సాహితి

వచన కవిత్వానికి వైభవం తెద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపసవ్య దిశలో అడుగులేస్తున్న సామాజిక జీవితాన్ని ఎత్తిచూపుతూ, అందలి తప్పిదాలను తట్టి చెబుతూ పొరపాట్లను విప్పి చూపిస్తూ సమాజాన్ని సవ్యమైన మార్గంలో పెట్టేందుకు దోహదపడే కళారూపాల్లో ‘‘సాహిత్యం’’ ప్రముఖమైనదిగా పేర్కొనవచ్చును. మనస్సులను మలినపరుస్తున్న అనేకానేక సామాజిక రుగ్మతలను ఎండగట్టి, వ్యక్తిగత స్వార్థం నుంచి మనిషిని వ్యవస్థాగత చైతన్యం వైపుకు నడిపే సాహిత్యాన్ని సమాజం ఇవాళ ఎంతవరకు ఆదరిస్తుందో పరిశీలించినట్లయితే ‘‘చెవిటి వాని ముందు శంఖం ఊదిన’’ చందంగానే తోస్తుంది. నేడు మనిషి పోకడలు ఒక తీరులో వుంటే సాహిత్యం నడక మరోదారిలో పయనిస్తున్నట్లుగా తోస్తుంది.
మనిషిని వ్యాపార వస్తువుగా మారుస్తున్న సామ్రాజ్యవాద భావజాలం, ఎంతో ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా, అభ్యుదయం తళుకులతో మన సంస్కృతి సంప్రదాయాల మీద పెత్తనం సాగిస్తుంది. దీని అంతరాత్మ క్షణాల మీద సంక్లిష్టమైన అవినీతి నిర్ణయాలతో ఆర్థిక లాభాపేక్షను ఊహించడమే! దీని ఆర్థిక యావ ముందు సమస్త కళలు, తమ మూలాలను మరచి క్షణికమైన ఆనందాన్నిచ్చే మానవీయతా మూలాలకు ఎసరు పెట్టే నవనాగరికతా వ్యామోహాలను కల్పించే స్థితికి జారిపోతున్నాయి. మానవ స్వభావాన్ని యాంత్రిక స్వభావంగా మారుస్తూ, అధునాతన ‘టెక్నాలజీ’ని మానవ వినాశనానికి తోడ్పడే యుద్ధసామాగ్రి తయారీలో ఉపయోగించుకొంటూ, మనిషిని మానసిక పిచ్చిని పెంచే, వ్యసనాల్లోకి దిగజారుస్తూ ప్రపంచీకరణ వంచనలు మన హృదయాల్లో చోటు సంపాదించగలిగాయి.
మనిషి సమాజంలో ఒంటరైపోతున్నాడు. తన ముందు తలలెత్తే పరిస్థితుల ముందు అల్పుడుగాను, అసహాయుడుగాను మిగిలిపోతున్నాడు. సాహిత్య రంగంలో పుట్టుకొచ్చిన దళిత, మైనారిటీ, స్ర్తి వాదాలు, అస్తిత్వవాదాలు భౌతిక, ఆధ్యాత్మిక వాదాలు సైతం అప్పుడప్పుడు అంతో ఇంతో సామ్రాజ్యవాద భావజాలం మత్తులోకి జారిపోతున్నాయి. ఆధిపత్య వర్గాల తాత్త్విక దృక్పథాన్ని అనుకరిస్తున్నాయి.
ఎలక్ట్రాన్ మీడియా మనిషిని మనిషితనం నుండి ఊడబీకే శక్తివంతమైన సాహిత్యాన్ని కుప్పలు తెప్పలుగా కుమ్మరిస్తుంది. ప్రేక్షకులను సాదె కబుర్లతో, నీతిమాలిన ‘‘సెక్స్ సీన్స్’’తో పుస్తక పఠనాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇవాళ పుస్తకాలు అంటే తప్పనిసరిగా చదవాల్సిన పాఠ్యపుస్తకాలుగానే పరిగణిస్తున్నారు. సాహిత్యానికి సంబంధించిన కవిత్వంగాని, కథలుగాని, నవలలు గాని కొన్ని ఆసక్తికరంగా చదివే పాఠశకులను వేళ్ళమీద లెక్కకట్టొచ్చు.
కవిత్వం గూర్చి మాట్లాడాలంటే, దేశ, కాలాతీత మానవ భాష మాట్లాడేది కవిత్వం. ఇది సిద్ధాంతం, భావజాలం, దృక్పథం, వస్తువు, రూపం, సారం, చైతన్యం, కళ, సౌందర్యం, సైన్స్, ప్రగతి అభ్యుదయం, సామాజిక రుగ్మతలు ఇంకా ఎనె్నన్నింటినో గూర్చి మాట్లాడుతుంది. మనిషి వివేకము, విచక్షణతో మనగలిగే మర్మాన్ని విప్పి చెప్తుంది. కవిత్వం, సమాజం పట్ల బాధ్యత, విధివిధానలపట్ల నిబద్ధత కలిగియుండి ప్రజల కన్నీరు తుడిచి జీవితానికి వోదారి చూపించే ఆలోచనా జ్ఞానాన్ని కవిత్వం ఇస్తుంది. జాతిని జాగృతం చేస్తుంది. అపోహల్లోను, భ్రమల్లోను ఉన్న జనాన్ని చైతన్యపరచి రుజుమార్గంలో నడిపించే పథకాల రచనకు తగిన జ్ఞాన సంపదనిస్తుంది.
కవిత్వం ఇంతటి మేలు చేస్తున్నప్పుడు, దీనిని జనం ఎందుకు ఆదరించడం లేదు? పాఠకులు ఎందుకు కరువవుతున్నారు? ఎందుకు తెలుగు వాచకాలలో మన కవిత్వానికి తగిన చోటు లభించడం లేదు? అనే ప్రశ్నలు ఈ సమాజాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. వీటికి సమాధానాలు మాత్రం సరైన రీతిలో రావడం లేదు. కవిత్వం మీద జనాధరణ తగ్గడానికి కారణం కవిత్వంలో లోపమా? ఈ వ్యవస్థ లోపమా?
నేటి వచన కవిత్వం బలమైన గొంతుకతో, లోతైన అభి వ్యక్తితో భౌతికవాదంతో, ఆధునిక విజ్ఞానంతో, సామాజిక ఆర్థిక, రాజకీయ, తాత్త్విక, నైతిక శాస్త్రాల నేపథ్యంతో, హేతుబద్ధమైన వివేచనతో ఆవిష్కరింపబడుతుంది. సామాన్యుని జీవిత విధానాలను ఉన్నతీకరించే భావజాలం పుష్కలంగా ఉంటుంది. ఈ కవిత్వం మనిషి మనుగడకు దారి చూపిస్తుందే కాని, మరణానంతర ఊహల్లో ద్యోతకమయ్యే స్వర్గసీమలకు వెళ్ళడానికి మార్గం చూపించలేదనే సంప్రదాయ మూఢ విశ్వాసాల ముందు ఓడిపోతుంది. అదీగాక వచన కవిత్వాన్ని పదిమందిని చేర్చి కవితా పఠనం చేసే సహృదయులైన కవులు కనపడరు. సామాన్య జనాన్ని సాయంకాలమో, తీరిక సమయాల్లో ఒకచోట సభగా చేర్చి వచన కవితా గగానం చేయించే సంప్రదాయం ఇంకా మనకు అలవడలేదు. వచన కవి సమ్మేళనాలు జరుగుతాయి, అందులో కవులే వుంటారు. కవిత చదివాక ఇతరుల కవిత్వాన్ని వినకుండా వెళ్ళిపోయే ప్రబుద్ధులే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వచన కవిత్వం సామాన్య జనంలోకి తన భావాలను మోసుకపోగలుగుతుందా? సామాజిక చైతన్యాన్ని రేకెత్తించగలుగుతుందా? అనే ప్రశ్నలు సూదుల్లా గుచ్చుకుంటుంటాయి. అందులోను ‘‘పాట’’ ప్రక్రియ జానపదులకు సంబంధించింది. జన బాహుళ్యంలోకి తేలిగ్గా చొచ్చుకపోగలుగుతుంది. వచన ప్రక్రియ మనది కాదు. ఇది పాశ్చాత్య సాహిత్య ప్రక్రియల్లోంచి వలస తెచ్చుకొనినది. అదీగాక నేటి వచన కవిత్వ ధోరణి ఆధునికానంతర భావాలతో, వస్తుశూన్యతలోని జారిపోయి, అసంబద్ధమైన పదబంధాలతో, పొందికలేని ప్రతీకలతో, సైకో అభివ్యక్తితో పాఠకుణ్ణి కన్‌ప్యూజన్ స్థితిలోకి తీసుకపోయే విధంగా ఉంటుంది. ఇది రాసిన కలికి తప్ప ఇతర పాఠకులకు ఒక మాత్రాన అర్థమయ్యే స్థితిలో ఉండదు. ఈ విధానం కూడా వచనకవిత్వం సామాన్య జనంచే ఆకర్షింపబడడం లేదు. అంతా ఇలా వుంటుందని అనుకోకూడదు.
నేడు వెలువడే వచన కవిత్వం ఎక్కువ భాగం, నడుస్తున్న కాలాన్ని అవగాహనించుకుంటూ, వర్తమాన జీవితాన్ని స్పర్శిస్తూ మనిషి ఆలోచనా సరళిని మార్చి అంతర్గత చైతన్యాన్ని కదిలించే విధంగా ఉంటుంది అనడంలో ఎట్టి సందేహమూ లేదు. వచన కవిత్వం అంటే ఛందోబద్ధం కానిదని, ఎట్టి నియమాలు లేనిదని, వాక్యాలను ముక్కలుగా చేసి పేరిస్తే సరిపోతుందని భావించే కవులు కోకొల్లలయ్యారు. అవార్డుల కోసం, రివార్డులకోసం ఎగబడుతూ కవిత్వంలో ‘‘తడి’’ లేకుండా ‘‘పట్టుడువడి’’ పెంచుకొంటూ కాలికి బలపం కట్టుక తిరుగుతున్నారు. ఇది కూడా వచన కవిత్వం అపకీర్తిలోకి జారిపోడానికి కారణమై కూర్చుంది.
కవికి కవిత్వమే కాదు మనుషులతో కలసి మెలసి ఉండడం కూడా ముఖ్యం. కవిత్వ స్పృహతో కవిత్వం రాయాలేకాని ఆర్థిక స్పృహతో కాదు. ఆధిపత్య వర్గాలు కల్పించే లాభాపేక్షతో కాదు. పాలకవర్గాల దోపిడీలను, పెత్తందార్ల దౌర్జన్యాలను, కుటిల రాజకీయాల కుట్రలను, కుల, మతాల కుళ్లును త్రోసిపుచ్చే కవిత్వాన్ని వినిపించే కవి సంఘాలు ఏర్పడాలి. ప్రతి తాలూకాలోను కనీసం నెలకొక సభనైనా నిర్వహించి సామాన్య జనం సభకు హాజరయ్యే విధానాల్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ విషయంలో కవులంతా కలసి ప్రణాళిక బద్ధమైన కార్యాచరణను నిర్వహించే విధి విధానాలను ఏర్పాటుచేసుకోవాలి. ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలను సాహిత్యాభిమానులైన వారి నుంచి పొందవచ్చును. కార్యాచరణ కొనసాగాలే కాని జనంలో మంచి స్పందన వస్తుందని ఆశిద్దాం మన వచన కవిత్వానికి వైభవం తెద్దాం!

- కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, 9948774243