విశాఖ

ఏజెన్సీలో ప్రతి గ్రామంలో పంట సంజీవని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 20: విశాఖ మన్యంలోని ప్రతి గ్రామంలో పంట సంజీవని యూనిట్లను నెలకొల్పాలని పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని పదకొండు మండలాల పరిధిలో 13 వేల 750 పంట సంజీవని యూనిట్లను నెలకొల్పాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. అయితే వీటిని నెలరోజులలోగా సాధించాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీలో ఇంతవరకు 8 వేల 537 పంట సంజీవని యూనిట్లను గుర్తించగా, 6 వేల 536 యూనిట్లకు పరిపాలనపరమైన అనుమతి మంజూరు చేసినట్టు ఆయన చెప్పారు. పరిపాలన అనుమతులు మంజూరైన వాటిలో 2 వేల 656 యూనిట్ల పనులు ప్రారంభమైనట్టు ఆయన పేర్కొన్నారు. అయితే మిగిలిన యూనిట్లను కూడా త్వరితగతిన గుర్తించి పనులు ప్రారంభించి నెల రోజులలోగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గిరిజన ప్రాంతంలో 30 వేల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 19 వేల మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయని, మిగిలిన వాటిని కూడా సత్వరమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. లేబర్ బడ్జెట్ కింద అందుబాటులో ఉన్న 63 లక్షల రూపాయలలో 53 లక్షల రూపాయల పనులు మాత్రమే చేయగలిగారని, మిగిలిన పది లక్షల రూపాయల పనులను కూడా త్వరితగతిన చేపట్టాలని ఆయన అన్నారు. ఫీల్డు అసిస్టెంట్లు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైతే వారి వేతనాలు నిలుపుదల చేయాలని ఉపాధి హామీ పథకం ఎ.పి.ఒ., ఎం.పి.డి.ఒ.లను ఆయన ఆదేశించారు. ఉపాధి పథకం కింద చేసిన పనులకు మూడు రోజులలోగా వేతనాలు చెల్లింపు శతశాతం జరగాల్సిందేనని ఆయన అన్నారు. పంట సంజీవని, మరుగుదొడ్లు, భూమి చదును, ట్రెంచస్ వంటి పనుల ఫొటోలను తీసి భువన యాప్‌కు అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం కాఫీ బోర్టు దగ్గర ఉన్న ట్యాబ్స్ వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. ఏజెన్సీలోని పదకొండు మండలాలలో గిరిజన బాల, బాలికలలో క్రీడల పట్ల ఆశక్తి కలిగించేందుకు అన్ని ప్రభుత్వ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, జాగింగ్ ట్రాక్‌లను నిర్మించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీలో ఈ సంవత్సరం 12 వేల ఎకరాలలో కాఫీ, 15 వేల ఎకరాలలో సిల్వర్ ఓక్ చెట్లను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించి, కాఫీకి 80 శాతం, సిల్వర్ ఓక్‌కు వంద శాతం అనుమతులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. లక్ష సాధనలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని రవిసుభాష్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డ్వామా పి.డి. కళ్యాణ చక్రవర్తి, ఉపాధి హామీ పథకం ఎ.పి.డి. లచ్చన్న, గిరిజన సంక్షేమం, పంచాయతీ రాజ్ శాఖల పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎస్.శ్రీనివాస్, వై.నర్సింగరావు, గృహ నిర్మాణ సంస్థ ఇ.ఇ.కుర్మినాయుడు, ఎం.పి.డి.ఒ.లు, ఉపాధి హామీ పథకం ఎ.పి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.