సాహితి

అస్తవ్యస్త బతుకుల యథార్థ గాథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుకు భూమితో వున్న అనుబంధం విడదీయరానిది. ప్రకృతి మోసం చేసినా, ప్రభుత్వాలు దాగా చేసినా మంచి రోజులు రాకపోతాయా అని అతని నమ్మకం. అలాంటిది రైతు నమ్ముకున్న భూమిని అతనికి తెలియకుండానే, అతనికి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతు వ్యతిరేక విధానాలు ఒకవైపు, మార్కెట్ దోపిడీ ఇంకోవైపు రైతును నిస్సహాయుడిగా మార్చివేశాయి. పచ్చటి పంట పొలాలు బలవంతంగా సెజ్‌లకు అప్పగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటాయి. లేదంటే రియల్ ఎస్టేట్ వారి కన్ను పడిందంటే ఏదోరకంగా ఆ భూమికి నీళ్లు వదులుకోవలసిందే. భూమి ఎలా చేతులు మారుతున్నదో వివిధ కోణాలలో విశే్లషిస్తూ భూమి చుట్టూ అల్లుకున్న అనుబంధాలను, కుటుంబ సంబంధాలను వ్యాపార సంస్కృతి ఎలా దెబ్బతిన్నదో ‘గుండ్లకమ్మ తీరాన’ కథల్లో చూడవచ్చు. గిట్టుబాటు కాని వ్యవసాయం రైతుకు జూదంలా పరిణమించింది. ఇప్పుడు కాకపోయినా మరుసటి పంటకైనా పరిస్థితి బాగుపడకపోతుందా అనే ఆశతో అప్పుల మీద అప్పులు చేసి రైతులు వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అయినా సరే అన్నీ సమస్యలే. ఏ పంట వెయ్యాలో తెలీదు. ఏదో ఒకటి ధైర్యం చేసి వేస్తే అది కొంటారో లేదో తెలీదు. ఇంతకుముందంతా పంట పండేదే గగనం. ఇప్పుడు అమ్ముకోవడం కూడా కనా కష్టమైంది. అసలు సేద్యమే మానేసి ఏ రోడ్డు పనిలో కూలీలుగా పోయింది నయం. ఎటుచూసినా అప్పులు.. వెనుక ఎదిగొస్తున్న పిల్లలు ఏం చేయాలో తెలియని లక్ష్మయ్యకు బుర్రనిండా ఎడతెగని ఆలోచనలు. విరక్తితో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుందామంటే భార్య అది లాక్కుని ధైర్యం చెప్పి తీసుకెళుతుంది. వాళ్ళ కాళ్ళకింది నేల కదులుతుందని గమనించి వాళ్లు అప్రమత్తం అయ్యారని ప్రతీకాత్మకంగా, ఆశావహ దృక్పథంతో కథ ముగించడం బాగుంది. నష్టాలతో, అప్పులతో రైతులు వ్యవసాయం అతికష్టంగా కొనసాగిస్తుంటే వాళ్ళ పిల్లలు అస్సలు పట్టించుకోవడంలేదు. భూములు అమ్మి వ్యాపారాలు చేసుకుంటామని ఒకటే వేధింపులు. చదువులు అబ్బక, వ్యవసాయ పనులకు ఒళ్ళు వంగక తిని తిరగడం, పేకాట, తాగుడు నేర్చుకుని ఈజీమనీ కోసం వెంపర్లాడుతూ వాళ్ళ తండ్రులకు ఎలా నరకం చూపిస్తున్నారో ‘బతుకుదారి’లో చూడవచ్చు.
ఇంకోవైపు ప్రభుత్వమే సెజ్‌ల పేరిట భూమిని అప్పనంగా పారిశ్రామికవేత్తలకు పంచడానికి రైతుల పొలాలను లాక్కుంటున్నది. లేదా పారిశ్రామిక వేత్తలే సెజ్‌ల కోసం రైతులను నయానో భయానో బెదిరించి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. అలా అని డబ్బుకోసం తన భూమిని వదులుకోవడానికి రైతు సన్నద్ధంగా లేడు. పొలాలు ప్యాక్టరీలైతే పక్కనున్న పొలాలు వ్యవసాయానికి పనికిరావని అంటున్నారు. తన భూమి తనకు కాకుండా చేస్తున్న శక్తులతో చివరిదాకా పోరాడిన వెంకటేశ్వర్లు తన ప్రాణాల్నే పోగొట్టుకోవడంకన్నా విషాదమేముంటుంది? పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులతో కుమ్మక్కై భూములకోసం రైతులను వేధించి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరని ‘గుండ్లకమ్మ తీరాన’ కథ తెలియజేస్తుంది. ఇలాంటి దౌర్జన్యాలను అడ్డుకోవడానికి, తమ భూములను తామే కాపాడుకోవడానికి అంతా కలిసి ఐక్యంగా ఉద్యమించడం ఒక్కటే మార్గమని ‘మనిషి-మట్టి’లో నిరూపిస్తారు.
‘నీడ’ కథలో మట్టిమనిషిని పెళ్లిచేసుకున్న శారద ఆ మట్టిమనిషి ఉనికినే అసహ్యించుకున్నప్పుడు, దళిత మార్తాగ్రేస సన్నిధిలో తను పోగొట్టుకున్నదేమిటో అతను తెలుసుకుంటాడు. చైతన్యం, పట్టుదల మూర్త్భీవించిన మార్తా ప్రజల మనిషి. ఆమె నిస్వార్థ త్యాగం, మంచితనం ముందు శారద అవకాశవాదం, కుచ్చితత్వం పనిచేయవు.
క్రమశిక్షణ పేరిట ప్రత్యక్ష నరకాలుగా తయారై విద్యార్థుల బాల్యాన్ని ఎలా అణచివేస్తున్నారో ‘చదువు’ కథలో చక్కగా చిత్రీకరించారు. తాగునీటి వసతులు లేక, సరియైన వైద్యం లేక తల్లడిల్లే చెంచుగూడేలమీద ఫారెస్టోళ్లు ఒకవైపు, నక్సలైట్లను చేరదీస్తున్నారని పోలీసులు మరోవైపు వాళ్ళమీదపడి వాళ్ళ జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారో ‘ఆకురాలు కాలంలోకి..’ కథలో చూడవచ్చు.
పట్టణీకరణ, వ్యాపార సంస్కృతి విస్తరిస్తున్న ప్రతిచోటా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిని చాలా నిశితంగా పరిశీలించిన కాట్రగడ్డ దయానంద్ వీటిని కథలు కథలుగా మలచి మనకందజేస్తున్నారు. అలాగే కుటుంబ సంబంధాలను, మానవ సంబంధాలను నియంత్రించడంలో డబ్బు నిర్వహిస్తున్న పాత్ర గురించి తెలియజేశారు. కార్పొరేట్ విద్య, వైద్యం సామాన్యునికి అందనంత ఎత్తులో విస్తరిస్తున్నాయి. వీటితోపాటు ప్రభుత్వం వారి సరళీకృత ఆర్థిక విధానాలవల్ల సామాన్యులే కాదు, రైతులు, ఉద్యోగులు, గిరిజనుల బతుకులు కూడా అస్తవ్యస్తమైపోతున్నాయని దయానంద్ తన కథల ద్వారా తెలియజేసిన విధానం బాగుంది.

- కె.పి.అశోక్‌కుమార్