కృష్ణ

గ్రామ స్థాయ నుంచి అగ్రపీఠానికి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ సామాన్య కార్యకర్త ముప్పవరపు వెంకయ్య నాయుడు బిజెపి జాతీయ నాయకుల సభలకు గుర్రపు బండిలో మైక్ ప్రచారం చేసి, గోడలపై పోస్టర్లు అంటించి, వీధుల్లో జెండాలు కట్టి అంచలంచెలుగా ఎదిగి పార్టీ జాతీయ అధ్యక్షునిగా అదే నాయకుల వరస కూర్చుని.. తాజాగా ఈ దేశానికే ఉప రాష్టప్రతి కాబోతుండటం పట్ల కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తవౌతోంది. ప్రస్తుతం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకయ్య నాయుడు దక్షిణాది ప్రాంతానికి పార్టీ పెద్దదిక్కు అయినప్పటికీ ప్రధానంగా కోస్తా ఆంధ్రలో అన్ని ప్రాంతాల వాసులకు చిరపరచితులు. అన్ని వర్గాల, అన్ని వయస్సుల వారితోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. నెల్లూరు జిల్లాలో కనీసం రహదారి, విద్యుత్ సౌకర్యం కూడా లేని చవటపాలెం గ్రామంలో జన్మించిన వెంకయ్య నాయుడులో చిన్న వయస్సు నుంచే వెన్నంటి వస్తూన్న క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పార్టీ పట్ల అంకితభావం ఆయనను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో చదువుతూ జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వెంకయ్య నాయుడు కోస్తా ఆంధ్రలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రధానంగా నాటి నుంచి నేటి వరకు విజయవాడతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. 1978, 83 ఎన్నికల్లో ఉదయగిరి నుంచి అసెంబ్లీకి గెలిచిన వెంకయ్య నాయుడు 85లో ఆత్మకూరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్, బాపట్ల నుంచి లోక్‌సభకు పోటీచేసి రెండుసార్లు ఓటమి పాలయ్యారు. ఏబివిపి నేతగా, జనతాపార్టీలో యువజన విభాగం అధ్యక్షునిగా, బిజెపిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరిగారు. వెంకయ్య ప్రశంసల కోసం విపక్షాల వారు కూడా చెవికోసుకునేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు పెద్దదిక్కుగా నిలిచారు. దాదాపు 15 మంది కేంద్ర మంత్రులను వివిధ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. గన్నవరంలో తన కుమార్తె నాయకత్వంలో స్వర్ణ్భారతి ట్రస్ట్ ఏర్పాటుచేసిన తర్వాత నెలలో రెండుసార్లు తప్పనిసరిగా వస్తున్నారు. ఉప రాష్టప్రతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వం ఖరారైన మరుక్షణమే బిజెపి నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. వెంకయ్య నాయుడు ఇటీవల ఇక్కడ జరిగిన ఓ సభలో తనకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంతో శ్రద్ధాశక్తులున్నాయంటూ మొత్తం ఐదు రాష్ట్రాల బాగోగులు చూసుకోవాల్సి ఉందన్నారు. పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్, రాజకీయంగా ఎదుగుదల తెలంగాణ, నివాసం తమిళనాడు, కర్నాటక నుంచి 18 ఏళ్లపాటు రాజ్యసభకు ప్రాతినిధ్యం, ప్రస్తుతం రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం. అందుకే ఈ ఐదు రాష్ట్రాల కోసం తాను ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని చెప్పారు. ఇక ఉప రాష్టప్రతిగా ఆయన ఏవిధంగా వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే.