విజయవాడ

ఏరా.. బాగున్నావా..! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏరా.. బాగున్నావా?
ఎన్నాళ్లైంది ఈ పిలుపు విని
ఆ పిలుపులోని ఆప్యాయత
అనురాగం, ఆర్ధ్రత
ఎన్నాళ్లైంది వీటిని అనుభవించి
జౌను..
చదువు కోసమని, ఉద్యోగమని
కన్నతల్లిని, ఉన్న ఊరిని
అయినవారందరినీ విడిచి
ఆశగా పరుగెత్తాను
ఎండమావుల్లాంటి విదేశాల వైపు
కావాల్సినంత సంపాదించాను
ధగధగలాడే భవనాలు
కట్టుకున్నాను
అయినా.. ఏదో వెలితి
విజయం సాధించినప్పుడు
భుజం తట్టి అభినందించేవాళ్లు
కుంగిపోయిన సమయాల్లో
ఓదార్చేవాళ్లు లేనపుడు
ఎంత సంపాదించినా ఏంలాభం?
డబ్బుతో దేన్నైనా కొనగలం
ఒక్క స్వచ్ఛమైన ప్రేమను తప్ప
ఎన్నాళ్లకో తిరిగొచ్చిన నన్ను
బాబాయిలు, చిన్నమ్మలు
పెద్దమ్మలు, పెదనాన్నలు
తాతయ్యలు, బామ్మలు
ఏరా.. బాగున్నావా? అని
పలకరిస్తుంటే
ఏదో చెప్పలేని అనుభూతి
గుండెల్లో ఒకలాంటి ఉద్వేగం
కళ్లల్లో సుడులు తిరుగుతున్న నీళ్లు
ఆనందమో.. దుఃఖానందమో!
ఈ ఆనంద భాష్పాలదేబంధమో?
ఎవరిని చూసినా
మాటల్లేని వౌనభాష
ముడతలు పడిన ముఖంతో
ఎండిపోయి నీరింకిన కళ్లతో
వౌనంగా చూస్తూ
ప్రశ్నిస్తోంది అమ్మ
‘ఏరా! ఇక్కడే ఉంటావా?
మళ్లీ వెళ్లిపోతావా?!
నేను పోయినప్పుడు వచ్చి
కనీసం కాసింత మట్టైనా వేసిపో..’
అంతే..
ఒక్కసారిగా అమ్మను పట్టుకొని
బావురుమన్నాను
‘అమ్మా! ఇక వెళ్లనమ్మా..
ఈ ఆప్యాయతలు,
అనురాగాలు
ఈ స్వచ్ఛమైన ప్రేమను విడిచి
ఎక్కడికీ వెళ్లనమ్మా..
ఇంకెక్కడికీ వెళ్లను
మీతోనే ఉంటాను
మీ మధ్యనే ఉంటాను
ఇక్కడే చనిపోతాను
తిరిగి ఇక్కడే పుడతాను’!
ఏడ్చిఏడ్చి వాన వెలిసిన మబ్బులా
నా ముఖం
స్వచ్ఛంగా నిర్మలమైన ఆకాశంలా
నా మనసు
ఒక్కటే తీర్మానించుకున్నాను
సంపాదన లేకపోయినా పర్వాలేదు
నాకు అమ్మ కావాలి
నావాళ్లు కావాలి
ఈ గాలి, స్వచ్ఛమైన ప్రేమ కావాలి
అందుకే ఇక ఎక్కడికీ వెళ్లను
ఇక్కడే కనుమూస్తాను
ఇక్కడే మళ్లీ పుడతాను!
యనమాల సుందర్,
ఫిరంగిపురం
చరవాణి : 9032319508

మాటల మరాఠీ

వాడు మాటల మరాఠి
వేదికలెక్కితే
మాటల మయసభలు
నిర్మించగలడు
మానవ సంబంధాల
విచ్ఛిత్తి మీద
గంటల తరబడి
ఉపన్యసించగలడు
వేదిక దిగితే
ఎవ్వరితోనూ మాటల్లేవు
ముఖపుస్తకంలో
మునిగిపోతాడు
సగం శరీరం
కోసుకుపోయినా
సోయి వుండదు వాడికి
ఫేస్‌బుక్ పురుగువాడు!
- మండవ సుబ్బారావు,
కొత్తగూడెం.
చరవాణి : 9493335150

అక్షర చేతన

హృదయ కుహరం నుంచి
అవిద్యను పెకలించి
మేధకు సుజ్ఞాన దీప్తిని
నెరుపుతుంది అక్షరం
అక్షరం కామధేనువు
అక్షరం కల్పతరువు
అక్షరాన్ని ప్రేమిస్తే
అక్షరాన్ని పూజిస్తే
అక్షరాన్ని ప్రార్థిస్తే
జీవితం వడ్డించిన విస్తరే!
అక్షర వికాసపుంజం
అందరిలో విప్పారితే
సౌభ్రాతృత్వం కుదురుకుంటుంది
మనిషితనం పరిమళిస్తుంది
చదువు మనిషిని
నాగరికునిగా సంస్కరిస్తుంది
చదువులేని మనిషి
సంపూర్ణుడు కాజాలడు
విద్యపై ప్రత్యేక శ్రద్ధతో
అక్షర చేతన సంతరించుకోవాలి
జన్మనిచ్చిన తల్లిదండ్రులు
పూజ్య గురువులు, పెద్దలు
దైవం, దేశం పట్ల
ఆరాధనా భావంతో నడుచుకోవాలి
విద్య మూఢనమ్మకాల గుట్టువిప్పి
విజ్ఞాన వీచికల్ని ప్రసరిస్తుంది
అనంత విశ్వరహస్యాలను
ఎరుకపరుస్తుంది
విద్య భవ్యజాతి అంకురాల
భవిష్యత్‌ను
వసంతోదయం చేస్తుంది
మానవ సంబంధాల మైత్రిని
కలకాలం పదిలపరుస్తుంది
పసిడి మిసిమి మొగ్గల్లారా..
రేపటి పౌరుల్లారా..
అక్షర సుగతికి నడవండి
విద్యలవాణి సరస్వతికి
స్వాగత తోరణాలుకండి
చదువు ప్రగతికి పునాది
చదువు జీవనగతికి
నవ ఉగాది!
- సందుపట్ల భూపతి,
మంగళగిరి
చరవాణి : 9603569889