్పై ఎకరాల భూమి అందులో ఓ పది ఎకరాలు మంచి ఫలసాయమైన పొలం. మంచి పంటలు పండిసున్నారు. దేనికీ ఢోకా లేదు. భార్య అనసూయ వ్యవసాయ పనుల్లో భర్తకు చేదోడు వాదోడు. ఇద్దరు చాలా కష్టజీవులు. రామ్, లక్ష్మణ్ వజ్రం తునకల్లాటటి ఇద్దరు కొడుకులు. హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకొని అమెరికాకు పై చదువులకై వెళ్లి అక్కడే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ మధ్యనే అక్కడే ఉద్యోగాల్లో ఉన్న సాంప్రదాయ తెలుగు కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలతో పెళ్లయ్యింది. ఇండియాలో ఆనందం-అనసూయలు. అక్కడ అమెరికాలో కొడుకులు-కోడళ్లు.. అందరి జీవితాలు హాయిగా గడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం కొడుకులు, కోడళ్లు ఇండియా వచ్చి తల్లిదండ్రుల వద్ద రెండు-మూడు వారాలు గడిపి వెళ్తున్నారు. పనివాళ్ల సహాయంతో భూమిని సాగుచేయడంలో తమ తల్లిదండ్రులు చూపిస్తున్న శ్రద్ధ, వారు పడుతున్న శ్రమ గమనిస్తున్నారు.
ఉన్నపళంగా ఇక్కడ ఇదంతా ఇలా వదిలేసి రావడం కష్టంరా! ఓ ఆర్నెల్లు పోయాక ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అంటూ వారందరినీ సాగనంపారు. పాస్పోర్టులు, వీసాలు, అమెరికా ప్రయాణానికి అంతా సిద్ధం. ఏదో కొంత విలువ నిర్ణయించి భూమిని కౌలుకు ఇవ్వడానికి ఏర్పాటు చేసాడు. పుట్టి పెరిగిన ఊరు. ఉన్న దేశం వదిలిపెట్టిపోవాలంటే..మనసులో బరువుగా ఉన్నా..పుత్ర వత్సల్యం.. పోతేనే బాగుండు అని పీకుతుంది. ఏమైతేనేం..్భమికి ఆవలి వైపున్న అమెరికాకి చేరుకున్నారు. చిన్నోడి, పెద్దోడి ఇళ్ల మధ్య దూరం సుమారు ఏభై మైళ్లు. ఐతేనేం..ప్రతి వారం అందరూ ఒకే దగ్గర కలుసుకుంటారు. ఎన్నో కొత్త ప్రదేశాలు తిప్పారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు నలుగురు పిల్లలు నాలుగు వేర్వేరు ఆఫీసుల్లో లంకంత ఇల్లు బోసిపోయినట్లు వీళ్లిద్దరే పొద్దంతా!
అందరూ పనులకు వెళ్లే వాళ్లే! రాను రాను రోజులు గడవడం కష్టంగా తోచింది. ఊర్లో వున్నప్పుడు పొద్దు పొడిచిందంటే .. ఇద్దరాలుమగలు ఏ పొలానికో, చేనుకో వెళ్లేవారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకో ఓ అందమైన బంగారు పంజరంలో వున్నట్టనిపిస్తుంది! ఇది జైలుకేమి తీసిపోదు! ఒక వైపు కొడుకులు కోడళ్లతో వున్నందుకు సంతోషం. మరోవైపు గూటికే బందీ అయిన రెక్కల్లేని పక్షుల్లా గిల గిలా తల్లడిల్లడం! వారికి వారై ఎక్కడికి వెళ్లలేరు. అతి కష్టంగా నాలుగైదు నెలలు గడిచాయి. ఓ రోజు రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు..ఆనందం తన మనసులో రగులుతున్న తపనకు రూపమిచ్చాడు. తామిక్కడ ఇక ఉండలేమనీ, ఊరుకు వెళ్లిపోతామనీ.. కానీ, పిల్లలకు కొంత బాధ అనిపించినా, తల్లిదండ్రులను నొప్పించడం ఇష్టం లేక..ఒక షరతు మీద.. ఇండియాకు పంపించడానికి ఒప్పుకున్నారు.
హైదరాబాదుకు మన ఊరు దగ్గరే గనుక అక్కడ మీకు ఒక మంచి ఫ్లాటు కొనిపెడతాము. మీరు అక్కడే ఉండండి. ఏ అవసరానికైనా ఒక కారు, డ్రైవర్, వంట మనిషితో బాటు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాము. కావాలంటే అప్పుడప్పుడు మన ఊరికి వెళ్లిరండి. మీరు ఇక నుంచి వ్యవసాయం పనులు చేయనక్కర్లేదు. సాధ్యమైనన్ని అత్యాధునిక సౌకర్యాలు సమకూర్చి వాళ్లను సుఖపెట్టాలనే ఉద్ధేశంతో అందరు ముక్త కంఠంతో చెప్పారు. వారి ప్రేమాభిమానాలకు ముగ్ధులై సరే, ఫర్వాలేదు! మన దేశం, మన రాజధానే కదా! అని సంతోషంగా ఒప్పుకున్నారు.
అలా మొదలైంది. ఆనందం, అనసూయల హైదరాబాద్ హెటెక్ జీవితం! ఎందుకో..చాలా వెలితిగానే ఓ నాలుగు సంవత్సరాలు గడిచాయి. పిల్లలకు ఈ మధ్యలో చెరో బాబు పుట్టాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. ఇంటి నిండుగా పిల్లలున్నప్పుడు పండగే! తరువాత అంతా శూన్యం! ఇరుగు పొరుగు ఎక్కువ మాట్లాడరు. ఎవరికీ వారే యమునా తీరే! ముందు హాలులో పెద్ద టివి, డిష్ కనెక్షన్..రోజు ఏవో కార్యక్రమాలు, సినిమాలు, మిత్రులు, బంధువులు తక్కువ. బయటకు వెళ్లేది లేదు. నాలుగు గోడల మధ్య జైలును తలపిస్తున్న జీవితం! మరో బంగారు పంజరం లాంటి బందీఖానాలో వుండేందుకు అలవాటుపడ్డారు. కానీ..రాను రాను ఆనందం ఆరోగ్యం మందగించింది. పేరున్న కార్పోరేట్ హాస్పిటల్లలో పెద్ద పెద్ద డాక్టర్లకు చూపెట్టారు. రోగం అంతు చిక్కలేదు. ఏవో మందులిస్తున్నారు. ఆనందం అదోలా అయిపోయాడు.
అనసూయకు ఆందోళన ఎక్కువయ్యింది. ఆనందం ఎప్పుడూ అనసూయతో అనేవాడు. పనీ, పాట లేని ఇదేం సుఖం అనసూయ! మనం మన ఊరికెళ్లిపోతే బాగుండు! అని.అంతే..ఏదో అనసూయకు తట్టింది. పెద్దోడికి ఫోన్ చేసింది. ప్లాటుకు తాళ్ల వేసి భర్తను రాత్రికి రాత్రి కారులో తీసుకొని ఊరికెళ్లి పోయింది. ఇల్లంతా దులిపి శుభ్రం చేసి, అప్పటికప్పుడే వంట చేసింది. ఇద్దరు భోంచేసి సుఖంగా నిద్రపోయారు. తన లేచే వరకే..ఆశ్ఛర్యం! ఆనందం లేచి అప్పుడే కాలువకెళ్లి వచ్చి.. హుషారుగా.. ‘అనసూయ! మంచి టీ తాగి ఎన్ని రోజులయ్యిందో.. టీ పెట్టుకొని రావోయ్!
‘ఒక్క రోజులో ఆనందంలో ఇంత మార్పా? ఈ పల్లెలో, ఈ గాలిలో, ఈ వాతావరణంలో ఇంత మహిమ ఉందా!? ఇప్పుడు అనసూయకు ఆనందంలో సంపూర్ణ ఆరోగ్యవంతుడైన ఒకప్పటి పాత మనిషి అగుపిస్తున్నాడు!

- ఆచార్య కడారు వీరారెడ్డి హైదరాబాద్, సెల్.నం.7893366363