రాజమండ్రి

కర్మయోగి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నగా పడుతున్న చినుకులు ఒక్కసారిగా ఉద్ధృతరూపం దాల్చటంతో ఏమిచేయాలో పాలుపోక బెల్లూ-బ్రేకులు, కనీసం స్టాండు కూడా లేని పాత సైకిల్‌ను కింద పడేసి ఓ చెట్టు కింద నిలబడ్డాడు ఆ కోయగూడేనికి కొత్తగా వచ్చిన రఘు మాస్టారు. వాన తెరిపివ్వటంతో సైకిల్ తీసుకొని ఊళ్లోకి వెళ్లాడు. ‘వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు’ ఆ ఊరి పటేలే పలకరింపుగా ‘కొత్తగా కనబడతావుండావే. ఎవరు నువ్వు?’ అని అడిగాడు. ‘నేను ఈ గూడెం పటేల్‌ని. నా పేరు శిరమయ్య. నీకు ఏదన్నా కావాలంటే నాకు కబురెట్టు’ అని సలహా ఇచ్చాడు. కోయగూడెమైనా తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగే ప్రత్యేకత కలిగిన తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీరాంపురం గ్రామం అది. ‘ఓ..! పటేల్ శిరమయ్య గారు మీరేనా? నమస్కారమండీ! నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్‌ని. నా పేరు రఘు. బడి ఎక్కడో చూపిస్తే’.. అంటుండగానే, ‘బడిదేముందిలే. బడలికగా ఉన్నట్లుండావ్. కొద్దిగా ఈ మంచంపై నడుం వాల్చు’ అంటూ తన ఇంటిముందున్న ఓ పెద్ద వేపచెట్టు కింద మంచం వేశాడు పటేల్. ‘పడుకోవటమంటే కుదరదులే గానీ, ఎంతమంది చదువుకుంటున్న పిల్లలున్నారు ఈ గూడెంలో?’ అంటూ మాటలు కలిపాడు రఘు. ‘ఇదిగో పంతులూ! ఏదో బడి అనే పేరేగానీ నేను పుట్టి బుద్ధెరిగిన ఈరోజు వరకూ పట్టుమని పది అక్షరాలు నేర్చుకున్నోడు లేడు. కొలువు చేయటానికి వచ్చినోడు సరిగ్గా బడికి వచ్చిందీ లేదు. నువ్వూ నికరంగా ఉంటావని నాకు నమ్మకమూ లేదు’ అంటూ అనుమానంగా తన వంక ఎగాదిగా చూస్తున్న శిరమయ్య మాటల్లో కొంత నిజాయితీ ఉందనిపించింది రఘుకు. ‘సరే! బడిఈడు పిల్లలున్న ఇళ్లను ఒకసారి చూపించండి’ అని అడిగాడు. ‘ఇగో పంతులూ! నీకు తీరికైనాదని మా గూడెపు వాళ్లకు తీరికవుద్ది అనుకున్నావా? ఇప్పుడు నీకు ఇళ్ల దగ్గర ఒక్కడూ దొరకడు. అంతా అడవికి పోతారు. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక సరే.. పద! ఒక్కోరిళ్లూ చూపిస్తాను’ అంటూ రఘుతో బయలుదేరాడు శిరమయ్య. విసిరేసినట్లు అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు. అన్నీ కలిపి ఓ పాతిక ఉంటాయనిపించింది. ‘ఎలాగూ ఇంటింటి సర్వే చేయాలి కనుక, సరైన లెక్క తెలుస్తుందిలే’ అని మనసులో అనుకుంటూ వెళుతుండగానే ఓ పెద్ద ఎనుబోతు అమాంతం తన కాళ్లను గాల్లోకి లేపి ఒక్క గెంతుతో అవతలి వైపు దూకి వేగంగా పరుగెత్తటం చూసి గుండె ఆగిపోయినంత పనైంది రఘుకి. అతనిలో భయం చూసి ‘ఇదిగో పంతులూ! ఈ అడవి జంతువులు ఇట్టా గూడెంలోకి వస్తానే ఉంటాయ్. అదంతా మామూలే. మనం వాటికి హాని తలపెట్టకపోతే అవి మనల్ని ఏమీచెయ్యవు తెలుసా! కానీ, పిల్లలతో ఉన్న అడవి ముళ్లపందితో మాత్రం చాలా ప్రమాదం సుమా!’ అంటూ తన అడవి అనుభవాలను ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చాడు పటేల్. ‘ఊఁ’కొడుతూ ముందుకు కదులుతున్నాడు రఘు. రఘును చూడగానే ఓ పిల్లాడు ఒంటికన్ను రాక్షసుడి మాదిరిగా గబగబా ఎదురుగా ఉన్న గుడిసెలోకి వెళ్లాడు. తడిక చాటు చేసుకొని ఆ కంతల్లో నుంచి బిక్కుబిక్కుమంటూ బయటికి చూస్తున్నాడు. ఈ విషయం పసిగట్టిన రఘు ‘బాబూ! ఒక్కసారి బయటికి రా. నేను నిన్ను ఏమీ చేయను’ అని పిలిచాడు. ఆ పిలుపుతో ఇంకొంచెం భయంతో ముడుచుకుపోయాడు ఆ పిల్లాడు. ఆ అబ్బాయి పేరు అయోధ్య అని పటేల్ ద్వారా తెలుసుకున్న రఘు ‘అయోధ్యా.. ఓ అయోధ్యా.. బయటకు రా! నినే్నమీ అనను. నువ్వు నాకు దొరికిన కొత్త స్నేహితుడివి. నీకోసం ఏమితెచ్చానో చూడు. మాంచి బొమ్మలు, మిఠాయిలు తెచ్చా. దగ్గరికొచ్చి చూస్తే నీకే తెలుస్తుంది’ అని ఊరించాడు రఘు. ‘ఆయ్! నాకోసం నిజంగా ఇవన్నీ తెచ్చారా?’ అంటూ అయోధ్య అమాయకంగా బయటకు వచ్చాడు. వాడి భుజమీద చెయ్యేసి, చిటికెన వేలు పట్టుకొని నడిపించుకొస్తుండగా ‘కూ.. కూ..’ అంటూ చెట్టుపై నుంచి ఓ కోయిల గొంతు విప్పింది. దానితో గొంతు కలిపిన అయోధ్యతో ‘నీకు పాటలంటే ఇష్టమా? నీకు మంచి పాటలు నేర్పిస్తా, నేర్చుకుంటావా?’ అని రఘు అడగటంతో ‘నేర్చుకుంటా’ అన్నట్లు తల ఊపాడు అయోధ్య.
రంగు వెలసిపోయిన గోడలతో, ఏనాడూ ఊడ్చనందున మట్టిదిబ్బలా ఉన్న ఆవరణలో అక్కడక్కడ పగుళ్లతో ఒక్క గదితో ఉన్నదాన్ని ‘బడి’ అంటారని రఘుకు అర్థమైంది. ‘పటేల్ గారూ! ఇక మీరు వెళ్లొచ్చు. అయోధ్య ద్వారా నేను వాడి స్నేహితులను వెతికిపట్టే పనిలో ఉంటాను. మీ సహాయానికి కృతజ్ఞతలు’! అన్నాడు రఘు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకు ఎదురుగా కనిపిస్తున్న పాత పొరకకట్ట పట్టుకొని ఊడ్చబోతున్న అతని చేతి నుంచి అమాంతం దాన్ని లాక్కొని చకచకా తన చిట్టి చేతులతో ఊడ్చేసిన అయోధ్యతో ‘గుడ్ అయోధ్యా! నువ్వు ఇలారా’ అని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దిచ్చి, కూర్చో అనగానే.. చక్కగా మఠం వేసుక్కూర్చున్నాడు అయోధ్య. ‘చూడు అయోధ్యా! నీతోపాటు చదువుకుంటున్న వాళ్ల పేర్లు ఏమిటో చెబుతావా?’ అంటుండగానే ‘ఆఁ’.. అంటూ ‘పద్దయ్య, రాజయ్య, జోగయ్య, పోతయ్యా, వీరయ్య’.. ఇలా చెబుతూ టపీమని ఆగిపోయాడు అయోధ్య. ‘ఇంతేనా? ఆరుగురేనా?’ అని అడిగితే ‘అవును’ అంటూ తలూపాడు. సరిగ్గా నాలుగ్గంటలకు తన సైకిల్‌ని కదలదీసి నిదానంగా వెళుతూ సమీప దూరంలోని తన చేలో పనిచేసుకుంటున్న పటేల్ గారికి విష్ చేసి ‘రేపు ఆ ఆరుగురు బడికి వచ్చేలా ఓసారి వాళ్ల పెద్దలకు కలిసి చెప్పండి’ అని అనునయపూర్వకంగా చెప్పటంతో పటేల్ కళ్లలో కనిపించిన మెరుపును గమనించాడు రఘు. చిత్తడిగా వుండి చక్రాలకు మట్టి పట్టేస్తూ సైకిల్ కూడా కదలక ఆగుతూ, సాగుతూ, ఆయాసపడుతూ సాగుతోంది. అక్కడక్కడా అమాంతం సైకిల్‌ను పైకెత్తి పట్టుకొని 10 కిలోమీటర్ల దూరంలో తనుండే ఓ మోస్తరు గ్రామమైన నర్సింగపేటకు చేరుకున్నాడు రఘు.
మరుసటిరోజు బుధవారం వారపు సంత కావటం ఒకింత ఆనందం కలిగించింది రఘుకు. ఈరోజు ఉదయం పిల్లలందరినీ ఎలాగూ బడిలో కూర్చోబెట్టాలి. మధ్యాహ్నం ఉండే సంత సెలవును పిల్లల క్షేత్ర పర్యటనకు, పరిసరాల పరిచయానికి వినియోగించాలనుకున్నాడు. పటేల్ శిరమయ్య చెప్పి వుండటం వల్ల అయోధ్యతో పాటు మిగిలిన ఐదుగురూ బడికి రావటంతో రఘు సంతోషం రెట్టింపయింది. పిల్లలకేమీ రాదని గుర్తించిన రఘు వారందరికీ ‘అ.. ఆ’లతోనే ప్రారంభించాడు తన బోధన.
చెక్కలు ఊడి సగం వక్కలైన పలకల స్థానంలో కొత్తవి, తను తెచ్చిన బలపాలు ఇచ్చి అక్షరాలు దిద్దే పని అప్పగించి, రకరకాల చిత్రపటాలను క్లిప్పులతో వేలాడదీశాడు. తన సంచిలో తెచ్చిన సున్నాన్ని బ్రష్‌తో గోడలకు వేశాడు. పగుళ్లిచ్చిన బ్లాక్ బోర్డును సరిచేసి నల్లరంగు పూశాడు. ‘పిల్లలూ! ఈ మధ్యాహ్నం నాతో సంతకు రావాలి’ అని చెప్పిన రఘుకు నిల్వ ఉన్న బియ్యంతో వండిన అన్నం వారికి వడ్డించటానికి మనస్కరించలేదు. లుకలుకలాడుతున్న తెల్ల పురుగులు ఉండటం చూసి వెంటనే కొత్త బియ్యం కోసం ఇండెంట్ రాశాడు. సంతకు వచ్చేవాళ్లు తల్లిదండ్రులకు విషయం చెప్పి ఒక ముద్ద తినేసి రమ్మన్నాడు. ఇక అంతే! ఒళ్లు ఆరిన జింక పిల్లల్లా రయ్యిమంటూ పిల్లకు ఇళ్లకు దౌడు తీశారు. పావు గంటలో తిరిగి బడికి చేరారు. పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్లిన కొద్దిసేపటికే ఓ వాగు దాటాల్సి వచ్చింది. పిల్లలైతే ‘మాస్టారండీ! మేము ఈదుతాం.. చూస్తారా?’ అంటూ టపీమని వాగులోకి దూకి ఈదుకుంటూ అవతలి గట్టుకు చేరారు. చంకల్లో బుట్టలతో సంతకు వచ్చేవారితో పాటు తానుకూడా ఓ చిన్న దోనెలో ఆవలి వడ్డుకు చేరాడు రఘు. వరుసగా పాకలు వేసి ఉన్నాయి. రఘు సంతను, ఆ పరిసరాలను నిశితంగా పరిశీలించాడు. అన్నింట్లోనూ ఏదో తేడాను గమనించాడు. వస్తువులపై వుండే లేబుళ్ల నుంచి తూకం తూచే రాళ్ల వరకు ఏదో మోసం జరుగుతున్నట్లు గ్రహించాడు. ఇదే విషయాన్ని పిల్లలకు వివరంగా చెప్పాడు.
‘చదువురాని మీ తల్లిదండ్రులు వ్యాపారుల చేతుల్లో మోసపోతున్నారు. అందుకని మీరైనా బాగా చదువుకోవాలి. ఈ దోపిడీని అరికట్టాలి’ అని చెప్పగానే ‘సరే సార్! మీరు చెప్పిన మాటలను బాగా గుర్తుపెట్టుకుంటాం’ అన్నారు ముక్తకంఠంతో పిల్లలు. ఇక ఊరికి వెనుదిరిగారు. దారిలోని ఓ చెట్టుపై ఉన్న పిట్టను చూసిన పద్దయ్య తను తెచ్చుకున్న లద్దెతో గురిపెట్టటం చూసిన రఘు వారికి లింబారామ్, కొమరం భీమ్ కథలు చెప్పాడు. మీరూ వారిలో తయారుకావాలని చెప్పటం పిల్లల్లో హుషారు రేపింది. ‘సంతకు వచ్చేటప్పుడు వాగులో మీ ఈత, ఇప్పుడు పద్దయ్య గురిచూసి వదిలిన బాణం.. ఇలాంటి వాటికంటే చదువుకోవటం చాలా తేలిక’ అని చెపుతూ గజఈతగాడు మెహర్‌సేన్, సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ ప్రఖ్యాతుడైన దివ్యాంగుడు స్టీఫెన్ హాకింగ్ కథనాలు వినిపించాడు. అవి వారికి తారకమంత్రంలా పనిచేశాయి. గూడెం వాసులలో చైతన్యం రావటంతో బడిలో క్రమక్రమంగా పిల్లల సంఖ్య ఇరవై ఆరుకు పెరిగింది. రఘుకు అంతా ఓ కలలా అనిపిస్తుండగానే కాలచక్రం గిర్రున తిరిగింది. ‘బడే నా సర్వస్వం’ అన్నట్లున్న రఘు అంకితభావం వట్టిపోలేదు. పిల్లల్లోని అంతర్గత సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దన రఘు ప్రతిభాపాటవాలను ఉన్నతాధికారులు గుర్తించారు. ‘అక్షర దీపం’ కళాజాతాకు అతన్ని రథసారథిని చేశారు. అతని నేతృత్వంలో జాతా తిరగని ఊరు లేదు. ప్రతి గూడేన్ని చుట్టేశాడు. దళంలోని ప్రతిఒక్కరి ఆదరాభిమానాలు చూరగొన్నాడు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల వారందరికీ తలలో నాలుకలా మారిపోయాడు. అవిద్య, మద్యపానం, మూఢనమ్మకాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, ప్రకృతి, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, బాలలకు టీకాలు, బాలికా విద్య ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ, అంటురోగాల నివారణ, పెద్దల చదువు అవసరం వంటి ప్రచారాంశాలతో ఓ చైతన్య రథంలా దూసుకెళ్లాడు రఘు. ఎన్నికలు, సర్వేలు, జన్మభూమి, శ్రమదానం, వరద డ్యూటీలు, శిక్షణ కార్యక్రమాలు, జనాభా లెక్కల సేకరణ వంటి బోధనేతర అంశాలన్నిటినీ శ్రద్ధగా చక్కదిద్దుతూనే అంకిత భావం కలిగిన ‘మామంచి మాస్టారు’ అనే పేరొందిన రఘుకు బదిలీ జరిగిందని తెలియగానే ఊరు ఊరంతా కదిలిపోయారు. పటేల్ శిరమయ్య గూడెంవాసులతో వెళ్లి జిల్లా కలెక్టర్‌ను కలిశాడు. రఘు మాస్టారినే కొనసాగించమని వారంతా కోరారు. విషయం ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వ దృష్టికి వెళ్లినా.. ‘నిబంధనలు పాటించక తప్పదని, మళ్లీ వీలుంటే ఇక్కడికే వస్తాన’ని గూడెం వాసులకు నచ్చచెప్పాడు రఘు. వారు తలొగ్గారు. ఊరి చివరి వరకు తోడెళ్లి పిల్లాపెద్దలంతా ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఆశ్చర్యంగా కొద్దిరోజులకే రఘు తిరిగి బదిలీపై శ్రీరాంపురం వచ్చాడు. తన సర్వీసంతా గూడెం పిల్లల సేవలో గడిపిన రఘుకు పదవీ విరమణ సమయం కూడా ఇట్టే రానే వచ్చింది. ప్రస్తుత, పూర్వ విద్యార్థులంతా కలిసి ఘనంగా సత్కరించాలని భారీ వేదికను ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైంది. రఘు చేసిన సేవలపై ఒక్కో వక్త చుక్కలు తెగిపడేలా ఉపన్యసిస్తున్నాడు.
అప్పుడే ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కారు దిగీదిగటంతోనే అమాంతం వేదికపైకి వచ్చిన రఘు కాళ్లకు నమస్కరించి ‘క్షమించండి’ అంటూ, ప్రసంగిస్తున్న వక్త చేతిలోని మైక్‌ను అందుకొని మాట్లాడుతున్న వ్యక్తిని చూసి సభంతా నిశ్శబ్దం అలముకుంది. ఒక నిమిషం వౌనం రాజ్యమేలింది. ‘చింపిరి జుట్టుతో, చిరిగిన గుడ్డలతో అజ్ఞానమనే చీకటిలో దారీతెన్నూ తెలియక గడిపే మాలో జ్ఞానజ్యోతులు వెలిగించి, మా గూడేనికి వెలుగులు పంచిన సూర్యుడు మా రఘు మాస్టారు. పునాదులు లేని భవంతులు నిలబడవంటూ మాకు గణితంలోని చతుర్విధ ప్రక్రియలనూ, తేనెలూరే తెలుగు భాషపైన పట్టు కలిగించటమే కాకుండా పద్దయ్య జాతీయ స్థాయి విలుకాడుగా, జోగయ్య ఆసియా స్థాయి గజఈతగాడుగా, అనసూయ ఆంగ్ల భాష నుంచి కోయ భాషలోకి ఎన్నో గ్రంథాలు తర్జుమా చేసే అనువాదకురాలిగా, నేను సుకుమా జిల్లా కలెక్టర్‌గా నేడు మీముందు అత్యున్నత హోదాల్లో నిలబడి ఉన్నామంటే అందుకు కారకులు రఘు మాస్టారే. మేమీ స్థాయికి ఎదగటానికి ముఖ్య కారకులు ఆ కర్మయోగే. సూర్యవంశ తిలకుడైన రఘురామునిలాగే రఘు మాస్టారు కూడా మా పాలిట దేవుడు. ఈ మహానుభావుడిని భుజాలపై మోసి, కారులోనూ గూడెంలో ఊరేగించాలని వచ్చాను’ అంటూ ఆనంద భరితుడయ్యాడాయన. తొలుత రఘు చిటికెన వేలు పట్టుకొని నడిచిన అయోధ్య సుకుమా జిల్లా కలెక్టర్ అయ్యాడని తెలియగానే సభికులంతా ఆనంద సంబరంలో మునిగిపోయారు. ఊరుఊరంతా బాణసంచా కాల్పులతో వెలిగిపోయింది.
స్ఫూర్తిదాయకులైన ఇలాంటి వ్యక్తులు మహోన్నత శక్తులంటూ గూడెం వాసులు, సభకు వచ్చిన అతిథులు, అధికారులు, అనధికార ప్రముఖులు శ్లాఘించారు. సభంతా వారి కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. ‘ప్రతి ఇంటా ఓ ఉద్యోగి! కళకళలాడుతున్న ఓ మారుమూల గిరిజన గ్రామం శ్రీరాంపురం. ఆ ప్రగతికి అంకురార్పణ చేసిన ఉత్తముడు రఘు మాస్టారు’ అంటూ పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయి. కవి, గాయకుడు, నటుడైన తను స్వయంగా రాసిన పాట ‘వెలిగించు సూర్యుడా దీపం.. మారాలి మన్యముల రూపం’ అంటూ ఒకప్పటి తన తోటి కళాకారులు మైక్‌లో వినిపిస్తుండగా ‘నేడు జరిగిన ఈ సన్మానం అహరహం విద్యార్థుల బంగరు భవిత కోసం ఆరాటపడే సమస్త ఉపాధ్యాయ లోకానికి జరిగిన సన్మానంగా భావిస్తాను’ అంటూ సగర్వంగా ప్రకటించాడు రఘు మాస్టారు. తన కనుకొలకుల నుంచి రాలిపడుతున్న ఆనందబాష్పాలను తుడుచుకుంటూ గద్గద స్వరంతో రఘు పలికిన ఆ తుది పలుకులు నాటి చల్లని సాయం సమయాన్ని మరింత శోభాయమానం చేశాయి.

- సంపటం దుర్గాప్రసాద్, చరవాణి : 8468965401